డబుల్ బెడ్ రూమ్ కోసం లంచం ఇవ్వలేదని పేరు తీసేశారు

డబుల్ బెడ్ రూమ్ కోసం లంచం ఇవ్వలేదని  పేరు తీసేశారు

లంచం ఇవ్వలేదని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక జాబితాలో తన పేరు తీసేశారంటూ.. ఓమహిళ ఆవేదన వ్యక్తం చేసిన ఘటన.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. స్థానిక కౌన్సిలర్ అడిగిన డబ్బులు ఇవ్వనందుకే.. తన రాకుండా చేశారని ఆరోపించింది. సిరిసిల్ల పద్మా నగర్ కు చెందిన నందగిరి మల్లిక అనే దినసరి కూలీ.. సిరిసిల్ల 25 వార్డులో నిర్వహించిన వార్డు సభకు వెళ్లింది.  అయితే ఎంపిక లిస్టులో తన పేరు లేకపోవడంతో కన్నీరు పెట్టుకుంది. 

డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయడానికి స్థానిక కౌన్సిలర్ రవి అందరి దగ్గర 50వేల రూపాయలు తీసుకున్నాడని ఆరోపించింది మల్లిక. తనను కూడా డబ్బులు అడిగారని... అయితే కూలి చేసుకుని బతికే తన దగ్గర అంత డబ్బులు లేవనడంతో... మెడలో పుస్తెలతాడు ఇచ్చినా సరే అన్నారని వాపోయింది. భర్త బతికి ఉండగా పుస్తెల తాడు ఎలా ఇవ్వాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. భర్త దివ్యాంగుడని.. ఇళ్లలో పనిచేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నానని కన్నీరు పెట్టుకుంది. దీంతో ఆమె పేరును లక్కీ డ్రాలో తీయగా.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.