ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

సిద్దిపేట, వెలుగు: పట్టణంలోని వేములవాడ కమాన్ ఎదురుగా 78వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం సందర్భంగా ఆయుత చండీ   యాగాన్ని నిర్వహించనున్నట్టు శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి వెల్లడించారు. శుక్రవారం యాగ స్థలంలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  19  నుంచి  డిసెంబర్ 2 వరకు   రోజు వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు.  యాగ నిర్వహణ కోసం నాలుగు యాగశాలలను ప్రత్యేకంగా నిర్మించినట్టు తెలిపారు.   భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. 

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి... 

యాగ నిర్వహణ ఏర్పాట్లను మంత్రి హరీశ్​ రావు శుక్రవారం పరిశీలించారు.  శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి తో మాట్లాడారు.  యాగ నిర్వహణకు  తనవంతు సహాయ సహకారాలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తారని హామీ ఇచ్చారు. 

ప్రధానమంత్రి ఉపాధి కల్పన ను ఉపయోగించుకోవాలి  

అడిషనల్​ కలెక్టర్​ రమేశ్​

మెదక్​ టౌన్​, వెలుగు :  ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం నిరుద్యోగులకు, యువకులకు ఎంతో  ఉపయోగం అని  అడిషనల్​ కలెక్టర్ రమేశ్​ అన్నారు.   స్కిల్ డెవలప్​మెంట్​ ట్రైనింగ్ తీసుకున్న వారికి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంపై కలెక్టరేట్​లో శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడారు. స్వయం ఉపాధి కోసం ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని చెప్పారు.  ఆసక్తి  ఉన్న వారు www.kvic.conline.gov.in.pmegpeportal  వెబ్​సైట్​లో  దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణమూర్తి. లీడ్ బ్యాంకు డిస్ట్రిక్ మేనేజర్ వేణుగోపాలరావు, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషనర్ విష్ణుమూర్తి,  బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కేశురాం, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్  జెమ్లా నాయక్, ఎస్సీ కార్పొరేషన్ అధికారిణి విజయలక్ష్మి, మెప్మా, ఖాదీ బోర్డు సిబ్బంది పాల్గొన్నారు.

గిరిజన సంక్షేమ గురుకుల సమస్యలపై చలో హైదరాబాద్

టౌన్ , వెలుగు: గిరిజన సంక్షేమ  గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల  సమస్యల పరిష్కారం కోసం టీపీటీఎఫ్​  ఆధ్వర్యంలో ఈనెల 19న హైదరాబాద్ గిరిజన సంక్షేమ కమిషనర్ ఆఫీస్​ ఎదుట  ధర్నా  చేపడుతున్నట్లు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, అనుముల రామచందర్ వెల్లడించారు.  బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని,  జిల్లా క్యాడర్ ప్రకారం   పదోన్నతులు చేపట్టాలని,  అన్ని గురుకులాలను ఆశ్రమ పాఠశాలలుగా మార్చాలని డిమాండ్​ చేశారు. అనంతరం  చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ట్రాన్స్​ జెండర్ల  ఐడెంటిటీ సర్టిఫికెట్లకు దరఖాస్తులు

మెదక్​ టౌన్​, వెలుగు :  జిల్లాలోని ట్రాన్స్​జెండర్లు  జాతీయ ట్రాన్స్​జెండర్ల గుర్తింపు పత్రాల కోసం ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని  మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆఫీసర్​ బ్రహ్మాజీ తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ...  ఇప్పటికే జాతీయ ట్రాన్స్​జెండర్ల గుర్తింపు పత్రం ఉంటే వారు ఆర్థిక పునరావాస పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.  ఈ దరఖాస్తులను transgender.dosje.gov.in ద్వారా అప్లయ్​ చేసుకోవచ్చని,  మిగితా వివరాలకు  కలెక్టరేట్​లోని జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆఫీస్​లో సంప్రదించాలని  కోరారు. 

27న చెకుముకి మండల స్థాయి టాలెంట్​ పోటీలు

సంగారెడ్డి టౌన్, వెలుగు: స్టూడెంట్స్  ను ఇన్నోవేషన్స్​ వైపు ఎంకరేజ్​ చేసేందుకు  జన విజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్టులు నిర్వహించడం అభినందనీయమని  జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్​ అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న   సైన్స్ టాలెంట్ పాఠశాల స్థాయి పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డీఈఓ రాజేశ్​  వాల్ పోస్టర్​ను విడుదల చేశారు. పాఠశాల స్థాయి విజేతలకు ఈ నెల 27న నిర్వహించే  మండల స్థాయి పోటీలకు హాజరుకావాలని చెప్పారు.  కార్యక్రమంలో డీఎస్ఓ విజయ్ కుమార్,  జేవీవీ  రాష్ట్ర నాయకులు   సోమశేఖర్ జిల్లా నాయకులు బాలయ్య శశిధర్  పాల్గొన్నారు.

