400 అసాధ్యం కాదు..నా ఆల్‌టైం రికార్డ్‌ను ఆ భారత క్రికెటర్ బ్రేక్ చేస్తాడు: బ్రియాన్ లారా

400 అసాధ్యం కాదు..నా ఆల్‌టైం రికార్డ్‌ను ఆ భారత క్రికెటర్ బ్రేక్ చేస్తాడు: బ్రియాన్ లారా

క్రికెట్ లో అసాధ్యమైన రికార్డులు అంటూ ఏమీ ఉండవు. టాలెంట్ ఉండాలి గాని సాధ్యం కానీ రికార్డ్ అంటూ ఏదీ ఉండదు. అయితే  కొన్ని రికార్డులు మాత్రం బ్రేక్ చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. వాటిలో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా టెస్టుల్లో టెస్టుల్లో నెలకొల్పిన అత్యధిక వ్యక్తిగత స్కోర్. 2004లో ఇంగ్లాండ్ పై లారా టెస్టుల్లో ఏకంగా 400 పరుగులు చేసి ప్రపంచ క్రికెట్  విస్తుగొలిపేలా చేసాడు. 

టెస్టు క్రికెట్ లో అప్పటివరకు ట్రిపుల్ సెంచరీలు మాత్రమే చూసినవారు లారా 400 పరుగులు చేయడంతో ఔరా అనుకున్నారు. లారా చేసిన 400 పరుగుల వ్యక్తిగత స్కోర్ 19 ఏళ్ళు దాటినా ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఈ క్రమంలో ఒక్కరు కూడా లారా రికార్డ్ దరిదాపుల్లోకి వెళ్లలేకపోయారు. కనీసం 350 పరుగుల మార్క్ ఎవరూ టచ్ చేయలేకపోయారు. దీంతో లారా రికార్డ్ ఇక బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యమని అందరూ భావించారు. 

ఇదిలా ఉండగా లారా తన రికార్డ్ ను ఒక భారత క్రికెటర్ బ్రేక్ చేస్తాడని చెప్పాడు. అంతే కాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఈ దిగ్గజ క్రికెటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ 501 పరుగుల రికార్డ్ ను కూడా బ్రేక్ చేస్తాడని చాలా విశ్వాసంగా చెప్పాడు. అతడెవరో కాదు టీమిండియా యువ సంచలనం శుభమన్ గిల్. కోహ్లీ, రోహిత్ లను కాదని గిల్ టాలెంట్ మీద లారా నమ్మకముంచడం విశేషం. 
         
ఆనందబజార్ పత్రికతో లారా మాట్లాడుతూ.. "శుబ్‌మన్ గిల్ నా రెండు రికార్డులను బద్దలు కొట్టగలడు. వాటిలో ఒకటి టెస్టుల్లో న అత్యధిక వ్యక్తిగత స్కోర్ 400. ఈ తరంలో గిల్ అత్యంత ప్రతిభావంతుడైన బ్యాటర్. అతను రాబోయే సంవత్సరాల్లో క్రికెట్‌ను శాసిస్తాడు. అసాధ్యం కాని చాలా రికార్డులను బ్రేక్ చేస్తాడని నేను నమ్ముతున్నాను. గిల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడినట్లయితే 501* రికార్డ్ ను సైతం బద్దలు కొట్టగలడు". అని లారా గిల్ ను తెగ పొగిడేసాడు. అంతేకాకుండా గిల్ భవిష్యత్తులో అనేక ICC టోర్నమెంట్‌లను గెలుస్తాడని జోస్యం చెప్పాడు. 

ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్న గిల్ 44 వన్డేల్లో 61.38 సగటుతో 2271 పరుగులు చేశాడు. టీ20ల్లో 11 మ్యాచ్‌లలో 30.40 సగటు, 146.86 స్ట్రైక్ రేట్‌తో 304 పరుగులు చేశాడు. ఇక 18 టెస్ట్ మ్యాచ్‌లలో 32.20 సగటుతో 966 పరుగులు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ తో పోలిస్తే టెస్టుల్లో గిల్ కాస్త వెనకపడ్డాడనే చెప్పాలి. మరి లారా చెప్పినట్టు టెస్టుల్లో గిల్ ఈ రికార్డులను బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.