ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

    కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి

మహబూబ్ నగర్ టౌన్/మహబూబ్ నగర్ రూరల్/ హన్వాడ, వెలుగు: పాలమూరులో బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరని  మాజీ ఎంపీ, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం కోడూరు, హన్వాడ మండలం కేంద్రాలతో  పాటు పాలమూరు మున్సిపాలిటీలోని బూత్​లెవల్​ప్రెసిడెంట్లు,  శక్తి కేంద్ర ఇన్​చార్జిలతో ఆయన సమావేశాలు నిర్వహించారు.   అనంతరం జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని, పదవి శాశ్వతమనుకుని అహంకారంతో అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. 

ఇతర పార్టీల  లీడర్లు, కార్యకర్తలు పార్టీ మారకపోతే కేసులు పెట్టి బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్​అధికార దుర్వినియోగం వల్ల ధనిక రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పాలన విముక్తి కోసం ప్రజలందరూ ఏకమై ఉద్యమించాలన్నారు.  మునుగోడు ఉప ఎన్నికల్లో వంద మంది కౌరవులతో పోరాడి నైతిక విజయం సాధించానన్నారు.  బీజేపీ పార్లమెంటు ప్రబారి చంద్రశేఖర్, జిల్లా ఇన్​చార్జి భరత్ గౌడ్, అధ్యక్షుడు వీర బ్రహ్మచారి, జనరల్​సెక్రటరీ పి. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

రీలొకేషన్ పై ప్రజల నిర్ణయమే ఫైనల్: కలెక్టర్ ఉదయ్ కుమార్  

అమ్రాబాద్, వెలుగు: ‘అమ్రాబాద్ టైగర్  రిజర్వ్​లో  రీలొకేషన్​పై ప్రజల నిర్ణయమే ఫైనల్’ అని కలెక్టర్ ఉదయ్ కుమార్ పేర్కొన్నారు.  స్వచ్ఛందంగా పునరావాసం కోరుతూ అప్లై చేసుకున్న వటవర్లపల్లి గ్రామస్తులతో గురువారం కలెక్టర్ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా నష్టపరిహారం ఏ ప్రాతిపదికన ఇస్తారు?  ఇల్లు, భూమి ఉన్న వారికి ఏమైనా పరిహారం ఇస్తారా? తదితర విషయాలను  గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్​మాట్లాడుతూ  పరిహారం విషయంలో ఎవరు డౌట్స్​పెట్టుకోవద్దని, ప్రభుత్వం రూల్స్​ప్రకారం నష్ట పరిహారం అందిస్తుందన్నారు. 18 ఏండ్లు  నిండిన ప్రతి వ్యక్తిని ఒక కుటుంబంగా చూస్తారని, 15 లక్షల పరిహారం లేదా భూమి, ఇల్లు, వసతులు కల్పిస్తారని పేర్కొన్నారు. ఫ్యామిలీకి 2 నుంచి 5 ఎకరాల భూమి, కాలనీ ఏర్పాటు చేసి ఇల్లు, స్కూల్, హాస్పిటల్ తదితర మౌలిక  సౌలత్​లను సమకూరుస్తామన్నారు. ఈ సందర్భంగా డీఎఫ్​వో  రోహిత్  పునరావాస  ప్యాకేజీపై  చట్టంలోని పలు విషయాలను గ్రామస్తులకు వివరించారు. తహసీల్దార్​రాజేందర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కేంద్ర పథకాలు బూత్​ లెవల్​కు తీసుకుపోవాలి:  బీజేపీ జిల్లా ఇన్​చార్జి కాంతారావు

మక్తల్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం పథకాలను బూత్​ లెవల్​ దాకా తీసుకుపోవాలని  బీజేపీ జిల్లా ఇన్​చార్జి కాంతారావు, అసెంబ్లీ ఇన్​చార్జి పూనంచంద్​ అన్నారు. పట్టణంలో గురువారం  మీడియాతో మాట్లాడారు.  కేంద్ర ప్రభుత్వం  ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో శక్తి కేంద్ర ఇన్​చార్జిల పాత్ర కీలకం అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీపీలకు ఇచ్చిన నిధులను రాష్ట్రం పక్కదోవ పట్టించిందని ఆరోపించారు.  ఈనెల 7న నియోజకవర్గ స్థాయి బూత్​ లెవెల్​  మీటింగ్​ ఉంటుందని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు పడాకుల శ్రీనివాస్,  ఇన్​చార్జి సుభాష్ చందర్ జీ, లీడర్లు అమర్ దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. 

