ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

కోహెడ(బెజ్జంకి), వెలుగు: దాచారం త్వరంలో ఇండస్ట్రియల్​ హబ్​గా మారబోతోందని మానకొండూర్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ అన్నారు. బుధవారం బెజ్జంకి ఎంపీడీవో ఆఫీస్​లో నిర్వాసితులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక రంగాలకు ప్రత్యేకమైన పారిశ్రామిక పార్కులను టీఎస్ఐఐసీ ఏర్పాటు చేస్తోందన్నారు. దాచారం పారిశ్రామిక అభివృద్ధి రంగంలో ముందు అడుగు వేయబోతుందని తెలిపారు. భూ నిర్వాసితులకు మెరుగైన పరిహారం అందిస్తున్నామన్నారు. గ్రామంలో 3 బ్లాక్ లు ఏర్పాటు చేశారని, అందులో మొదటి aబ్లాక్ లో 20 మంది రైతులకు రూ.7.32 కోట్లు లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ కవిత పాల్గొన్నారు.

గాగిళ్లపురం రైతుల ఆందోళనపై అడిషనల్​ కలెక్టర్​ ఆరా

చేర్యాల, వెలుగు : నెల రోజులుగా వరిధాన్యం కొనకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా మద్దూరు మండల రెవెన్యూ ఆఫీస్ ముందు మండలంలోని గాగిళ్లపురం రైతులు మంగళవారం ధాన్యం పోసి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బుధవారం సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆరా తీశారు. మద్దూరు ఎంఆర్ ఓ భూపతిని అడిగి పలు విషయాలు తెలుసుకున్నారు. మండల కేంద్రంలోని ఉన్న ఐకేపీ సెంటర్​ను తనిఖీ చేశారు. అనంతరం కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించారు. టెన్త్​స్టూడెంట్స్​ను పలు ప్రశ్నలు వేశారు. వారు సమాధానాలు చెప్పకపోవడంతో బోధన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలు ఆన్సర్​ చెప్పకపోవడానికి కారణాలు తెలపాలని టీచర్లను ఆదేశించారు. ఆ తర్వాత గాగిళ్లపురం వెళ్లకుండానే ఆయన వెళ్లిపోవడంపై  బాధిత రైతులు అసహనం వ్యక్తం 
చేశారు. 

ఆదర్శంగా నిలిచేలా ‘మన బడి’ పనులు ఉండాలి

సిద్దిపేట రూరల్, వెలుగు : గజ్వేల్ సీఎం కేసీఆర్​ నియోజకవర్గం అయినందున మనఊరు- మనబడి పథకం కింద జరుగుతున్న పనులు రాష్ట్రం మొత్తం ఆదర్శంగా నిలిచేలా ఉండాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆఫీస్ మీటింగ్​హాల్​లో గజ్వేల్ నియోజకవర్గంలో మనఊరు మనబడిలో కేటాయించిన స్కూల్ హెచ్ఎం లు, ఎస్ఎంసీ చైర్మన్, ఎంఈఓలు, ఎంసీడీఓలు, ఎంసీఓలు, ఏపీఓలు, ఏఈ, డీఈ, ఈఈ లు సర్పంచ్, నిర్మాణ ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకంలోని మేజర్, మైనర్ రిపేర్లు, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, ఎలక్ట్రిక్ పనులు ముందు పూర్తి చేసి తర్వాత ప్రహరీ, భోజన శాల, అదనపు తరగతి గదులు ఇతరత్రా పనులు చేయాలన్నారు. చేసిన పనులకు ఎప్పటికప్పుడు ఎంబిప్రుప్ లో రికార్డు చేసి తప్పనిసరి గా ఆన్​లైన్ లో అప్​లోడ్ చేయాలని చెప్పారు. ఈ మొత్తం పనులను నాలుగు రోజులకోసారి అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అలసత్వం పదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామాని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ గోపాల్ రావు, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ ఈఈ శ్రీనివాస్ రెడ్డి 
పాల్గొన్నారు.

