T20 World Cup 2024: ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ చేరుతుంది.. వెస్టిండీస్ దిగ్గజం జోస్యం

T20 World Cup 2024: ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ చేరుతుంది.. వెస్టిండీస్ దిగ్గజం జోస్యం

టీ20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ అండర్ డాగ్ గా బరిలోకి దిగుతోంది. అయితే తమదైన రోజున ఎంత పెద్ద జట్టుకైనా ఆఫ్గన్లు అగ్ర శ్రేణి జట్లకు సైతం షాక్ ఇవ్వగలదు. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్, శ్రీలంక, పాకిస్థాన్ జట్లను ఓడించి సంచలనం సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. చివరి వరకు సెమీస్ రేస్ లో నిలిచింది. తమను తక్కువగా అంచానా వేస్తే ఎంత పెద్ద జట్టుకైనా ఓటమి తప్పదని చెప్పకనే చెప్పింది. జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికాలో జరగబోయే పొట్టి సమరంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టును తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యం తప్పదు. 

గట్టి జట్లకు పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వెస్టిండీస్ క్రికెట్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా మాత్రం ఆఫ్ఘనిస్థాన్ ఏకంగా సెమీస్ కు చేరుతుందని జోస్యం చెప్పాడు. ఆఫ్ఘనిస్తాన్ తో పాటు భారత్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు ఈ మెగా ఈవెంట్ లో సెమీస్ చేరతాయని చెప్పుకొచ్చాడు. స్టార్ స్పోర్ట్స్ వారు నిర్వహించిన ఒక షో లో లారా తన ప్రిడిక్షన్ తెలిపాడు. లారా మినహాయిస్తే ఎవరూ కూడా ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ కు చేరుతుందని చెప్పలేదు. రషీద్ ఖాన్, ముజీబ్, నబీ, నవీన్ ఉల్ హక్ లాంటి బౌలింగ్ దళంతో దుర్బేధ్యంగా కనిపిస్తుంది.

Also read :ENG vs PAK: పాక్ క్రికెటర్లపై దాడులు జరిగే ఛాన్స్.. అప్రమత్తమైన ఇంగ్లండ్ పోలీసులు
 

బ్యాటింగ్ లో మెరుగు పడితే ఆఫ్ఘనిస్తాన్ ఈ టోర్నీలోనూ సంచలన ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది. గ్రూప్ సి లో ఆఫ్ఘనిస్తాన్ తో పాటు వెస్టిండీస్, న్యూజీలాండ్, ఉగాండా, పపు న్యూ గినియా జట్లు ఉన్నాయి. వెస్టిండీస్, న్యూజీలాండ్ జట్లలో ఒక జట్టుకు షాక్ ఇస్తే సూపర్ 8 కు అర్హత సాధించవచ్చు.  20 జట్ల మధ్య పోటీ జరగనుండగా.. మొత్తం 10 వేదికల్లో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఇందులో ఐదు వేదికలు అమెరికాలో ఉండగా.. మరో ఐదు వేదికలు కరేబియన్‌ దీవుల్లో ఉండనున్నాయి.