ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

కంగ్టి, వెలుగు : బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ కురుమ కాలే రాజు తన అనుచరులతో  కలిసి సోమవారం కాంగ్రెస్​ పార్టీలో చేరారు. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్​పి.సంజీవరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి పి.శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. మండలంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్లు పోకడలు నచ్చకనే  కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కురుమ రాజు తెలిపారు. పీసీసీ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను వీఆర్ఎస్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్​ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

‘యూత్ జోడో.. బూత్ జోడో’ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

నారాయణ్ ఖేడ్, వెలుగు: నారాయణఖేడ్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే దివంగత కిష్టా రెడ్డి నివాసంలో సోమవారం ‘యూత్ జోడో..  బూత్ జోడో’ వాల్​ పోస్టర్లను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ దిశానిర్దేశంలో కాంగ్రెస్ పార్టీ పోలింగ్ బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం  కావాలని పిలుపునిచ్చారు. పోలింగ్ బూత్ పరిధిలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. రానున్న రోజుల్లో నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. 

కేవల్ కిషన్ ఆశయ సాధనకు కృషి చేయాలి

మెదక్​ టౌన్​/సంగారెడ్డి టౌన్, వెలుగు :  కేవల్ కిషన్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం కేవల్ కిషన్ 63వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్, మెదక్​లో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బస్వరాజ్, చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలోని కేవల్ కిషన్ జాతరలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు మాట్లాడారు. కేవల్ కిషన్ జీవించినన్ని రోజులూ పేదల సంక్షేమం కోసం పని చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆయనను కొందరు ఒక కులానికే పరిమితం చేస్తున్నారని, ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని, పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు.  

సర్కారు దవాఖానాల సౌలతులు ఎట్లున్నయ్!

గజ్వేల్, వెలుగు : ‘అమ్మా.. సర్కారు​దవాఖానాల సౌలతులు ఎట్లున్నయ్.. కేసీఆర్ కిట్టు ఇస్తున్రా.. పేదోళ్లకు మంచి వైద్యం అందాలని ప్రభుత్వం మస్తు కష్టపడుతోంది. సీఎం కేసీఆర్ గజ్వేల్ ఆసుపత్రిలో కార్పొరేట్ వసతులు కల్పించిన్రు.. అన్ని మంచిగా ఉన్నయ్​ కదా..’ అంటూ మంత్రి హరీశ్​రావు పేషెంట్లకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సోమవారం రాత్రి ఆకస్మికంగా గజ్వేల్​ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి అంతా తిరుగుతూ పేషెంట్లను ఆత్మీయ పలకరించారు. 

వైద్యుల పనితీరు,  సమయపాలనపై ఆరా తీశారు. ప్రజల్లో సర్కారు దవాఖానాలపై నమ్మకం పెంచామని, అదే స్థాయిలో వైద్యులు సేవలందించాలని సూచించారు. ఆసుపత్రిలోని మొబైల్ ఎక్స్ రేను వెంటనే వినియోగంలోకి తేవాలని ఆర్​ఎంవోను  ఆదేశించారు. గర్భిణులను ఆసుపత్రికి తీసుకొచ్చే ఆశ, ఏఎన్ఎంలకు ప్రత్యేక గది ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కు సూచించారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఉన్నారు.

డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు అర్హులకే ఇవ్వాలి

 సీపీఐ ఆధ్వర్యంలో మున్సిపల్ ​ఆఫీస్ ​ఎదుట ధర్నా 

కోహెడ (హుస్నాబాద్), వెలుగు : అర్హులకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని సీపీఐ నాయకుడు గడిపే మల్లేశ్​ డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం హుస్నాబాద్​ మున్సిపల్​ఆఫీస్​ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఉన్నవారి పేర్లే ఉన్నాయని, ఈ అవకతవకలపై మరోసారి సర్వే చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. పేదలకు న్యాయం చేయకుంటే సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ ​చైర్ ​పర్సన్​ రజితకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జాగీర్, సత్యనారాయణ, అయిలేని సంజివరెడ్డి, కొహెడ కొమురయ్య, సుదర్శన్ చారి, గూడ పద్మ, రాజు కుమార్, స్వాతి,కాల్వల ఎల్లయ్య  పాల్గొన్నారు.

సీపీఐది ఘనమైన పోరాటాల చరిత్ర

చేర్యాల, వెలుగు: సీపీఐది ఘనమైన పోరాటాల చరిత్ర అని ఆ పార్టీ సిద్దిపేట జిల్లా కర్యవర్గ సభ్యుడు అందె అశోక్​ అన్నారు. సోమవారం సీపీ‌‌‌‌‌‌‌‌ఐ 98వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని అంగడీ బజార్​లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఈరి భూమయ్య, సిద్ధులు, ప్రేమ్​కుమార్, సత్తయ్య గౌడ్, సురేందర్, వెంకట్​రెడ్డి పాల్గొన్నారు. 

పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

కోహెడ, వెలుగు : పల్లెల అభివృద్ధికి సీఎం కేసీఆర్​పెద్ద పీట వేస్తున్నారని ఎంపీపీ కొక్కుల కీర్తి అన్నారు. సోమవారం మండలంలోని కూరెల్ల గ్రామంలో ఒడ్డెర కాలనీ, లంబాడీ తండాకు వెళ్లే రోడ్డుపై రూ.35 లక్షలతో నిర్మించే కల్వర్టు నిర్మాణానికి ఆమె భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వానాకాలంలో వరదలు రావడంతో తండాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో కల్వర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని చెప్పారు. అలాగే బస్వాపూర్​లో హైస్కూల్​లో రూ.12 లక్షల ఈజీఎస్​నిధులతో నిర్మించే మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్యామల, మాజీ ఎంపీపీ తిప్పారపు శ్రీకాంత్, సర్పంచ్​రమేశ్, ఎంపీటీసీ స్వామి ఉన్నారు.