ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

రైతుల బీమా డబ్బులు త్వరగా చెల్లించాలి

కంది, వెలుగు :  రైతుబీమా డబ్బులు బాధిత కుటుంబాలకు త్వరగా చెల్లించేలా చూడాలని సంగారెడ్డి కలెక్టర్ ​డాక్టర్​శరత్ సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం క్యాంపు ఆఫీసులో ఆయన అగ్రికల్చర్​ ఆఫీసర్లతో యాసంగి యాక్షన్ ప్లాన్, రైతు బీమా క్లయిమ్స్, పంట రుణాలు, రైతు శిక్షణలు తదితర అంశాలపై 
సమీక్షించారు. ఎరువులు,  విత్తనాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని, యాసంగి పంట రుణాలు రైతులకు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు సంబంధించిన ఆయా పథకాల ప్రగతిని జిల్లా, మండల ఏఈఓలు కార్యాలయాల్లో, రైతు వేదికలలో ప్రదర్శించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ జేడి నరసింహారావు, సునీత, ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు. అక్రమాలను సహించేది లేదు 
భూములను ఎవరైనా తప్పుడు ధ్రువపత్రాలతో ఇతరుల పేరిట పట్టా మార్పిడికి పాల్పడితే సహించేదిలేదని కలెక్టర్ డాక్టర్ శరత్ హెచ్చరించారు.

సంగారెడ్డి  జిల్లాలో ఇటీవల రాయికోడ్ మండలం నాగ్సాన్​పల్లికి చెందిన పట్లోళ్ల శివమ్మ అనే మహిళ పేరిట సర్వే నంబర్ 198 లోని 27 ఎకరాల34గుంటల  భూమిని అప్పటి తహసీల్దార్ తప్పుడు ధ్రువపత్రాలతో ఇతరుల పేరిట పట్టా మార్పిడి చేశారని తెలిపారు.  బాధితురాలు సెప్టెంబర్ 21న తమ దృష్టికి తీసుకురావడంతో విచారణ చేశామని చెప్పారు. సంబంధితురాలి భూమి పౌతి నిబంధనలకు విరుద్ధంగా మార్పు చేసినట్లు రుజువైందన్నారు. పూర్తి నివేదిక మేరకు ప్రభుత్వం శివమ్మ భూమిని ఆమె పేరిట చేయడానికి ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ మేరకు శివమ్మకు సోమవారం కొత్త పట్టా పాస్​బుక్ ను అందజేశారు. 

చర్చి ఎదుట నిరసన 

మెదక్‌‌ టౌన్​, వెలుగు: సీఎస్ఐ మెదక్​చర్చి కమిటీ ఆఫీస్ ​బేరర్స్ ​ఎంపిక వివాదాస్పదంగా మారింది. సీఎస్‌‌ఐ నిబంధనలకు విరుద్ధంగా  కమిటీ ఎన్నిక జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కొత్తగా ఎన్నికైనా కమిటీ సభ్యుడు గంట సంపత్‌‌ తన మద్దతు దారులతో సోమవారం చర్చి ముందు నిరసన తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చర్చి కమిటీలోని 18 పోస్టులకు  45 మంది పోటీ పడగా తన ప్యానల్‌‌ నుంచి 11 మంది ఎన్నికయ్యారని తెలిపారు. ప్రత్యర్థి ప్యానల్‌‌ నుంచి ఏడుగురు మాత్రమే ఎంపికయ్యారన్నారు. నిబంధనల ప్రకారం ఎక్కువమంది ఎన్నికైన ఫ్యానెల్‌‌ ను నామినేట్‌‌ చేయాల్సి ఉంటుందన్నారు. కానీ  అందుకు విరుద్ధంగా బిషప్‌‌ తక్కువ సభ్యులు ఎన్నికైన ప్యానెల్‌‌ కు మద్దతు పలుకుతుండటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని చెన్నైలోని సీఎస్​ఐ ఉన్నతాధికారుల దృష్టికి  తీసుకెళ్తామని ఆయన తెలిపారు. ఆయన వెంట  ప్రభుదాస్, ప్రభాకర్, రాజశేఖర్, దినకర్, కిరణ్, రాంచందర్ ఉన్నారు.

