ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

సిద్దిపేట రూరల్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేటలో పలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలో జిల్లాస్థాయి ఇన్ స్పైర్- సైన్స్​ ఫెయిర్​ను ఆయన పరిశీలించారు. చిట్టి మెదడు కు గట్టి పదును పెట్టారని విద్యార్థులను అభినందించారు. కేంద్రం మోడల్ స్కూల్స్ రద్దు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం మోడల్ స్కూల్స్ బాధ్యత తీసుకున్నదన్నారు. దీంతో విద్యపై బడ్జెట్ లో 10శాతం నిధులు వినియోగిస్తున్నట్లు చెప్పారు. మనఊరు -మనబడిలో భాగంగా రూ.7 వేల కోట్లు కేటాయించి పలు పనులు చేస్తున్నామని తెలిపారు. 

మైనర్ ఇరిగేషన్ పనులు వేగవంతం చేయాలి

ప్రతి ఊరికి ప్రతి చెరువుకు కాల్వలు, మైనర్ కాల్వల ద్వారా నీళ్లు చేరవేయడమే లక్ష్యంగా పని చేయాలని ఆఫీసర్లకు మంత్రి సూచించారు. సిద్దిపేట  క్యాంప్​ ఆఫీస్​లో మల్లన్న, రంగనాయక సాగర్ జలాశయం ద్వారా కాల్వలు, మైనర్ కాల్వల పనుల పురోభివృద్ధి పై స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్డీఓ, ఇరిగేషన్ ఈఈ, డీఈ, ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్షించారు. మైనర్ ఇరిగేషన్ పనులకు కావాల్సిన వాటిలో వెంటనే అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ ఈఈ సాయిబాబాను ఆదేశించారు. జిల్లాలో చేపలు పట్టే మత్స్యకారులకు కొత్త సొసైటీల ఏర్పాటు కసరత్తు త్వరితగతిన ప్రారంభం చేయాలని జిల్లా మత్స్యకార శాఖ అధికారికి సూచించారు.  అంతకుముందు చిన్నకోడూర్ మండలంలోని వివిధ గ్రామాల్లోని 75 లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. అంతగిరి రిజర్వాయర్​నిర్వాసితులైన కొచ్చగుట్టపల్లి నిర్వాసిత కుటుంబాల్లో 18 ఏండ్లు నిండి అర్హులైన లబ్ధిదారులు 35 మంది, పునరావాస కాలనీలోని 59 గృహ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కాపీలను, ఆరుగురి దివ్యాంగులకు తానా సహకారంతో బ్యాటరీతో నడి చే ట్రై సైకిళ్లను, ల్యాప్ టాపులు, గ్రామీణ ప్రాంతాల నుంచి ఇతర గ్రామాల్లో చదివే విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో చేపట్టిన శ్రీకృష్ణ కాలచక్ర ఆయుత చండీ మహారుద్ర యాగంలో ఆయన సతీసమేతంగా హాజరయ్యారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కేసీఆర్ నగర్ లో ప్రభుత్వ సహకారంతో ఎల్అండ్ టీ సంస్థ నిర్వహిస్తున్న నిర్మాణ నైపుణ్య శిక్షణ సంస్థను ఆయన ప్రారంభించారు. ఆయన వెంట సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, చిన్నకోడూర్ ఏంపీపీ కూర మాణిక్ రెడ్డి, నాయకులు చందర్ రావు, ఆర్డీఓ అనంతరెడ్డి, ఇరిగేషన్ ఈఈ సాయి బాబా, డీఈ, ఏఈఈ ఖాజా, ఏఈఈ అమరజీవి ఉన్నారు. 
 

‘మల్లన్న కల్యాణానికి హాజరు కండి’

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఈనెల 18న నిర్వహించే స్వామివారి కల్యాణ మహోత్సవానికి రావాలని పలువురు ప్రముఖులకు ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. శుక్రవారం ఆలయ ఈఓ బాలాజీ, చైర్మన్ గీస భిక్షపతితో కలిసి హైదరాబాద్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , డిప్యూటీ స్పీకర్ పద్మరావుగౌడ్ తో పాటు సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రోజా శర్మకు పత్రికలను ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, పడిగన్నగారి ఆంజనేయులు, పడిగన్నగారి మల్లయ్య, అర్చకులు, ధర్మకర్తలు నామిరెడ్డి సౌజన్య, కందుకూరి సిద్ధిలింగం, సూటిపల్లి 
బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.

బీజేపీ కుట్రలు సాగవు
 

జహీరాబాద్, వెలుగు :  తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కుట్రలు సాగవని, ఆ పార్టీ లీడర్ల మాటలు వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరని జహీరాబాద్​ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను చివరి వరకూ టీఆర్ఎస్ లోనే కొనసాగుతానని, బీజేపీలో చేరుతారన్న ప్రచారం బూటకమన్నారు. అంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పట్టణంలో అయ్యప్ప భక్తులు నిర్వహించిన మహా పడిపూజ కార్యక్రమానికి ఎంపీ బీబీ పటేల్ తో కలిసి హాజరయ్యారు. ఆయన వెంట డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, పార్టీ నాయకులు ఉన్నారు.

