పోలీస్​ డిపార్ట్​మెంట్ స్పెషల్​ బ్రాంచ్​లో..ఏండ్లుగా తిష్ట

పోలీస్​ డిపార్ట్​మెంట్ స్పెషల్​ బ్రాంచ్​లో..ఏండ్లుగా తిష్ట
  •     పలుకుబడితో పాటు ఇన్​కమ్​
  •     పొలిటికల్ పవర్​తో ట్రాన్స్​ఫర్లకు బ్రేక్
  •     సీఎం రేవంత్​ గవర్నమెంట్​కు చేరిన సమాచారం
  •     ఫైళ్లను పరిశీలిస్తున్న సీపీ కల్మేశ్మర్​


నిజామాబాద్, వెలుగు : పోలీస్​ డిపార్ట్​మెంట్​లో స్పెషల్ ​బ్రాంచ్(ఎస్బీ) వింగ్​చాలా కీలకమైంది. వీరు యాంటీ సోషల్​ఎలిమెంట్స్, దేశవిద్రోహులు, రౌడీల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించి లా అండ్​ఆర్డర్​సమస్యలను ప్రభుత్వానికి ముందుగానే రిపోర్ట్​చేస్తారు. పదేండ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్​కు ఈ శాఖలో ఇన్​ఫార్మర్లు ఉన్నారనే సమాచారంపై కాంగ్రెస్​గవర్నమెంట్​సీరియస్ గా​నజర్​పెట్టింది. ఎలాంటి ట్రాన్స్​ఫర్లు లేకుండా ఏండ్లుగా జిల్లాలో కొనసాగుతున్న వారి వివరాలు సేకరిస్తోంది. మూడేండ్లకు మించి ఎలాంటి బదిలీలు లేకుండా జిల్లాలో డ్యూటీలు చేస్తున్న ఎస్బీ ఆఫీసర్ల సీక్రెట్ చిట్టాను సీపీ కల్మేశ్వర్​ పరిశీలిస్తున్నారు.

ఎనిమిదేండ్ల నుంచి ఒకే చోట.. 

బీఆర్ఎస్​ పాలకులు ఈ వింగ్​ను తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. పార్టీకి విధేయులుగా ఉన్న ఆఫీసర్ల జోలికి వెళ్లొద్దనే ఆదేశాలతో ఇన్నాళ్లు సైలెంట్​ వాతావరణం నడిచింది. జిల్లాలో మొత్తం 15 మంది ఆయా స్థాయి ఆఫీసర్లుండగా ఐదుగురు ఎనిమిదేండ్లకు పైగా, మరో ఏడుగురు ఐదేండ్లకు మించి విధులు నిర్వహిస్తున్నారు. ఆరు నెలల కింద నిజామాబాద్​ అర్బన్, బోధన్​లో విధులు నిర్వహించే ఇద్దరు ఎస్బీ ఆఫీసర్లను ట్రాన్స్​ఫర్ ​చేయగా, క్షణాల వ్యవధిలో వాటిని రద్దు చేస్తూ ఆర్డ ర్స్​జారీ అయ్యాయి.

దీన్ని బట్టి వారికి పొలిటికల్ గా ఎంత సపోర్ట్​ ఉందో ​అర్థం చేసుకోవచ్చు. బాన్సువాడకు చెందిన బీఆర్ఎస్ లీడర్​ సోదరుడైన ఓ ఎస్బీ ఆఫీసర్ ​ఇన్నాళ్లు తనకు ట్రాన్స్​ఫరే ఉండదనే ధీమాతో ఉన్నారు. ఆర్మూర్​ సెగ్మెంట్​లో విధులు నిర్వహిస్తున్న ఎస్బీ ఇన్​చార్జి తీరూ అలాగే ఉంది. నిర్మల్ జిల్లా నుంచి వచ్చి ఓ ఆఫీసర్ ​ఐదేండ్లుగా కీలక పోస్ట్​ లో కొనసాగుతున్నారు. మిగతా నియోజకవర్గాల్లోనూ ఐదేండ్లకు మించి పనిచేస్తున్న వారు ఉన్నారు. వీరిపై బీఆర్ఎస్ ​ముద్ర ఉండగా, ప్రభుత్వం మారడంతో వారిని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గరిష్ఠంగా మూడేండ్లు ..

స్పెషల్​ బ్రాంచ్​ విధులు చాలా కీలకమైనవి. పాస్​పోర్ట్​ అప్లికేషన్ల వెరిఫికేషన్​, గవర్నమెంట్​ జాబ్​లు వచ్చిన వారి నేర చరిత్ర, విదేశాలకు వెళ్లేందుకు పాస్​పోర్టులు, వీసాలు ఉన్న వారికి పోలీస్​ క్లియరెన్స్​సర్టిఫికెట్ల (పీసీసీ) జారీ తదితర విధులు నిర్వర్తిస్తారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల వ్యూహాలను ఆరా తీసి నివేదించే బాధ్యత కూడా ఈ శాఖ ఆఫీసర్లపై ఉంటుంది.

యూనిఫామ్​ లేకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటూ డ్యూటీ చేసే ఎస్బీ ఆఫీసర్లను అందరూ గుర్తించే లోపే ట్రాన్స్​ఫర్ ​చేయాలి. వీళ్లు గరిష్ఠంగా మూడేండ్లకు మించి ఒకేచోట పనిచేసే ఛాన్స్​లేదు. ఈ నిబంధనలు జిల్లాలో అమలు కానందున అవినీతి బాగా పెరిగింది. కొందరు ఏకంగా లీడర్లకు ఏజెంట్లుగా మారారు.