ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

    ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌‌ రెడ్డి 

కందనూలు, వెలుగు:  నియోజకవర్గంలోని అర్హులందరికీ త్వరలోనే డబుల్ బెడ్‌‌ రూమ్ ఇండ్లు ఇస్తామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌‌ రెడ్డి హామీ ఇచ్చారు.  ‘గుడ్ మార్నింగ్ నాగర్ కర్నూల్’ కార్యక్రమంలో భాగంగా సోమవారం బిజినేపల్లి మండలం గౌరరాం గ్రామంలో పర్యటించారు. ఇంటింటికీ తిరిగి  సంక్షేమ పథకాలు అందుతున్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు.  పలువురు తమకు ఇండ్లు లేవని ఎమ్మెల్యే దృష్టికి తేగా.. తర్వలోనే ఇస్తామని చెప్పారు.  స్కూల్‌‌ శిథిలావస్థకు చేరుకుందని చెప్పగా.. కొత్త భవనాన్ని నిర్మిస్తామని, వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.  

చిన్నచిన్న సమస్యలు ఉంటే మాట్లాడి పరిష్కరించాలని జీపీ సెక్రటరీ, సర్పంచ్‌‌కు  సూచించారు.   ముదిరాజ్, ఎస్సీ  కమ్యూనిటీ హాళ్లకు రూ.5 లక్షల చొప్పున,  డ్రైనేజీలు, సీసీ రోడ్ల కోసం రూ. 20 లక్షలు  మంజూరు చేస్తానని మాటిచ్చారు.  44వ సర్వే నెంబర్ పరిధిలోని రైతులకు పట్టా పాస్ పుస్తకాలు అందజేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట తహసీల్దార్ అంజి రెడ్డి , ఎంపీడీవో కృష్ణ, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

నర్సింగ్ కాలేజీ బాధితులకు ఇండ్లియ్యాలె

కలెక్టరేట్ వద్ద పట్టాదారులు, అఖిలపక్ష లీడర్ల ధర్నా

గద్వాల, వెలుగు: హైకోర్టు తీర్పు మేరకు నర్సింగ్ కాలేజీ, 300 బెడ్స్ హాస్పిటల్ బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని అఖిలపక్ష లీడర్లు డిమాండ్ చేశారు. సోమవారం పట్టాదారులతో కలిసి వైయస్సార్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే బైఠాయించి.. ప్రభుత్వం, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ఇండ్ల జాగాలు గుంజుకొని నర్సింగ్ కాలేజీ, హాస్పిటల్ కడుతున్నారని మండిపడ్డారు. న్యాయం చేయాలని కోరినా సర్కారు స్పందించకపోవడంతో హైకోర్టుకు వెళ్లామని చెప్పారు. పట్టాలు ఉన్న ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ కేటాయించాలని కోర్టు తీర్పు ఇచ్చినా.. పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే కోర్టు తీర్పును అమలు చేయాలని, లేదంటే తమ జాగాలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం హైకోర్టు  తీర్పు కాపీలను కలెక్టర్‌‌‌‌కు అందించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష లీడర్లు రామాంజనేయులు, బండల వెంకట రాములు, శంకర్, ఇసాక్, నాగేందర్ యాదవ్, డీటీడీసీ  నర్సిహులు, రజక జయశ్రీ, తుమ్మల నరసింహులు పాల్గొన్నారు.  

కలెక్టరేట్ ముట్టడించిన సాతర్ల గ్రామస్తులు

ప్రభుత్వం ఇచ్చిన జాగాలను కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా గుంజుకున్నారని ఇటిక్యాల మండలం సాతర్లకు చెందిన లబ్ధిదారులు సోమవారం కలెక్టరేట్‌‌ను ముట్టడించారు. వారు మాట్లాడుతూ 1985లో సర్వేనెంబర్ 3లో 62 మందికి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చిందన్నారు.  కానీ గ్రామానికి చెందిన కొందరు ఈ భూమి తమదని కోర్టు ద్వారా నోటీసులు ఇప్పించి గుడిసెలు పీకేయించారని  వాపోయారు.  అనంతరం న్యాయం చేయాలని కలెక్టర్‌‌‌‌కు వినతిపత్రం సమర్పించారు.