ఎంపీ అర్వింద్​ ఇంటిపై దాడి హేయమైన చర్య

సిద్దిపేట రూరల్/  మెదక్​ టౌన్​, వెలుగు : ఎంపీ  అర్వింద్​ పట్ల  ఎమ్మెల్సీ కవిత  కామెంట్లను, ఎంపీ ఇంటిపై టీఆర్​ఎస్​ కార్యకర్తల దాడిని  ఉమ్మడి జిల్లా  బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు.  సిద్దిపేటలో ఆ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు.   ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి దాడులకు పాల్పడడం టీఆర్ఎస్ కు అలవాటుగా మారిందని, తక్షణమే వారిని అరెస్ట్​ చేయాలని డిమాండ్​ చేశారు.   టీఆర్ఎస్ నాయకులు ఇలాంటి దాడులు మళ్లీ చేస్తే.. బీజేపీ కార్యకర్తలు కూడా అదే రీతిలో సమాధానం చెప్పుతారని హెచ్చరించారు.  

రామాయంపేట బంద్ సక్సెస్

రామాయంపేట, వెలుగు: బైపాస్ రోడ్డు అలైన్ మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ రామాయంపేట పట్టణ వ్యాపార, వాణిజ్య సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం స్వచ్ఛందంగా బంద్ పాటించారు. బైపాస్ రోడ్డు తో విలువైన భూములు కోల్పోవడమే కాకుండా, పట్టణంలో వ్యాపారాలు దెబ్బతింటాయని వ్యాపారులు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సిద్దిపేట పాత రోడ్డునే మరింత విస్తరించాలని   డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్​ ఎండీ మన్నన్ కు వినతి పత్రం ఇచ్చారు. 
ఈ కార్యక్రమంలో దోమకొండ యాదగిరి, కొండంగారి రమేష్, సార్గు భాగయ్య, నాగరాజు, మోత్కు అశోక్ తదితరులు పాల్గొన్నారు. 

సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం..

వేములఘాట్​ నిర్వాసితుల సమావేశం 

గజ్వేల్, వెలుగు: తాము సర్వస్వం కోల్పోయి మల్లన్న సాగర్​ రిజర్వాయర్​ నిర్మాణానికి సహకరిస్తే,  ప్రభుత్వం మాత్రం హామీలు నెరవేర్చకుండా అన్యాయం చేస్తోందని వేములఘాట్​   నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్​అండ్​ఆర్​ కాలనీ పల్లెపహాడ్​ గ్రామానికి చెందిన నిర్వాసితులు శుక్రవారం కాలనీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు సిద్దిపేట ఆర్డీఓ అనంతరెడ్డితో ఫోన్​లో మాట్లాడారు.   తమకు న్యాయంగా దక్కాల్సిన ఓపెన్​ ప్లాట్లు, పరిహారాలు ఇవ్వాలని కోరారు.  925 మంది నిర్వాసితులకు ఓపెన్​ ప్లాట్లకు సర్టిఫికెట్లు ఇచ్చి కబ్జా ఇవ్వలేదన్నారు. దీంతో తాము ఇండ్లు నిర్మించుకోలేక పోతున్నామన్నారు. అంతేకాకుండా వివిధ ఆర్​అండ్​ ఆర్​ ప్యాకేజీలు కూడా పెండింగ్​ ఉన్నాయన్నారు. వెంటనే ప్రభుత్వం తమ సమస్యలన్నీ పరిష్కరించకపోతే తమ ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో  సర్పంచి బాలయ్య, ఉపసర్పంచి పెద్ది బాలకిషన్​, టీఆర్​ఎస్​ పార్టీ గ్రామ అధ్యక్షుడు కనకాగౌడ్​తో పాటు గ్రామస్థులు  
తదితరులు పాల్గొన్నారు. 

తరుగు పేరుతో  రైతులను మోసం చేయొద్దు

మెదక్​ (శివ్వంపేట), వెలుగు: తరుగు పేరుతో ఎక్కువ ధాన్యం తూకం వేయొద్దని  ఆత్మ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి,  జడ్పీటీసీ మహేశ్​ గుప్తా శివ్వంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐకేపీ  కొనుగోలు కేంద్రంలో  నిర్వహకులకు సూచించారు.    శుక్రవారం వారు సెంటర్​ను సందర్శించారు. తూకం నిబంధనలు పాటించాలని, ఎక్కువ తూకం వేసి రైతులను మోసం చేయొద్దని  తెలిపారు.   కాంటా పెట్టిన తరువాత రైస్​ మిల్లర్లు తరుగు తీస్తే వారిపై కూడా చర్యలుంటాయన్నారు.  దళారులు రైతులను ఇబ్బంది పెడితే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో   సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు గౌరీ శంకర్, రాజు, నాగేశ్​ తదితరులు  ఉన్నారు.

టీడబ్ల్యూజేఎఫ్​ రాష్ట్ర మహాసభలు సక్సెస్​ చేయాలె

జిల్లా ప్రెసిడెంట్​ వికాస్​

మెదక్​ టౌన్​, వెలుగు :  తెలంగాణ వర్కింగ్​ జర్నలిస్టు ఫెడరేషన్​ ( టీడబ్ల్యూజేఎఫ్​ ​)  రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం మెదక్​ జిల్లా ప్రెసిడెంట్​ వికాస్​ కోరారు.   టీఎన్జీవో భవన్​లో శుక్రవారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్​లోని  ఆర్టీసీ భవన్ లో రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి ఆర్టీసీ కళాభవన్ వరకు జర్నలిస్టుల మహా ప్రదర్శన ఉంటుందన్నారు.   ఈ కార్యక్రమానికి  జర్నలిస్టు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్. రాఘవులు, సంగమేశ్వర్, రహమత్అలీ, పెంటయ్య, ప్రసాద్, రామకృష్ణ  పాల్గొన్నారు.