
సిద్దిపేట రూరల్, వెలుగు : దుబ్బాక, హుస్నాబాద్, జనగామ నియోజకవర్గ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను త్వరగా పూర్తి చేసి పంపిణీ కి సిద్ధం చేయాలని సంబంధిత ఆఫీసర్లను సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ ఆఫీస్ లో ఎమ్మార్వోలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ అధికారులు, ఈఈ, ఏఈలతో సమావేశం నిర్వహించి డబుల్ ఇండ్ల ప్రగతి పై చర్చించారు. జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సంక్రాంతి లోపు అందించేలా పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలన్నారు. దరఖాస్తులు తీసుకుని అన్నింటిపై పూర్తి దర్యాప్తు చేశాకే సెలక్షన్ లిస్ట్ ను తనకు పంపాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అనంత్ రెడ్డి, డబుల్ బెడ్ రూమ్ నోడల్ అధికారి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్, అర్ అండ్ బీ అధికారి వెంకటేశ్ పాల్గొన్నారు.
క్వాలిటీ పెట్రోల్, డీజిల్ అందించాలి
నర్సాపూర్, వెలుగు : వాహనదారులకు క్వాలిటీ పెట్రోల్, డీజిల్ అందించాలని అడిషనల్ ఎస్పీ బాలస్వామి అన్నారు. నర్సాపూర్ పట్టణంలో టీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ ఆధ్వర్యంలో పెట్రోల్ పంపు ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. వాహనదారులకు ఎలాంటి అవకతవకలు లేకుండా పెట్రోల్, డీజిల్ అందించాలని సూచించారు. రీజినల్ మేనేజర్ సుదర్శన్ మాట్లాడుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ సిబ్బంది ముందుంటారన్నారు. పెట్రోల్ పంపు ఏర్పాటు ద్వారా వాహనదారులకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డీఎం రవిచందర్, ఎంఎఫ్ తిరుమలేశ్, డిపో ఇన్చార్జి నరేందర్, గ్యారేజ్ ఇన్చార్జి శ్యాంసుందర్ గౌడ్, ఏడీసీ శాఖయ్య, సిస్టం సూపర్ వైజార్ వెంకటేశ్‌గౌడ్, సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ నరసింహ పాల్గొన్నారు.
పోలీసులకు ఫిట్నెస్ ఎంతో ముఖ్యం
మెదక్ టౌన్, వెలుగు : పోలీసులకు ఫిట్నెస్ ఎంతో ముఖ్యమని అడిషనల్ ఎస్పీ బాలస్వామి తెలిపారు. ఎస్పీ సూచనల మేరకు జిల్లాలోని సివిల్, ఆర్మ్డ్ పోలీసులు, హోంగార్డులకు ఆర్మ్స్ డ్రిల్, ఫుట్డ్రిల్, లాఠీ డ్రిల్ నిర్వహిస్తున్నామని తెలిపారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన వీక్లీ పరేడ్ ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రతీ పోలీస్ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. రోజూ యోగ, ధ్యానం, వాకింగ్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, ఆర్ఐలు అచ్యుత రావు, నాగేశ్వరరావు, ఆర్ఎస్ఐలు నరేశ్, భవానీ కుమార్, యశ్వంత్ రావు పాల్గొన్నారు.
‘ఆఫీసర్లే రాజకీయం చేస్తున్రు’
మెదక్ (నిజాంపేట), వెలుగు : నిజాంపేట మండలంలో గవర్నమెంట్ ఆఫీసర్లే రాజకీయం చేస్తున్నారని నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ ఆరోపించారు. ఎంపీడీఓ ఆఫీస్ లో శుక్రవారం ఎంపీపీ సిద్ధరాములు అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా జడ్పీటీసీ విజయ్ కుమార్ జనవరి నెలలో ప్రొసీడింగ్ వచ్చిన నస్కల్ రోడ్డు పనులు ఎందుకు పూర్తి కాలేదని పీఆర్ ఏఈ విజయ్ ను ప్రశ్నించారు. నిధులు మంజూరైనా పనులు జరగకపోవడంతో ప్రజలకు తాము ఏమి సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదన్నారు. దీనికి ఆయన స్పందిస్తూ ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలుపగా, తాము ఎవరైనా కాంట్రాక్టర్ ను తీసుకుని వస్తే అతడితో పని చేయించేందుకు సిద్ధంగా ఉన్నారా అని జడ్పీటీసీ అడిగారు. ఆన్ లైన్ లో టెండర్ కు కాంట్రాక్టర్ రెస్పాన్డ్ అయితే అతడితో పని చేపిస్తామని సమాధానం చెప్పారు. నిజాంపేట మండల కేంద్రంలో 104 డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేసి ఏండ్లు గడిచినా పనులు మొదలు కాకపోవడంపై జడ్పీటీసీ నిరసన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం కోసం ప్రైవేట్ల్యాండ్ ను కొని గవర్నమెంట్ కు అప్పగిస్తే డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం చేపట్టక పోవడం దురదృష్టకరమన్నారు.
