తిమ్మాపూర్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో ఆట,పాటలతో ప్రజల్ని ఏకం చేసిన ఎమ్మెల్యే రసమయిని ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదని, ధైర్యముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు సవాల్ విసిరారు. గుండ్లపల్లి లో ఎమ్మెల్యే బాలకిషన్ పై జరిగిన దాడికి నిరసనగా ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో ఆయన మాట్లాడారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా కవ్వంపల్లి సత్యనారాయణను నియమిస్తే యువతను, కార్యకర్తలను గూండాలుగా తయారు చేస్తున్నారని విమర్శించారు. భవిష్యత్‌లో కాంగ్రెస్ నుంచి టికెట్వచ్చినా తమ కుటుంబ సభ్యులు తప్ప ప్రజలెవరూ కవ్వంపల్లికి ఓట్లు వేయరన్నారు. సమావేశంలో గన్నేరువరం జెడ్పీటీసీలు రవీందర్ రెడ్డి, శేఖర్ గౌడ్, ఎంపీపీ రమణారెడ్డి, లీడర్లు పాల్గొన్నారు.
పింఛన్ డబ్బులు వెంటనే ఇవ్వండి
కోరుట్ల, వెలుగు: తమకు ప్రతీనెల ఇవ్వాల్సిన పింఛన్వెంటనే మంజూరు చేయాలని దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో కోరుట్లలో జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ప్రతీనెల పింఛన్ డబ్బులు ఇవ్వకపోవడంతో పూట గడవడం కష్టం గా ఉందన్నారు. అనంతరం సంఘం పట్టణ, మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రెసిడెంట్ మాదాసు ప్రవీణ్, కార్యదర్శి పుల్లూరి రాజేశ్, జిల్లా కన్వీనర్ అబ్దుల్ అజీజ్, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు చంద్రయ్య, మండలాధ్యక్షుడు దేవదాస్, కార్యదర్శి ఓం ప్రకాశ్ పాల్గొన్నారు.
దళితబంధుతో ఆర్థిక భరోసా
ఇల్లందకుంట, వెలుగు: దళిత బంధుతో దళితులకు ఆర్థిక భరోసా లభిస్తోందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మండలంలోని మల్యాలలో గురుకుంట్ల శ్రీనివాస్‌కు దళితబంధు పథకం ద్వారా మంజూరైన కిరాణ, జనరల్ స్టోర్ ను జడ్పీ చైర్పర్సన్కనుమల్ల విజయతో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు దళితులంతా రుణపడి ఉంటారని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జ్యోత్స్న, సర్పంచ్సాంబయ్య, ఉప సర్పంచ్‌కుమార్, సింగిల్‌విండో వైస్ చైర్మన్ వీరస్వామి, రాజయ్య పాల్గొన్నారు.
బెల్లం, పటిక అమ్మితే కఠిన చర్యలు
మెట్ పల్లి, వెలుగు: గుడుంబా తయారీదారులకు బెల్లం, పటిక అమ్మితే వ్యాపారస్తులపై కేసులు నమోదు చేస్తామని మెట్ పల్లి ఆబ్కారీ సీఐ ఎం. రాధ పేర్కొన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. తిమ్మాపూర్ తండాలో నాటుసారా అమ్ముతున్న మాలోతు నూర్ సింగ్(47)ను అరెస్తు చేసి సారాను స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నంలో గుడుంబా తయారీదారులకు బెల్లం, పటిక సరఫరా చేస్తున్న కిరాణా షాపు యజమాని రంగు రాజేందర్ పై కేసు నమోదు చేశారు. దుకాణంలో నిల్వ ఉంచిన 80 కేజీల బెల్లం, 20 కేజీల పటిక స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మెట్ పల్లి, కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్ మండలాల్లోని కిరాణా వ్యాపారస్తులు గుడుంబా తయారీదారులకు బెల్లం, పటిక అమ్మితే తహశీల్దార్ ఎదుట రూ.2 లక్షల పూచీకత్తుపై బైండోవర్ చేస్తామని హెచ్చరించారు. దాడుల్లో ఎస్సైలు సమ్మయ్య, మాజిద్, సిబ్బంది రాంచందర్, అఫ్రోజ్, రవి పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం
రాజన్న సిరిసిల్ల, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్, బీజేపీ లీడర్దరువు ఎల్లన్న అన్నారు. ఎల్లన్న సెన్సార్ బోర్డు మెంబర్ అయిన తర్వాత మొదటిసారి సిరిసిల్లకు వచ్చిన సందర్బంగా పట్టణ బీజేపీ నాయకుడు ఆవునూరి రమాకాంత్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఎల్లన్న మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోందన్నారు. మోడీ నాయకత్వాన్ని దేశం విశ్వసిస్తోందన్నారు. కార్యక్రమంలో వేణు, బర్కం నవీన్, కైలాస్ కుమార్, శ్రీగదా మైసయ్య, సాయికృష్ణ, శ్రీధర్, విజయ్
పాల్గొన్నారు.
సింగరేణిపై ప్రధాని క్లారిటీ ఇచ్చారు
పెద్దపల్లి, వెలుగు: సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసేది లేదని ప్రధాని నరేంద్రమోడీ రామగుండం సభలో ప్రజలకు క్లారిటీ ఇచ్చారని బీజేపీ సీనియర్ లీడర్జి.సురేశ్‌రెడ్డి అన్నారు. పెద్దపల్లిలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రామగుండం ఆర్ఎఫ్ సీఎల్ పున:ప్రారంభానికి కృషి చేసిన బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వివేక్ వెంకటస్వామికి, సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ధన్యవాధాలు తెలిపారు. సభను విజయవంతం చేసిన బీజేపీ లీడర్లు, కార్యకర్తలు, రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో నాయకులు కె.సత్యనారాయణ, ఎం.మనోహర్, వి.రమేశ్, జి. సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
‘బకాయిల పేరుతో ఓట్లు తొలగించొద్దు’
బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ పాలకవర్గ ఎన్నికల్లో కరెంట్ బకాయిలు ఉన్న రైతుల ఓట్లను తొలగించవద్దని ఆదివారం మండల బీజేపీ లీడర్లు స్థానిక సెస్ ఆఫీస్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండలా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ డబ్బులు చెల్లిస్తేనే ఓటు హక్కు ఉంటుందని అధికారులు రైతుల వద్ద బకాయిలు వసూలు చేస్తున్నారన్నారు. కరెంట్ బకాయి ఉన్నా రైతులకు ఓటు వేసే అవకాశం కల్పించాలని లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వారిలో మహేశ్ కృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, రాజు, రాజేంద్రప్రసాద్, లక్ష్మణ్, బాలయ్య, అనిల్ కుమార్ పాల్గొన్నారు.
