ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

కోహెడ (హుస్నాబాద్​), వెలుగు: ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో 100 కోట్ల బదలాయింపులో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందని ఈడీ విచారణలో తేలిందని, ఆమె పాత్ర లేకుంటే 10 ఫోన్లను ఎందుకు ధ్వంసం చేశారని ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి ప్రశ్నించారు. గురువారం హుస్నాబాద్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. లిక్కర్​ స్కామ్​లో కవిత పాత్ర లేకుంటే విచారణకు హాజరుకావాలన్నారు. రాష్ట్రంలోని అన్ని రంగాల పై కేంద్రం వివక్ష చూపుతోందని, రాష్ట్ర హక్కుల సాధనలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారన్నారు. అంతకుముందు హుస్నాబాద్ లో సబ్ కోర్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేస్తున్న రిలే దీక్షా శిబిరాన్ని ఆయన సంఘీభావం తెలిపారు. శాసన మండలి సమావేశాల్లో సబ్ కోర్టు ఏర్పాటు అంశాన్ని ప్రస్తావిస్తానని తెలిపారు. 

యాసంగి యాక్షన్​ ప్లాన్​ రెడీ చేయండి

సంగారెడ్డి టౌన్, వెలుగు :  జిల్లాలోని భారీ, మధ్య, చిన్న నీటి వనరుల కింద యాసంగిలో పంటల సాగుకు నీటి విడుదల కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు కలెక్టర్ శరత్ సూచించారు. గురువారం కలెక్టరేట్ మినీ మీటింగ్​హాల్​లో కలెక్టర్ అధ్యక్షతన నారాయణఖేడ్ , అందోల్ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నీటిపారుదల, వ్యవసాయ శాఖల అధికారులతో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించారు. సింగూరు ప్రాజెక్టు కింద 30 వేల ఎకరాలకు నల్లవాగు ప్రాజెక్టు కింద 5,100ఎకరాలకు పంట సాగు నీటి విడుదల చేయడానికి అడ్వైజర్  బోర్డ్ నిర్ణయించింది. నీటిని రెగ్యులరైజ్ చేయాలని సింగూర్, నల్లవాగు చెరువుల రిపేర్లు మేజర్ వర్క్స్ ఏమైనా ఉంటే వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్​ సూచించారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ ఈ ఏడాది అన్ని ప్రాజెక్టులు, చెరువులలో పూర్తిస్థాయిలో నీరు ఉందని, యాసంగిలో కొత్తగా నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చన్నారు. అయినా కాల్వల రిపేర్లకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ కాకివాగు, ఉజలంపాడు ప్రాజెక్టు, నల్లవాగులో ఎమర్జెన్సీ కాల్వల రిపేర్లు చేపట్టాలని సూచించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ఎస్సీ మురళీధర్ డీఈలు మధుసూదన్ రెడ్డి, జై భీమ్, విజయ్ కుమార్ ఉమ్మడి జిల్లా ఇంజనీర్ కన్సల్టెంట్ మల్లయ్య, వ్యవసాయ శాఖ జీడీ నరసింహారావు పాల్గొన్నారు.

డబుల్ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి 

జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు ఆఫీస్​లో డబుల్ బెడ్ రూమ్  నిర్మాణాల పురోగతి పై సమీక్ష నిర్వహించారు. నిర్మాణాలు పూర్తయిన ఇండ్లలో పెండింగ్​ పనులు కంప్లీట్ చేసి డిసెంబర్ నెలాఖరులోగా లబ్ధిదారులకు అందజేయాలన్నారు. అక్టోబర్ వరకు సమర్పించిన బిల్లుల చెల్లింపులు జరిగాయని , అనంతరం జరిగిన పనులకు బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. సమీక్షలో అడిషనల్​ కలెక్టర్ రాజర్జి షా, పంచాయతీరాజ్ ఈఈ జగదీశ్వర్, పబ్లిక్ హెల్త్  ఈఈ వీరప్రతాప్, ఆర్ అండ్ బీ డీఈ రవీందర్ ఉన్నారు. 

బీజేవైఎం ఆధ్వర్యంలో రాస్తారోకో

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో భాగస్వాములైన ఎమ్మెల్సీ కవితను వెంటనే బర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేస్తూ గురువారం హుస్నాబాద్​లో బీజేవైఎం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవిత ఫొటోకు లిక్కర్​సీసాలతో దండ వేసి నిరసన తెలిపారు. దీంతో పోలీసులకు, నాయకుల మధ్య తోపులాట జరిగింది. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నరేశ్, నాయకులు భీమేశ్వర్​ తదితరులు  ఉన్నారు.