విద్యతోనే సమగ్రాభివృద్ధి
కంది, వెలుగు : విద్యతోనే సమగ్ర అభివృద్ధి సాధించగలమని, విద్యార్థులను తీర్చి దిద్దే బాధ్యత టీచర్లపై ఉందని డీనోటిఫైడ్ గిరిజనుల సంక్షేమ బోర్డు మెంబర్ తుర్క నరసింహ అన్నారు. శుక్రవారం ఆయన సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టర్ ఆడిటోరియంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో సంచార జాతుల కులాలు, అణగారిణ వర్గాలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఎస్సీ కార్పొరేషన్, డీఆర్ డీఏ, హౌజింగ్ శాఖలలో అమలు చేస్తున్న పథకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిజిక్స్, తెలుగు, సైన్స్, మ్యాథ్స్, సోషల్ టీచర్లతో చర్చా గోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్ర చదివి జాతీయ భావం, దేశభక్తి, సమైక్యత అలవర్చుకోవాలన్నారు.కార్యక్రమములో
అడిషనల్ఎస్పీ ఉషానికృత, డీఈవో రాజేశ్, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫిరంగి, సంగారెడ్డి ఆర్డీవో నగేశ్, జిల్లా గ్రామీణాభివృద్ధి ఆఫీసర్ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబురావు, డీఎంహెచ్‌వో గాయత్రీదేవి, డీపీవో సురేశ్ మోహన్, డీఎఫ్‌వో శ్రీధర్ రావు, మైన్స్ ఏడీ మధుకుమార్ పాల్గొన్నారు.
ఫారెస్ట్ ఆఫీసర్లతో కలిసి పని చేస్తాంగజ్వేల్ ఏసీపీ రమేశ్
గజ్వేల్, వెలుగు : ఇక నుంచి పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్లు సమన్వయంతో విధులు నిర్వర్తిస్తారని గజ్వేల్ ఏసీపీ రమేశ్ అన్నారు. శుక్రవారం గజ్వేల్ఐఓసీలోని ఫారెస్టు రేంజ్ ఆఫీస్‌లో ఆయన నేతృత్వంలో పోలీస్, ఫారెస్టు ఆఫీసర్ల కోఆర్డినేషన్ మీటింగ్ జరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీ సూచనల మేరకు గజ్వేల్, సిద్దిపేట్ రేంజ్ ఫారెస్ట్ సిబ్బందితో విధినిర్వహణలో రక్షణ పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించామన్నారు. ఫారెస్ట్ ఆఫీసర్లు పోడు భూముల విషయంలో కానీ, ఫారెస్ట్ పరిధి విషయంలో రైడ్‌కు వెళ్లినప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తే అవసరమైన రక్షణ చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో ఎఫ్ఆర్ఓ కిరణ్, గజ్వేల్ పోలీస్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, గజ్వేల్, సిద్దిపేట రేంజ్ ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లా వ్యాప్తంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్ డీఎం హెచ్‌వో డాక్టర్ విజయ నిర్మల అన్నారు. శుక్రవారం మెదక్‌లోని ఆమె చాంబర్లో డాక్టర్లతో, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 36 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయని, మరో రెండు కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయని, ప్రతి ఒక్కరూ లింగ నిర్ధారణ చట్టానికి లోబడి స్కానింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్ మాత్రమే స్కానింగ్ చేయాలని చెప్పారు. కొన్ని కారణాలతో స్కానింగ్ చేసినప్పుడు ఆడ, మగ బిడ్డ అని ఎట్టిపరిస్థితుల్లో చెప్పొద్దన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, ఏఎన్ఎమ్లు లింగనిర్ధారణ పరీక్షల పట్ల ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు గైనకాలజిస్ట్ డాక్టర్ శివదయాల్, పీడియాట్రిషియన్ డాక్టర్ చంద్రశేఖర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ ఫజల్ అహ్మద్, డీపీఆర్వో శాంతి కుమార్, మాస్ మీడియా అధికారిణి రమ తదితరులు పాల్గొన్నారు.
