ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

భైంసా,కుబీర్​, నర్సాపూర్​(జి) వెలుగు: బీజేపీ చీఫ్​బండి సంజయ్​ జిల్లాలో చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు పల్లె జనం నీరాజనం పడుతోంది. గురువారం భైంసా మండలం లింబా(బి) గ్రామంలో శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి  పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి ప్రైమరీ స్కూల్​ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. స్కూల్​లో శిథిలావస్థకు చేరిన గదులను పరిశీలించి టీచర్ల కొరతపై ఆరా తీశారు. సర్కారు స్కూళ్లను అభివృద్ధి చేయడంలో సీఎం కేసీఆర్​ ఫెయిల్​అయ్యారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం రాగానే స్కూళ్లకు మహర్దశ కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీపీఎస్​ను రద్దు చేయాలని టీచర్లు బండి సంజయ్​కు వినతి పత్రం అందించారు. అనంతరం ఓలా, అంబకంటి, కుంటాల గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. దారి పొడవునా ప్రజలు భారీ సంఖ్యలో బండి సంజయ్​కు స్వాగతం పలికారు. పలు గ్రామాల్లో అక్కడి రైతులు ఎడ్లబండ్లపై ఎదురొచ్చారు. ఓలా గ్రామంలో బండి సంజయ్​ కొద్ది సేపు ఎడ్లబండిని నడుపుతూ ప్రజలకు అభివాదం చేశారు. దారి పొడువునా ప్రజల సమస్యను తెలుసుకొని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సూర్యాపూర్​ గ్రామానికి చెందిన రైతులు తమకు ఫసల్​బీమా యోజన అందడం లేదని, 24గంటల పాటు కరెంటు సప్లై కావట్లేదని, డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయలేని సంజయ్​ దృష్టికి తీసుకువచ్చారు. మిషన్​ భగీరథ నీరు కూడా తమకు అందడం లేదని గ్రామానికి రోడ్డు లేదని అంబుగామకు చెందిన ఓ వృద్ధుడు సంజయ్​కి వివరించారు. కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు ఇప్పటివరకు పరిహారం అందలేదని ఓలా గ్రామస్తులు పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామంటూ బండి వారికి భరోసా ఇచ్చారు. సంజయ్​ పాదయాత్రను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది యువకులు, మహిళలు తరలిరావడంతో లింబా గ్రామం నుంచి కుంటాల వరకు దాదాపు 11కి.మీ వరకు రోడ్డంతా జన సంద్రంగా మారింది.


కబ్జాలు చేసే టీఆర్ఎస్ నేతలను వేటాడాలి

నర్సాపూర్/కుబీర్, వెలుగు : అధికారం ఉందని భూకబ్జాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ నేతలను ప్రజలు వేటాడాల్సిన  టైం దగ్గర పడిందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు విమర్శించారు.  గురువారం కుంటాలలో ఎంపీ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్​ మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతు రుణమాఫీ చేస్తా అంటూ అన్నదాతలను పట్టించుకోవడం లేదన్నారు. కుటుంబ పాలనను అంతం చేసి బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. ముధోల్ తోపాటు ఉమ్మడి జిల్లాలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు.

మిషన్ భగీరథ కార్మికుల రాస్తారోకో

బెల్లంపల్లి, వెలుగు:  పెండింగ్  వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి పరిధిలోని మిషన్​భగీరథ కార్మికులు గురువారం నేషనల్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడంలేదని ఆరోపించారు. నాలుగేండ్లుగా మిషన్ భగీరథలో తాము పని చేస్తున్నామని, వేతనాలు పెంచమని ఎన్నిసార్లు అడిగినా సర్కారు నుంచి స్పందనలేదన్నారు. ఎల్ఎన్ టీ సైట్ ఇంజనీర్ దేవికుమార్ అక్కడికి చేరుకొని వేతనాలు ఇష్యూపై ఉన్నతాధికారులకు నివేదిస్తానన్నారు. ధర్నాలో సూపర్ వైజర్లు శేఖర్, నాగరాజు, శ్రావణ్, చందు పాల్గొన్నారు.