టీఆర్​ఎస్​ సర్కారు హామీలు నెరవేర్చాలి 

మెదక్​ (రేగోడ్​), వెలుగు: ఆర్ఎస్ సర్కారు ప్రజలను మోసగించడం ఆపి వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ మంత్రి, బీజేపీ లీడర్​ బాబుమోహన్ డిమాండ్​ చేశారు. బుధవారం రేగోడ్​ మండలం గజవాడ, సిందోల్, టి.లింగంపల్లి, పోచారం, మర్పల్లి, రేగోడ్, కొండాపురం, జగిర్యాల, ఆర్.ఇటిక్యాల్  గ్రామాలలో ‘ప్రజా గోస.. బీజేపీ భరోసా’ యాత్ర చేపట్టారు. బైక్​ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, వారికి భరోసా కల్పించడం కోసమే ఈ యాత్ర చేపట్టామన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను టీఆర్​ఎస్​ నాయకులు తమవని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రేగోడ్​ మండలంలో తాను మంత్రిగా ఉన్నపుడు చేసిన అభివృద్ధి పనులు తప్ప ఆ తర్వాత జరిగిందేమీలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కార్యక్రమంలో రేగోడ్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు సతీశ్​గౌడ్, సీనియర్ నాయకులు మఠం చంద్రచేఖర్, తుల్జారాం పాల్గొన్నారు.


టీఎల్​ఎంతో బోధన ఈజీ 

మెదక్ (చిన్నశంకరంపేట), వెలుగు : టీఎల్ఎం (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్)తో బోధన ఈజీ అవుతుందని, విద్యార్థులకు కూడా విషయం సులభంగా అర్థం అవుతుందని డీఈఓ రమేశ్​కుమార్​ అన్నారు. బుధవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో మండల వనరుల కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీఎల్ఎం ప్రదర్శనను ఆయన తిలకించారు. మండలంలోని ప్రైమరీ, అప్పర్​ ప్రైమరీ స్కూల్​ టీచర్లు రూపొందించిన టీఎల్ఎంలను పరిశీలించారు. కాంప్లెక్స్ వారీగా ఉత్తమమైన టీఎల్​ఎంలను సెలెక్ట్​ చేసి ప్రథమ, ద్వితీయ  బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్ఎల్ఎన్ మండల నోడల్ ఆఫీసర్ విశ్వనాథం, ఎఫ్ఎల్ఎన్ క్లస్టర్ మోడల్ ఆఫీసర్లు యాదగిరి, జగన్, టీచర్​లు నర్సింగరావు, శ్రీనివాస్ రెడ్డి, శివ ప్రసాద్, సత్యనారాయణ, సీఆర్పీలు సందీప్, ఆంజనేయులు, సత్యనారాయణ, ప్రతాప్ పాల్గొన్నారు.


రాష్ట్రస్థాయి జాతీయ బాలల 

మెదక్, వెలుగు:  జాతీయ స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ కు మెదక్ జిల్లా నుంచి ఆరు ప్రాజెక్టులు ఎంపికైనట్లు డీఈఓ రమేశ్​కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 30వ జిల్లా స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనలో జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 95 మంది విద్యార్థులు పాల్గొనగా.. అందులో ఆరు ప్రాజెక్టులను రాష్ట్రస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ కు ఎంపిక చేసినట్లు చెప్పారు. డిసెంబర్ 10న రంగారెడ్డి జిల్లాలోని నాట్కో హైస్కూల్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో వీరు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా కోఆర్డినేటర్ రాజిరెడ్డి, ఎంఈఓ నీలకంఠం, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ అకాడమిక్ కోఆర్డినేటర్ ప్రభు, హెచ్​ఎం రేఖ, జడ్జిలు దినకర్, విశ్వనాథ్, గైడ్ టీచర్లు పాల్గొన్నారు.

వీడని యువకుడి మిస్సింగ్ మిస్టరీ

మెదక్​ (చిన్నశంకరంపేట), వెలుగు: చిన్నశంకరంపేట మండలం కొరివిపల్లి తండాకు చెందిన బానోత్ సురేశ్​ (19) మిస్సింగ్ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. చందంపేట గ్రామానికి చెందిన అనుమానితుడు ఇంటి నుంచి పరారైన యువకుడి ఆచూకీ రెండు రోజులు గడుస్తున్నా దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టగా జాగిలం అనుమానితుడి ఇంటి నుంచి చెరువు కట్ట వద్దకు వెళ్లి ఆగింది. తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి, రామాయంపేట సీఐ చంద్రశేఖర్​ ఆధ్వర్యంలో, గ్రామస్తుల సహకారంతో చెరువులో గాలించినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో పోలీసులు బృందాలుగా విడిపోయి, గ్రామం చుట్టుపక్కల, అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా రెండు రోజులు కావస్తున్నా  యువకుడి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు బుధవారం చిన్న శంకరంపేట పోలీస్ స్టేషన్ ముందు రాస్తారోకో నిర్వహించారు.  యువకుడి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే 9490617018, 9490617053 ఫోన్​ నంబర్​ లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
 