 

రాష్ట్రంలో మళ్లీ టీఆర్ఎస్ దే అధికారం

చేర్యాల, వెలుగు  : రాష్ట్రంలో మళ్లీ అధికారం చేపట్టేది టీఆర్ఎస్సే అని అని ఎమ్మెల్యే ము త్తి రెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ కుట్రలు 
సాగవన్నారు. కవితపై అక్రమంగా లిక్కర్ కేసును బనాయించడం బీజేపీ అవివేకమని, ఎన్ని కేసులు పెట్టినా,  జైలుకు పంపినా కవిత క్లీన్ చిట్ తో  బయటికి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉల్లంపల్లి కర్ణకర్, మున్సిపల్ చైర్ పర్సన్  ఏ.స్వరూపారాణి, సర్పంచ్ ల ఫోరం ప్రెసిడెంట్ ఎల్లారెడ్డి, మార్కెట్ చైర్మన్​ మల్లేశం గౌడ్, వైస్ చైర్మన్ పి. వెంకట్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. 

 

టీఆర్ఎస్ అవినీతిని ప్రజలకు వివరించాలి


దుబ్బాక, వెలుగు: రాష్ట్రంలో కేసీఆర్​ ప్రభుత్వం కొనసాగిస్తున్న నిరంకుశ రాజకీయాలు, అవినీతి పాలనను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే రఘునందన్​రావు బీజేపీ కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం దుబ్బాకలో బీజేపీ నియోజకవర్గ శక్తి కేంద్రాల ప్రముఖులతో నిర్వహించిన సమావేశంలో బీజేపీ జిల్లా ఇన్​చార్జి అంజన్​ కుమార్​గౌడ్​తో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బీజేపీ జెండాను ఎగురవేయడానికి కృషి చేస్తూనే ప్రజా సమస్యలపై స్పందించాలని కార్యకర్తలకు సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం దుబ్బాకలో ఈవెంట్స్​ కోసం కోచింగ్​ తీసుకుంటున్న 150 మంది ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎమ్మెల్యే పాలు, పండ్లు, గుడ్లను ఉచితంగా అందజేశారు. కోచింగ్​ పూర్తయ్యేంత వరకూ పౌష్టికాహారం అందజేస్తానని ఆయన తెలిపారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను  పంపిణీ చేశారు. 

ఫేక్​ న్యూస్​ను కట్టడి చేయాలి 

 మెదక్​ టౌన్, వెలుగు :  వాట్సప్​ వచ్చాక వార్తల విలువ పడిపోయిందని,  రోజురోజుకూ ఫేక్​ న్యూస్ ​పెరిగిపోతోందని, వెంటనే కట్టడి చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. జర్నలిస్టులు సొంతంగా న్యూస్​ను కలెక్ట్ చేసి ప్రజెంట్ చేస్తే మంచి పేరు వస్తుందన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని టీఎన్జీవో భవనంలో టీయూడబ్ల్యూజే ద్వితీయ జిల్లా మహాసభ యూనియన్​ జిల్లా ప్రెసిడెంట్​శంకర్ దయాళ్ చారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర యాజమాన్యాలను ధిక్కరించి పోరాట స్ఫూర్తిని తెలిపింది జర్నలిస్టులేనన్నారు. ప్రస్తుతం వాట్సప్ వచ్చాక ఏది నిజం.. ఏదీ అబద్ధమో తెలియడంలేదన్నారు. జర్నలిజంకు మంచి రోజులు రావాలంటే ఫేక్​ న్యూస్​ అరికట్టాలని సూచించారు. జర్నలిస్ట్ హెల్త్ కార్డుల గురించి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు గృహ వసతి కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. టీయూడబ్ల్యూ ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి విరాహత్​ అలీ మాట్లాడుతూ యూనియన్​ దశాబ్దాలుగా జర్నలిస్ట్ ల హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవో మెదక్​ జిల్లా ప్రెసిడెంట్​ దొంత నరేందర్, జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ప్రధాన కార్య దర్శి అశోక్జ, జర్నలిస్ట్ లు 
పాల్గొన్నారు.

పలు కార్యక్రమాల్లో.. 

ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నియోజకవర్గంలోని కల్యాణలక్ష్మి, సీఎంఆర్​ఎఫ్​ లబ్ధిదారులకు  ఆమె చెక్కులు అందజేశారు. ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసులో నిర్వహించిన  మీకోసం కార్యక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మెదక్ లోని ఏంసీహెచ్ ఆస్పత్రిలో నవంబర్ నెలలో రికార్డు స్థాయిలో 407 ప్రసవాలు నిర్వహించిన సందర్భంగా డాక్టర్ల బృందాన్ని ఎమ్మెల్యే అభినందించారు. 

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి


మెదక్​ టౌన్, వెలుగు :  కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ మెదక్ జిల్లా ప్రెసిడెంట్​ గడ్డం శ్రీనివాస్​ అన్నారు. శుక్రవారం మెదక్​ మండల పరిధిలోని రాజ్​పల్లిలో నిర్వహించిన మండల కార్యవర్గ సమావేశంలో శ్రీనివాస్​ మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్ రెడ్డి,  బీజేపీ మహిళా మోర్చా జిల్లా ప్రెసిడెంట్​ వీణ, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.