మల్లన్న జాతరలో అధికారులందరూ అందుబాటులో ఉండాలిఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
చేర్యాల, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జున స్వామి మూడు నెలల జాతరలో అధికారులు, పాలకమండలి సభ్యులందరూ అందుబాటులో ఉండి భక్తులకు ఇబ్బందుల్లేకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆదేశించారు. శుక్రవారం కొమురవెల్లి మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామి టెంపుల్ ఆఫీస్‌లో అధికారులు, పాలక మండలి సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్18న మల్లికార్జున స్వామి బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ కల్యాణోత్సవంతో ప్రారంభమయ్యే జాతర మూడు నెలల పాటు కొనసాగనుందన్నారు. అందుకు రోజువారీ కార్యక్రమాలను అశ్రద్ధ చేయకుండా నిర్వహించాలని సూచించారు.
భక్తులకు మంచినీటి సరఫరా, గదుల ఏర్పాటుకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య నిర్వహణ ఎప్పటికప్పుడు చేయాలని, భక్తుల కోసం నిరంతర వైద్య సదుపాయాన్ని పీహెచ్సీ అధికారులు చూడాలని ఆదేశించారు. సరిపోను బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో టెంపుల్ కమిటీ చైర్మన్గీస భిక్షపతి, ఎంపీపీ తలారి కీర్తన, జడ్పీటీసీ సిద్ధప్ప, వివిధ శాఖల అధికారులు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, అడిషనల్ డీసీపీ మహేందర్‌గౌడ్, ఏసీపీ సతీశ్, ఆలయ ఈఓ బాలాజీ, డీహెచ్ఎంఓ కాశీనాథ్, ఆలయ కమిటీ సభ్యులు సిద్ధిలింగం తదితరులు పాల్గొన్నారు.
మా ప్లాట్లను కబ్జా చేస్తున్రు.. పట్టాలు జారీ చేయొద్దు
కలెక్టర్‌కు లక్ష్మీపురంకాలనీవాసుల వినతి
రామచంద్రాపురం, వెలుగు : కష్టపడి కొనుక్కున్న ప్లాట్లను కొంతమంది ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, వారికి ఎట్టి పరిస్థితుల్లో పట్టాలు జారీ చేయొద్దని మండల పరిధిలోని కొల్లూర్లక్ష్మీపురం కాలనీవాసులు సంగారెడ్డి కలెక్టర్‌కు మెరపెట్టుకున్నారు. ఈ మేరకు లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు సత్తయ్య, నర్సింహామూర్తి, సుబ్రహ్మణ్యం, రామ్మోహన్ రావు మాట్లాడారు. కొల్లూర్ ఆయా సర్వే నంబర్లలో దాదాపు 1300 మంది ఉద్యోగులు 1984లోనే ప్లాట్లను కొనుగోలు చేశారని తెలిపారు. చాలా ఏళ్ల వరకు అక్కడ ఇళ్లు నిర్మించుకోకపోవడంతో కొందరు ఆ ప్లాట్లను ఆక్రమించుకునేందుకు చూస్తున్నారని ఆరోపించారు. తమ ప్లాట్లకు సంబంధించిన భూములకు వారి పేరుపై పట్టా పాస్ బుక్కులు పొందేందుకు అప్లై చేసుకుంటున్నారని, వెంటనే ఆ ప్రక్రియను ఆపాలని అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కృషి
కోహెడ(హుస్నాబాద్), వెలుగు : మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక గ్రామీణ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం 75 శాతం సబ్సిడీపై వెహికల్స్‌ను అందించి వారి జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపుతున్నారని తెలిపారు. సొసైటీ లేని వెయ్యి గ్రామాలను స్పెషల్ డ్రైవ్ పెట్టి గుర్తించామన్నారు.18 ఏళ్లు నిండిన ముదిరాజ్, బెస్తా యువకులకు సభ్యత్వం వచ్చే విధంగా, ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.