‘ప్రజావాణి’లో విద్యార్థుల నిరసన

సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట జిల్లా సంగాపూర్ లోని ఆర్ అండ్ ఆర్ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని ముంపు గ్రామాల స్టూడెంట్స్ వారి తల్లిదండ్రులతో కలసి సోమవారం ఐడీఓసీ మీటింగ్ హాల్ లో జరిగిన ప్రజావాణిలో నిరసన తెలిపారు. తమ స్కూల్ లో క్లాస్ రూమ్​లు సరిగ్గా లేవని, బాత్​రూమ్​లు లేవని, మధ్యాహ్న భోజనం పెట్టడంలేదని, తాగునీటికి తిప్పలు తప్పట్లేదని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్కూల్​లో కనీస వసతులు కల్పించాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు ప్రజావాణిలో అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాస్​ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. దీనికి అడిషనల్ కలెక్టర్ స్పందిస్తూ స్టూడెంట్స్ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకుపోతామని, వారం రోజుల్లో పాఠశాలను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా భూ సంబంధిత, డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లు, ఆసరా పెన్షన్లు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 67 వినతులు వచ్చాయి. వాటిని సంబంధిత అధికారులకు పంపించి సత్వరమే పరిష్కారం చేయాలని అడిషనల్​ కలెక్టర్​ ఆదేశించారు. 
 

బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి


మెదక్​ టౌన్​, వెలుగు :  పోలీస్​స్టేషన్లకు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని మెదక్​ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం మెదక్​లోని ఎస్పీ ఆఫీసులో పోలీస్​ ప్రజావాణి నిర్వహించి స్వయంగా బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసానిచ్చారు. 

800 క్వింటాళ్ల  రేషన్ బియ్యం పట్టివేత


మునిపల్లి, వెలుగు : మూడు లారీలు, ఒక డీసీఎంలలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా  తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న  సంగారెడ్డి జిల్లా మునిపల్లి రెవెన్యూ,   సివిల్ సప్లై, అధికారులు  సోమవారం  సాయంత్రం మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులో  తనిఖీలు చేపట్టారు. దీంతో నాలుగు వాహనాల్లో హైదరాబాద్ నుంచి కర్నాటకకు తరలిస్తున్న 800క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రేషన్ బియ్యాన్ని సదాశివపేటలోని  సివిల్ సప్లై గోదాంలో భద్రపరిచినట్టు ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్,  సివిల్ సప్లై అధికారులు సురేశ్, మల్లికార్జున్ తెలిపారు.

ఐదు ప్రమాదాలు.. ముగ్గురు మృతి 


నర్సాపూర్/శివ్వంపేట్, వెలుగు : ఆటో ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మెదక్​ జిల్లా నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి శివారులో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం..  బ్రాహ్మణపల్లి పంచాయతీ గుభై తండాకు చెందిన బిచ్చ నాయక్(35) పొలం వద్ద పశువులను కట్టేసి రోడ్డు పక్కన కూర్చున్నాడు. తిరుమలాపూర్ నుంచి బ్రాహ్మణపల్లి వస్తున్న ఆటో అతడిని బలంగా ఢీ కొట్టింది. వెంటనే అతడిని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఆటో డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి రూప్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గంగరాజు తెలిపారు.

కోతుల అడ్డం రావడంతో..


కోతులు అడ్డం రావడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడి  ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కుల చాకరిమెట్ల వద్ద జరిగింది. ఎస్సై రవి కాంతారావు తెలిపిన ప్రకారం..  రత్నాపూర్ గ్రామానికి చెంది సత్తయ్య(70) నర్సాపూర్​ నుంచి ప్యాసింజర్​ ఆటోలో గ్రామానికి వెళ్తుండగా చాకరి మెట్ల వద్ద కోతులు ఒక్కసారిగా రోడ్డు పైకి వచ్చాయి. దీంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. సత్తయ్య అక్కడికక్కడే మృతి చనిపోయాడు. డ్రైవర్ తో సహా ఐదుగురికి గాయాలు కావడంతో వారిని వెంటనే స్థానికులు నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. 

పిల్లలను హాస్టల్​లో చేర్పించేందుకు వెళ్తుండగా.. 

మెదక్​ జిల్లా నర్సాపూర్​ మండలం రెడ్డిపల్లి గ్రామ శివారులో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడి ఐదుగురికి గాయాలయ్యాయి. అందోల్ మండలం సాయిబాన్ పేట గ్రామానికి చెందిన సురేశ్ ​పిల్లలను హాస్టల్​లో చేర్పించడానికి తన సొంత ఆటోలో మెదక్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో రెడ్డిపల్లి వద్ద ఆటో అదపుతప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ సురేశ్​తోపాటు అతడి భార్య స్వప్న, కూతుర్లు సిరి, శ్రావ్య, మహమ్మదనగర్ గెట్ తండా టీచర్ విజయకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


అడవి పంది అడ్డు వచ్చి.. 


