
చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. సామాన్యుల నుంచి దేశాధినేతల వరకు ఎవరనీ వదిలిపెట్టడం లేదు ఈ మహమ్మారి. గతంలో యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రిన్స్ ఫిలిప్స్ సహా మరి కొన్ని దేశాల అగ్రనేతలు కరోనా వైరస్ బారినపడి.. చికిత్స అనంతరం కోలుకున్నారు. ఇప్పుడు కరోనా వైరస్ మరో దేశాధ్యక్షుడికి సోకింది. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో (65)కు ఇటీవల కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన ఆస్పత్రిలో టెస్ట్ చేయించుకున్నారు. ఆయనకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లి చికిత్స పొందుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో రెండో స్థానం
గత ఏడాది డిసెంబర్‌లో చైనా వుహాన్ సిటీలో మొదలైన కరోనా వైరస్ వ్యాప్తి కొద్ది నెలల్లోనే ప్రపంచం మొత్తాన్ని కమ్మేసింది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా అంటుకుంటున్న ఈ వైరస్ ఆరు నెలల్లోనే కోటి మందికి సోకింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1,18,35,174 మంది కరోనా బారినపడ్డారు. ఈ మొత్తంలో 5,43,318 మందిని ఈ మహమ్మారి బలి తీసుకుంది. అయితే ఇప్పటి వరకు చికిత్స తర్వాత 67,98,750 మంది చికిత్స తర్వాత కరోనాను జయించారు. ప్రస్తుతం 44,93,106 మంది చికిత్స పొందుతున్నారు. ప్రపంచంలో అత్యధికంగా అమెరికాలో 30 లక్షల మందికి పైగా కరోనా బారినపడగా.. దాని తర్వాత రెండో స్థానంలో బ్రెజిల్ ఉంది. బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 16,43,539 మందికి కరోనా సోకింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల విషయంలో 7 లక్షల పైచిలుకు కేసులతో భారత్ మూడో స్థానంలో ఉంది.