కాంట్రాక్ట్​ కార్మికులను డ్యూటీల్లోకి తీసుకోవాలి

 మందమర్రి, వెలుగు: మందమర్రిలోని రామన్​కాలనీ సింగరేణి  సివిక్​​మెయింటనెన్స్​లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులను డ్యూటీలోకి తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గురువారం మందమర్రిలోని సింగరేణి జీఎం ఆఫీస్​ ఎదుట టీఎన్టీయూసీ, హెచ్ఎంఎస్​, ఐఎఫ్టీయూ సంఘాలు, కాంట్రాక్ట్​ కార్మికులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ.. రామన్​కాలనీ, బంగ్లాస్​ ఏరియా పరిధిలోని  సివిక్​ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్​ చనిపోవడంతో సింగరేణి యాజమాన్యం సంబంధితా టెండర్​ను రద్దు చేసిందన్నారు. మళ్లీ టెండర్​ పిలుకపోవడంతో అందులో పనిచేసే కాంట్రాక్ట్​ కార్మికులకు 5 నెలలుగా డ్యూటీలు  కల్పించకపోవడంతో వారికి ఉపాధి లేకుండా పోయిందన్నారు. ​ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, టీబీజీకేఎస్​ లీడర్ల ఒత్తిళ్ల కారణంగా కార్మికులకు సింగరేణి డ్యూటీలు కల్పించడంలేదన్నారు. అంతకు ముందు స్థానిక పాత బస్టాండ్​ చౌరస్తా నుంచి కార్మికులు, లీడర్లు ర్యాలీగా జీఎం ఆఫీస్​ చేరుకున్నారు.  కార్యక్రమంలో వివిధ సంఘాల లీడర్లు బి.సంజయ్​కుమార్​, పార్వతి రాజిరెడ్డి, డి.బ్రహ్మనందం, సుదర్శన్​, మల్లేశ్​, జక్కుల సమ్మయ్య,  షరీపా, సంధ్య, శంకర్​, సరస్వతి, రాజేందర్  తదితరులు పాల్గొన్నారు. 

 

అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలి

నిర్మల్, వెలుగు:  జిల్లాలో అక్రమ లే అవుట్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని నిర్మల్​కలెక్టర్  ముషారఫ్​ ఫారుఖీ తహసీల్దార్లను  ఆదేశించారు.  గురువారం కలెక్టరేట్​లో  ఆర్డీవోలు,  తహసీల్దార్లు,  మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ ప్రభుత్వ  భూముల్లో ఏర్పాటు చేసిన లే అవుట్లను వెంటనే తొలగించాలన్నారు. అక్రమ నిర్మాణాల విషయంలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. సమావేశంలో  అదనపు కలెక్టర్లు హేమంత్  బోర్కడే,  రాంబాబు, డీఆర్వో ఇన్​చార్జి లోకేశ్, రెవెన్యూ అధికారులు స్రవంతి ,  రవికుమార్ పాల్గొన్నారు. 

రైతులను ఆదుకోవడంలో సర్కార్ ​ఫెయిల్

 
మంచిర్యాల, వెలుగు: టీఆర్ఎస్​ సర్కారు రైతులను ఆదుకోవడంలో ఫెయిలైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు విమర్శించారు. సీఎం కేసీఆర్​ పాలనలో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. జిల్లాలోని రైతులు సమస్యలపై ఆయన చేపట్టిన 'రైతు గోస – బీజేపీ భరోసా' గురువారం ముల్కల్ల, వేంపల్లి, మంచిర్యాల ఐబీ చౌరస్తా మీదుగా మంచిర్యాల కలెక్టరేట్​కు చేరింది. బీజేపీ కార్యకర్తలు, రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్​ వద్దకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు తోపులాట జరిగింది. అనంతరం అడిషనల్​ కలెక్టర్​ రాహుల్ బయటకు రావడంతో రైతులు తమ సమస్యలు ఆయనకు వివరించారు. అనంతరం రైతులతో కలిసి రఘునాథ్​రావు కలెక్టర్​కు వినతిపత్రం ఇచ్చారు. బీజేపీ లీడర్లు బొలిశెట్టి తిరుపతి, రజినీష్ జైన్, తిరుపతి, వెంకటరమణారావు, కృష్ణమూర్తి, ప్రభాకర్, సతీశ్​రావు, వెంకటేశ్వర్లుగౌడ్, పాల్గొన్నారు.  

బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి 

కాగ జ్ నగర్,వెలుగు: బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగాఈర్ల విశ్వేశ్వర్​రావు,  కాగజ్ నగర్ పట్టణ అధ్యక్షుడిగా  సిందం శ్రీనివాస్ ను నియమించారు. ఈమేరకు గురువారం పట్టణంలోని పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్​నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి శ్రీనివాస్​మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. వీరితోపాటు బీజేపీ పట్టణ యువజన మోర్చా అధ్యక్షుడిగా శ్రీ రాంగౌడ్, పట్టణ బీసీ మోర్చా అధ్యక్షుడిగా దెబ్బటి శ్రీనివాస్ లు నియమితులయ్యారు.