గద్వాల జిల్లా ఓటర్లు 4,57,101 మంది..

గద్వాల/వనపర్తి, వెలుగు:  గద్వాల, వనపర్తి జిల్లాల ఓటర్​ లిస్టులను గురువారం ఆర్డీవోలు రిలీజ్ ​చేశారు. గద్వాల జిల్లాలో జనవరి –2023 నాటికి 4,57,101 మంది ఓటర్లు ఉన్నారని ఆర్డీవో రాములు తెలిపారు.  ఈసీ ఆదేశాల మేరకు ఆగస్టు  నుంచి ఓటర్ నమోదు చేపట్టి జనవరి –1 నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించామన్నారు.  గద్వాల నియోజకవర్గంలో 2,34,633 మంది ఓటర్లుండగా, వారిలో పురుషులు 1,16,167 ఉండగా స్త్రీలు  1,18,447, అలంపూర్​లో  మొత్తం 2,27,428 ఓటర్లు ఉండగా  పురుషులు1,11,024 , మహిళా ఓటర్లు1,11,349 మంది ఉన్నారన్నారు. త్వరలోనే  తుది జాబితా విడుదల చేసి రాజకీయ పార్టీల లీడర్లకు అందిస్తామన్నారు.  రెండు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల  ఎక్కువగా ఉన్నారని ఆర్డీవో చెప్పారు.  

పోలింగ్​ బూత్​లలో ఓటర్ ​లిస్ట్​

వనపర్తి  జిల్లాలోని 290  పోలింగ్ బూత్​లలో కొత్త ఓటర్ జాబితాను అందుబాటులో ఉంచామని  ఆర్డీవో పద్మావతి చెప్పారు.  గురువారం  ఆర్డీవో ఆఫీస్​లో వనపర్తి నియోజకవర్గ ఓటర్ల జాబితాపై గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె మీటింగ్​నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని  కోరారు. ఈ సందర్భంగా ఓటర్ జాబితాను  పరిశీలించి, పార్టీల ప్రతినిధులకు అందజేశారు. తహసీల్దార్​రాజేందర్ గౌడ్ తదితరులు   పాల్గొన్నారు.

సృజనాత్మకతను వెలికితీసేందుకే ‘తొలిమెట్టు’: నోడల్ ఆఫీసర్ ​సువర్ణ వినాయక్ 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : స్టూడెంట్లలో  సృజనాత్మకత వెలికితీసేందుకే ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమం తీసుకొచ్చిందని రాష్ట్ర ‘తొలి మెట్టు’ నోడల్ ఆఫీసర్​సువర్ణ వినాయక్ అన్నారు.  గురువారం నాగర్ కర్నూల్ పట్టణంలోని నేషనల్  హైస్కూల్​లో నిర్వహించిన మండల స్థాయి ‘తొలిమెట్టు’ బోధనా అభ్యసన మేళాకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైమరీ లెవల్​స్టూడెంట్లకు బోధనోపకరణాలు ఉపయోగించి పాఠాలు చెప్పడం వల్ల  త్వరగా అవగాహన చేసుకోవడమే కాకుండా, వారిలోని సృజనాత్మకతను వెలికితీయొచ్చన్నారు.  మండలంలోని 48 స్కూళ్లకు చెందిన 150 మంది టీచర్లు సబ్జెక్టుల వారీగా 500 టీఎల్ఎం లను ప్రదర్శించారని సువర్ణ వినాయక్​ చెప్పారు. డీఈవో గోవిందరాజులు, మున్సిపల్ చైర్మన్ కల్పన, ఎంపీడీవో కోటేశ్వర్ రావు, నోడల్ ఆఫీసర్ కూర్మయ్య తదితరులు పాల్గొన్నారు.