వేములవాడ రాజన్న ఆలయంలోనూ బ్రేక్​ దర్శనాలు

వేములవాడ రాజన్న ఆలయంలోనూ బ్రేక్​ దర్శనాలు
  • శ్రావణమాసం సందర్భంగా షురూ 
  • ఉదయం, సాయంత్రం వేళల్లో అనుమతి 

వేములవాడ, వెలుగు :  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో బ్రేక్​ దర్శనాలను సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్టు ఆలయ ఈవో వినోద్​ రెడ్డి తెలిపారు. సోమవారం శ్రావణమాసం ప్రారంభమవుతున్నందున బ్రేక్​ దర్శనాలను ప్రతి రోజు రెండు సార్లు ఏర్పాటు చేశామన్నారు. బ్రేక్ దర్శనం టికెట్ రూ.300గా నిర్ణయించినట్టు చెప్పారు.

పదేండ్లలోపు చిన్నారులను ఉచితంగాఅనుమతిస్తామని, ప్రతి రోజూ ఉదయం 10.15 నుంచి 11.15 గంటల వరకు ఒకసారి, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు మరోసారి బ్రేక్ దర్శనం ఉంటుందన్నారు. ఈ టికెట్ తీసుకున్న భక్తులకు 100 గ్రాముల లడ్డూ ఉచితంగా అందిస్తామన్నారు. బ్రేక్ దర్శన టికెట్లు ఆన్​లైన్​లో కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ఇది కేవలం దర్శనానికి మాత్రమేనని, గర్భగుడి దర్శనానికి సంబంధం లేదన్నారు.  

శ్రావణ మాస వేడుకలు ఇలా.. 

శ్రావణ మాసంలోని సోమవారాల్లో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం మహాలింగార్చన ఉంటుంది. శుక్రవారాల్లో శ్రీరాజరాజేశ్వరీ దేవి, శ్రీమహలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు ఉంటాయని ఈవో తెలిపారు. ఆగష్టు 19 రాఖీ పౌర్ణమి, 26న గోకులాష్టమి సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అద్దాల మండపంలో డోలోత్సవం, ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహిస్తారమన్నారు.

30న  శ్రావణ బహుళ ఏకాదశి పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీసీతా రామచంద్రస్వామి వారికి ప్రత్యేక పూజలుంటాయన్నారు. సెప్టెంబర్ 1న పూర్ణాహుతి, రుద్ర హవనం,  మహా లింగార్చన ఉంటుందన్నారు. శ్రావణమాస అది, సోమవారాల్లో గర్భాలయ అభిషేకం, అన్నపూజలు ఉండవని చెప్పారు. రద్దీకి అనుగుణంగా ఇతర సేవల వేళల్లో మార్పులు ఉండవచ్చన్నారు.