పోలీస్​ ఉద్యోగాల్లో సత్తా చాటాలి

దుబ్బాక, వెలుగు: ఎస్సై, కానిస్టేబుల్​ఉద్యోగాల్లో సత్తా చాటి దుబ్బాక గడ్డ పేరు ప్రతిష్టలను రాష్ట్రంలో మారుమోగించాలని ఎమ్మెల్యే రఘునందన్​రావు అభ్యర్థులకు పిలుపునిచ్చారు. గురువారం నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో ఫిజికల్​ ట్రైనింగ్​ క్లాసులు తీసుకుంటున్న ఎస్సై, కానిస్టేబుల్​ అభ్యర్థులను ఎమ్మెల్యే  కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సై, కానిస్టేబుల్​ ఉద్యోగం రావాలంటే ఈవెంట్స్​ ముఖ్యమైనవని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, శారీక శ్రమతో  ప్రతిభ చాటాలని సూచించారు. ప్రతి అభ్యర్థికీ పౌష్టికాహారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. దుబ్బాక పట్టణ కేంద్రానికి చెందిన రిటైర్డ్​ టీచర్​ కొట్టె నారాయణ, బద్దిపడగ వెంకట్​రెడ్డి మరణించిన విషయాన్ని తెలుసుకుని బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. 

దుబ్బాకను రెవెన్యూ డివిజన్​ చేయాలని కౌన్సిల్​ తీర్మానం


దుబ్బాక, వెలుగు: నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకను రెవెన్యూ డివిజన్​చేయాలని మున్సిపల్ ​చైర్​పర్సన్​గన్నె వనితాభూమిరెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన మున్సిపల్​ కౌన్సిల్​సమావేశం ఏకగీవ్రంగా తీర్మానం చేసింది. సమావేశంలో 12 అంశాలను ఎజెండాలో పొందుపర్చగా మూడు అంశాలను ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రెవెన్యూ డివిజన్​తో పాటు దుంపలపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో కోర్టు భవనం నిర్మించాలని, కేసీఆర్​స్కూల్​నుంచి డబుల్​బెడ్​రూమ్​ల వరకు స్ర్టీట్​ లైట్స్​ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా చైర్​ పర్సన్​ మాట్లాడుతూ దుబ్బాక అంటే సీఎం కేసీఆర్​కు ప్రేమ ఉందన్నారు. ఆదర్శ మున్సిపాల్టీగా చేయడానికి ఎంపీ ప్రభాకర్​రెడ్డితో కలిసి త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తామని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్​పాతూరి గణేశ్​రెడ్డి, ఏఈ పృథ్వీరాజ్, మున్సిపల్​ వైస్​చైర్మన్​అధికం సుగుణ బాలకిషన్​గౌడ్, కౌన్సిలర్స్​ కూరపాటి బంగారయ్య, ఆస యాదగిరి, ఇల్లెందుల శ్రీనివాస్​, పల్లె మీనా రామస్వామి గౌడ్, ఆస సులోచన స్వామి, బత్తుల స్వామి, నిమ్మ రజిత గిరి, ఎంగారి స్వప్న రాజిరెడ్డి, దేవుని లలిత పాల్గొన్నారు.

బూత్​ లెవల్ నుంచి పార్టీని పటిష్టం చేయాలి

మెదక్, వెలుగు: బూత్​ లెవల్​ నుంచి పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ మెదక్​ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ పార్టీ శ్రేణులకు సూచించారు. గురువారం మెదక్ లోని పార్టీ జిల్లా ఆఫీస్​లో టౌన్​ ప్రెసిడెంట్​ నాయిని ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన పట్టణ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు.  టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్‌‌, అసెంబ్లీ కన్వీనర్ ఎక్కలదేవి మధుసూదన్, పట్టణ ఇన్​చార్జి రాజశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివ, పట్టణ ప్రధాన కార్యదర్శరాజు పాల్గొన్నారు. 

రామాయంపేట, నిజాంపేటలో..

రామాయంపేట, నిజాంపేట, వెలుగు : రామాయంపేట, నిజాంపేట మండలాల కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తో పాటు రాష్ట్ర నాయకులు జనార్ధన్ రెడ్డి, రాజశేఖర్, మాజీ జడ్పీ చైర్మన్ బాలయ్య హాజరై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో రామాయంపేట టౌన్ ప్రెసిడెంట్ శంకర్ గౌడ్, జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డి, నిజంపేట మండల అధ్యక్షుడు చంద్రశేఖర్  పాల్గొన్నారు.

అవినీతి పాలన.. 

కొండాపూర్, వెలుగు :  రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసి కమీషన్ల కోసం అవినీతి పరిపాల నడిపిస్తోందని సంగారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ రాములు అన్నారు. గురువారం పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన మరేపల్లిలో మండల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సర్కారు పూర్తిగా అవినీతి, భూ కబ్జా, కమీషన్లు, స్కాంలలో మునిగిపోయి, పాలనగాలికి వదిలేసిందని ఆరోపించారు. తెలంగాణలో ప్రతి ఒక్కరూ బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.