బీఆర్‌‌‌‌ఎస్‌‌ అవినీతిని ఎండగడతాం    

టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌‌ చిన్నారెడ్డి

పెబ్బేరు, వెలుగు : సకల జనుల ప్రజా సంఘర్షణ యాత్రలో బీఆర్‌‌‌‌ఎస్‌‌  అవినీతిని ఎండగడతామని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌‌ చిన్నారెడ్డి చెప్పారు.  సోమవారం పెబ్బేరులోని కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఆవరణలో మండల అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి హాజరై  మాట్లాడారు. దేశంలో ఎవరూ చేయలేని సాహసాన్ని  రాహుల్ గాంధీ ‘భారత్​ జోడో యాత్ర’ ద్వారా చేశారని కొనియాడారు.  కొందరు దేశాన్ని విడగొట్టాలని చూస్తుంటే... రాహుల్ మాత్రం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజలందరికీ ఏకం చేశారని స్పష్టం చేశారు.  

దేశంలో కాంగ్రెస్ హయంలో జరిగిన అభివృద్ధి  తప్ప ప్రస్తుత ప్రభుత్వాలు చేసిందేమీ లేదన్నారు.  జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. నాయకులంతా ఐక్యతతో ముందుకు సాగాలని,  నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.  అనంతరం పార్టీ పెబ్బేరు మున్సిపల్  అధ్యక్షుడిగా వెంకట్​రాములును నియమించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సువర్ణ,అశ్విని, షకీల్, నేతలు విజయ్ వర్ధన్ రెడ్డి, రంజిత్ కుమార్, సత్యనారాయణ, రణధీర్ రెడ్డి, చంద్రశేఖర్, సురేందర్ గౌడ్, వెంకటేశ్ సాగర్, యుగంధర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, రాజ్ కుమార్, శివ, సర్వేశ్, మణ్యం, రాములు పాల్గొన్నారు.

జీపీలకు నిధుల్లేవ్.. నిర్వహణ ఎట్ల?

సర్పంచులు, ఎంపీటీసీల  నిరసన  

ఉప్పునుంతల, వెలుగు: తొమ్మిది నెలలుగా బిల్లులు ఇవ్వకపోతే జీపీల నిర్వహణ ఎలా జరుగుతుందని కాంగ్రెస్ సర్పంచులు, ఎంపీటీసీలు ప్రశ్నించారు.  సోమవారం ఉప్పునుంతల మండలంలో ఎంపీపీ తిప్పర్తి అరుణ అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు.  మీటింగ్‌‌‌‌ ప్రారంభంలోనే  కాంగ్రెస్‌‌‌‌ సర్పంచ్‌‌‌‌లు లక్ష్మీనారాయణ,  మల్లారెడ్డి,  కట్ట సరిత రెడ్డి, ఊర్మిళ, కళావతి, ఎంపీటీసీలు రంగారెడ్డి, మల్లయ్య, అనురాధ హాల్‌‌‌‌లో బైఠాయించి నిరసన తెలిపారు. 15 ఫైనాన్స్ నిధులు రాక తొమ్మిది నెలలు అవుతోందని,  జీపీ వర్కర్స్‌‌‌‌కు జీతాలు, ట్రాక్టర్ ఈఎంఐ, ఈజీఎస్ ద్వారా నిర్వహిస్తున్న నర్సరీల నిర్వహణ ఎలా చేయాలని అధికారులను ప్రశ్నించారు.  

జడ్పీటీసీ అనంత ప్రతాపరెడ్డి, పీఏసీఎస్‌‌‌‌ చైర్మన్ సతుభూపాల్ రావు   మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకుందామని చెప్పినా వారు వినలేదు.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండడంతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ సభ్యులు కూడా వాగ్వాదానికి దిగారు.  గందరగోళ పరిస్థితి ఏర్పడడంతో కాంగ్రెస్‌‌‌‌ సభ్యులు మీటింగ్‌‌‌‌ బహిష్కరించి ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన కొనసాగించారు. కొద్దిసేపటి తర్వాత ఎంపీడీవో లక్ష్మణరావు వారి వద్దకు వెళ్లి రూ. కోటి  రిలీజ్ అయ్యాయని, నాలుగైదు రోజుల్లో జీపీ అకౌంట్లలో జమ చేస్తామని హామీ ఇచ్చారు.