శానిటరీ కప్పులను ఉపయోగించాలి

సిద్దిపేట రూరల్, వెలుగు: మహిళలు శానిటరీ కప్పులను ఉపయోగించాలని సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. నారాయణరావుపేట మండలంలో పర్యావరణహితమైన శానిటరీ కప్పుల వినియోగంపై ఏడు రోజులపాటు నిర్వహించే అవగాహన కార్యక్రమాలను బుధవారం కోదండరావుపల్లి, బంజరుపల్లి గ్రామాలలో కార్యక్రమ ప్రత్యేక అధికారి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సరోజ, జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా మంత్రి హరీశ్ రావు ప్రత్యేక శ్రద్ధతో శానిటరీ ప్యాడ్స్ కు బదులుగా మెనుస్ర్టుయల్ కప్ లను అందజేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే జిల్లాలో ప్రత్యేకంగా రుతుప్రేమ కార్యక్రమాన్ని
చేపట్టారన్నారు. 

బలవంతపు భూసేకరణ ఆపాలి

కొండాపూర్, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో రీజినల్ రింగ్ రోడ్డుకు బలవంతపు భూసేకరణ వెంటనే ఆపాలని సీసీఎం జిల్లా కార్యదర్శి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ట్రిపుల్ఆర్  లో భూములు పోతున్న రైతులు బుధవారం గిర్మపూర్ వద్ద హైవేపై చేసిన ఆందోళనకు సీపీఎం, ప్రజాసంఘాల నాయకులు  మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ ట్రిపుల్ఆర్ లో భూమి కోల్పోతున్న రైతులకు సమాచారం ఇవ్వకుండా  సర్వే చేయడమేంటని ప్రశ్నించారు. చట్ట ప్రకారం రైతులతో గ్రామసభ నిర్వహించి, రైతుల అభిప్రాయం మేరకే సర్వే, భూసేకరణ చేయాలన్నారు. ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అరెస్టు చేసి బుదేరా పోలీస్ స్టేషన్ కు తరలించారు. పలువురు  సీపీఎం, ప్రజా సంఘాల లీడర్లు పాల్గొన్నారు. 
 

రైతు సమస్యలపై కాంగ్రెస్​ లీడర్ల ఆందోళన 

రైతు రుణ మాఫీ, ధరణి పోర్టల్ రద్దు, పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు. దీక్షలు చేపట్టారు. ఆర్డీవో ఆఫీసుల ఎదుట ధర్నాలు చేశారు. జహీరాబాద్​లో గీతారెడ్డి, హుస్నాబాద్​లో పొన్నం ప్రభాకర్,  నారాయణఖేడ్​లో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ సురేశ్ ​షెట్కార్, మెదక్​లో తిరుపతిరెడ్డి, గజ్వేల్​లో జస్వంత్​రెడ్డి, పటాన్​చెరులో అనిల్​కుమార్, కాట సుధారాణి, సిద్దిపేటలో  శ్రీనివాస్ గౌడ్, దరిపల్లి చంద్రంతో పాటు పలువురు నాయకులు మాట్లాడారు. రుణమాఫీ అమలు కాకపోవడంతో  రైతులు బ్యాంకుల చుట్టు చెప్పులరిగేలా తిరుగుతున్నారని, కొత్త అప్పు పుట్టక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు  చేసుకుంటున్నారన్నారు. రైతులకు ఎలాంటి ఉపయోగం లేని ధరణి పోర్టల్ ను వెంటనే రద్దు చేసి పాత విధానం కొనసాగించాలని డిమాండ్​ చేశారు. పార్ట్​బి, పోడు భూముల సమస్యలు పరిష్కరించి అర్హులైన రైతులకు వెంటనే పట్టాలివ్వాలన్నారు. ‌‌‌‌ - వెలుగు, నెట్​వర్క్​