అడవి పంది అడ్డం రావడంతో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నర్సాపూర్–తూప్రాన్ రోడ్డుపై జరిగింది. శివ్వంపేట మండలం గోమారంకు చెందిన శివాజీ నర్సాపూర్ వెళ్తుండగా ఒక్కసారిగా అడవి పంది వచ్చి స్కూటీకి తగిలింది. దీంతో కిందపడి అతడి కాలు విరిగిపోయింది. వెంటనే అతడిని స్థానికులు నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ఆర్టీసీ బస్సు, బైక్​ ఢీకొని ఒకరు.. 


కోహెడ(హుస్నాబాద్​), వెలుగు : ఆర్టీసీ బస్సు,  బైక్​ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్ల వద్ద జరిగింది. ఎస్సై శ్రీధర్, స్థానికులు తెలిపిన ప్రకారం.. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ మండలం పెద్ద పాపయ్యపల్లి గ్రామానికి చెందిన ముప్పు అశోక్​(37), అతడి తండ్రి వీరస్వామితో కలిసి బైక్​పై అక్కన్నపేట మండలం రేకొండకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో హుస్నాబాద్​మండలం పందిల్ల వద్ద బైక్, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో అశోక్​అక్కడికక్కడే చనిపోయాడు. వీరస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని స్థానికులు వెంటనే హుస్నాబాద్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై 
తెలిపారు.

చేగుంట జోనల్​ స్పోర్ట్స్​ ప్రారంభం

మెదక్​ (చేగుంట), వెలుగు : చేగుంటలోని ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ లో సిక్స్త్ జోన్ క్రీడా పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పోటీలను ప్రారంభించారు. అథ్లెటిక్స్,  కబడ్డీ, వాలీబాల్, రగ్బీ, ఖోఖో, హ్యాండ్ బాల్ , ఆర్చరీ, టెన్నికాయిట్,  బాల్ బ్యాడ్మింటన్,  క్యారం, చెస్  పోటీలు నిర్వహిస్తున్నారు. కాగా, మెదక్, నర్సాపూర్, ఎల్లారెడ్డి, ఇందల్వాయి, అసిఫాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్, తిర్యాని, బైంసా, ఇంద్రవెల్లి, బొగ్గారం, జైనూరు,సిర్పూర్ నుంచి 555 మంది క్రీడాకారిణిలు పాల్గొన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ ఏకలవ్య, గురుకులాల ఇన్​చార్జి రమేశ్, ఆర్సీఓ సంపత్ కుమార్, క్రీడల ఇన్​చార్జి సుజాత కుమార్, ప్రిన్సిపాల్ మమత, పీడీలు స్వప్నప్రియ, వనిత ఉన్నారు. 

మెదక్ లో పీఎం కిసాన్​సమృద్ధి కేంద్రం ప్రారంభం  

మెదక్, వెలుగు: రైతులకు పంటల సాగుకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఒకే చోట అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసి పీఎం కిసాన్​ సమృద్ధి కేంద్రాన్ని మెదక్ పట్టణంలో మార్కెట్ కమిటీ చైర్మన్​ బట్టి జగపతి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడంతోపాటు, భూసార పరీక్షలు, పంటలసాగుకు సంబంధించిన సలహాలు, సూచనలు అందించేందుకు ఈ కేంద్రాన్నిఏర్పాటు చేసినట్టు చెప్పారు.  వ్యవసాయ ప్రాధాన్యత ఉన్న మెదక్ జిల్లా రైతులకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.  ఈ కేంద్రం ద్వారా అందే సేవలను పారదీప్​ ఫాస్పెట్​ కంపెనీ జనరల్​ మేనేజర్​ కౌశిక్​, చీఫ్​ మేనేజర్​ ప్రసన్న వివరించారు. అనంతరం ఆదర్శ రైతులను సన్మానించారు. కార్యక్రమంలో అగ్రికల్చర్​ ఏడీ విజయ నిర్మల, ఏఓ శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్​, డీలర్​ రాములు, పీఎం కిసాన్​ సమృద్ధి కేంద్రం నిర్వహకులు బూర్ల రామకృష్ణ, ఏఎంసీ డైరెక్టర్​ శంకర్, ఏడుపాయల డైరెక్టర్​ చక్రపాణి, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.