ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్​ టౌన్, వెలుగు : మునుగోడులో బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని పార్టీ మెదక్​ జిల్లా ప్రెసిడెంట్​గడ్డం శ్రీనివాస్​అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు.. ఎలాంటి ఎన్నికలు వచ్చినా ప్రజలు బీజేపీ పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గురువారం మెదక్​ పట్టణంలోని ద్వారకా గార్డెన్స్​లో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 21న కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి కేంద్రమంత్రి అమిత్​షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్​ ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలే తమను గెలిపిస్తాయన్నారు. పార్టీ జిల్లా ఇన్​చార్జి మల్లారెడ్డి మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక భవిష్యత్తులో అధికార మార్పునకు నాంది కానుందన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి,  జిల్లా జనరల్​ సెక్రటరీ నల్లాల విజయ్​కుమార్, బీజేవైఎం జిల్లా ప్రెసిడెంట్​ఉదయ్​కిరణ్,  వైస్ ​ప్రెసిడెంట్​సత్యనారాయణ, బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్​నాయిని ప్రసాద్, నాయకులు బక్కవారి శివకుమార్, మధు, జనార్దన్, ప్రభాకర్ రెడ్డి , అశ్విని, రంజిత్ రెడ్డి, నవీన్, సుధాకర్, జక్కుల శేఖర్, లోకేశ్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.

గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు

మెదక్​టౌన్, వెలుగు :  గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్​ చైర్ ​పర్సన్​ సునీతాలక్ష్మారెడ్డి సూచించారు. గురువారం మెదక్ పట్టణంలో జిల్లా గ్రంథాలయం ఆవరణలో కొత్తగా నిర్మించిన భవనాన్ని మెదక్, నర్సాపూర్​ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్​రెడ్డి, మదన్​రెడ్డి, కలెక్టర్​హరీశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ చంద్రాగౌడ్​తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయాన్ని సొంత నిధులతో ఏర్పాటు చేసినందుకు జిల్లా గ్రంథలయ సంస్థ చైర్మన్ ​చంద్రాగౌడ్​ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కలెక్టర్​ మాట్లాడుతూ జిల్లాలో ఆన్​లైన్​ లైబ్రరీలు కూడా ఏర్పాటు చేయాలని, దీనికి తన సహకారం తప్పనిసరిగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ చంద్రాగౌడ్, మెదక్​ మున్సిపల్​ చైర్మన్​చంద్రపాల్, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ, కౌన్సిలర్​ కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సెక్రటరీ వంశీకృష్ణ, లైబ్రెరియన్లు నరేందర్​రెడ్డి, శంకర్​ పాల్గొన్నారు.

పెండింగ్​ వర్క్స్​ పూర్తి చేయాలి

దుబ్బాక, వెలుగు: డబుల్​ బెడ్ ​రూమ్​ ఇండ్లలో పెండింగ్​ పనులను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్, విద్యుత్​అధికారులను ఎమ్మెల్యే రఘునందర్ ​రావు ఆదేశించారు. గురువారం దుబ్బాక పట్టణంలోని పలు కాలనీల్లో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేశారు. కాలనీలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. డ్రైనేజీ, విద్యుత్, రోడ్లు, తాగు నీటి సమస్యలు ఉన్నాయని కాలనీవాసులు ఆయన దృష్టికి తెచ్చారు. ప్రజల నుంచి వినతులను ఎమ్మెల్యే స్వయంగా స్వీకరించారు. స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్​కమిషనర్లతో కలిసి చర్చించి వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో సర్వాయి పాపన్న గౌడ్​ జయంతి సందర్భంగా ఆయన ఫొటోకు ఎమ్మెల్యే పూల మాలలు వేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్​ మట్ట మల్లారెడ్డి, బీజేపీ నాయకులు అంబటి బాలేశ్​ గౌడ్, చింత సంతోష్, మచ్చ శ్రీనివాస్, పుట్ట వంశీ, గాజుల భాస్కర్​, సుంకోజి ప్రవీణ్, భద్రి పాల్గొన్నారు.

ప్రగతి భవన్​ ను ముట్టడిస్తాం

సంగారెడ్డి టౌన్/కొండాపూర్, వెలుగు : సీఎం కేసీఆర్​ అసెంబ్లీ సాక్షిగా తమకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రగతి భవన్​ ముట్టడిస్తామని వీఆర్​ఏలు హెచ్చరించారు. 25 రోజులుగా శాంతియుతంగా ఆందోళనలు చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్, కొండాపూర్​ తహసీల్దార్​ ఎదుట నిరసన తెలిపారు. కలెక్టరేట్​ ఏవో స్వర్ణలతకు వినతి ప్రతం అందజేశారు. సంగారెడ్డిలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు వీఆర్​ఏల ఆందోళనకు మద్దుతు తెలిపి మాట్లాడారు. వీఆర్​ఏలకు పే స్కేల్, పదోన్నతులు, వారసత్వ ఉద్యోగాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాటను అమలు చేయకుంటే కేసీఆర్ కు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. 

ఆటలతో ఆరోగ్యం

వెలుగు, నెట్​వర్క్: క్రీడలు శారీరక, మానసిక దారుఢ్యం పెంపొందించడంతోపాటు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పాటునందిస్తాయని, అందుకు ప్రతి ఒక్కరూ ఆటలు ఆడాలని అధికారులు, నాయకులు సూచించారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా గురువారం మెదక్​లోని కలెక్టరేట్​లో క్రీడల్లో గెలుపొందినవారికి కలెక్టర్ హరీశ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. సంగారెడ్డిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో క్రీడా పోటీలను కలెక్టర్ శరత్, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ ప్రారంభించి పలు సూచనలు చేశారు.  

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ లోని రంగనాయక సాగర్ ప్రాజక్టు వద్ద పోలీస్ కమిషనరేట్ అధికారులు, సిబ్బందికి 5కె రన్ నిర్వహించారు. సీసీ ఎన్.శ్వేత జెండా ఊపి ప్రారంభించారు. మూడు రోజులుగా నిర్వహించిన జిల్లా స్థాయి ఫ్రీడమ్ కప్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరిగింది. దీనికి జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, సీపీ ఎన్. శ్వేత, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్​రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. పెద్దశంకరంపేటలో నిర్వహించిన క్రీడా పోటీలకు ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి హాజరై గెలుపొందని వారికి బహుమతులు ప్రదానం చేశారు.