ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • 37 పోస్టులకు.. ఉన్నది ఇద్దరే!
  • మెదక్ డైట్ కాలేజీలో లెక్చరర్ల కొరత
  • టీచర్ల డిప్యూటేషన్, గెస్ట్​ లెక్చరర్లతో క్లాసులు

మెదక్, వెలుగు :  విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. టీచర్ ​ట్రైనింగ్​ ఇచ్చే డైట్​ కాలేజీలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన జిల్లా విద్యా, ఉపాధ్యాయ శిక్షణా సంస్థ (డైట్) కాలేజీ హవేలీఘనపూర్​లో ఉంది. ఇక్కడ  లెక్చరర్ల కొరత తీవ్రంగా ఉంది. మొత్తం 37 పోస్టులకుగాను  ప్రిన్సిపాల్ తో పాటు కేవలం రెగ్యులర్ లెక్చరర్ ఒక్కరు మాత్రమే ఉన్నారు. కాలేజీలో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియం ఉండగా, ఫస్ట్​ ఇయర్​లో ఒక్కో మీడియంలో 50 చొప్పున 150 మంది స్టూడెంట్స్, సెకండ్​ ఇయర్​లో 50 చొప్పున 150 మంది స్టూడెంట్స్ ​ఉంటారు. డీఎడ్ స్టూడెంట్స్​కు ఫస్ట్​ ఇయర్​లో 1‌‌0 సబ్జెక్టులు, సెకండ్ ఇయర్​లో 10 సబ్జెక్ట్​లు ఉంటాయి. మొత్తంగా మూడు మీడియంలలో కలిపి మొత్తం 60 సబ్జెక్ట్​లు ఉంటాయి. ఆయా సబ్జెక్ట్​ లు బోధించేందుకుగాను 30 మంది లెక్చరర్లు అవసరం. లెక్చరర్ల కొరత  నేపథ్యంలో జిల్లాలోని వివిధ స్కూళ్లలో పనిచేసే ఏడుగురు టీచర్లను డిప్యూటేషన్​పై తీసుకుని వారితో డీఎడ్​ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే సబ్జెక్ట్​లకు అనుగుణంగా సరిపడినంత మంది రెగ్యులర్​ లెక్చరర్లు లేకపోవడంతో ఉన్న కొద్ది మందిపైనే భారం  పడి.. బోధనలో క్వాలిటీ దెబ్బతింటోంది.

7 పోస్టులకు.. అన్నీ ఖాళీ..

డైట్​కాలేజీలోనే డిప్లొమా ఇన్​ ప్రీ స్కూల్​ఎడ్యుకేషన్​ కోర్సు కూడా ఉంది. ఇందులో ఫస్ట్​ ఇయర్ లో ​50 సెకండ్ ఇయర్​లో 50 సీట్లు ఉన్నాయి. ఫస్ట్​ ఇయర్​8 సబ్జెక్ట్​లు, సెకండ్​ ఇయర్​8 సబ్జెక్ట్​లు ఉంటాయి. ఆయా సబ్జెక్ట్​లు బోధించేందుకు ఏడుగురు లెక్చరర్లు అవసరం ఉండగా, ఆ పోస్టులన్నీ ఖాళీగానే  ఉన్నాయి. డిప్యూటేషన్​ తీసుకున్న టీచర్లతోనే వారికి తరగతులు బోధిస్తున్నారు. ప్రీస్కూల్​ఎడ్యుకేషన్​లో ముఖ్యంగా వర్క్​ ఎడ్యుకేషన్​, ఆర్ట్​ఎడ్యుకేషన్, ఫిజికల్​ఎడ్యుకేషన్​ లెక్చరర్లు లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. 
 

పట్టించుకోని ప్రభుత్వం

డైట్​కాలేజీలకు అవసరమైన లెక్చరర్​ పోస్టులను టీఎస్​పీఎస్​సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం దీనికి గురించి అసలే పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా డైట్​ లెక్చరర్​ పోస్టులు భర్తీ చేయకపోవడంతో డిప్యూటేషన్​లతో సరిపెడుతున్నారు.  డైట్ లో 30 పోస్టు లకు 28 ఖాళీలు ఉండగా,  డిప్లొమా ఇన్ ప్రీ ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ లో ఏడు పోస్ట్ లకు గాను అన్నీ ఖాళీగానే ఉన్నాయి. దీంతో  కొందరు టీచర్లను డిప్యుటీషన్ మీద తీసుకొని డీఏడ్ స్టూడెంట్స్ కు పాఠాలు బోధిస్తున్నారు. రెగ్యులర్ లెక్చరర్లు లేక బోధనకు ఇబ్బంది కలుగుతుంది. ఉన్న కొద్ది మందిపై భారంపడి క్వాలిటీ దెబ్బ తింటోంది. 

గెస్ట్​ లెక్చరర్లను తీసుకుంటున్నాం

డైట్​ కాలేజీలో లెక్చరర్ల కొరత ఉంది. రెగ్యులర్​ లెక్చరర్​ పోస్టులు ఖాళీగా ఉండటంతో టీచర్లను డిప్యూటేషన్​ మీద తీసుకుని పాఠాలు బోధిస్తున్నాం. మరికొందరు గెస్ట్​ లెక్చరర్లను తీసుకుంటున్నాం.
-రమేశ్​బాబు, డైట్​ప్రిన్సిపాల్​

ఇన్ టైంలో వర్క్స్​ కంప్లీట్​ చేయాలి

నారాయణ్ ఖేడ్, వెలుగు : నారాయణఖేడ్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో చేపడుతున్న పనులను ఇన్​టైంలో కంప్లీట్​ చేసేలా చూడాలని సంగారెడ్డి కలెక్టర్​ డాక్టర్ శరత్ ఆదేశించారు. గురువారం పట్టణంలోని వివిధ శాఖల అధికారులతో ఎంపీడీవో ఆఫీస్ లో ఆయన రివ్యూ నిర్వహించారు. అవెన్యూ ప్లాంటేషన్, గ్రామాల్లో వెల్​కం బోర్డులు, బార్డర్ బోర్డులు తప్పకుండా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డంప్ యార్డ్, క్రిమిటోరియం ఉపయోగం, పర్యవేక్షణలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు.  క్రీడా ప్రాంగణాలను త్వరగా అందుబాటులోకి తేవాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

సరిహద్దు పోలీసులు సహకరించుకోవాలి

జహీరాబాద్, వెలుగు : నేరాల అదుపు  కోసం కర్నాటక, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న పోలీసులు పరస్పరం సహకరించుకోవాలని కల్బుర్గి ఎస్పీ  ఇషా పంత్ సూచించారు. గురువారం కర్నాటకలోని  గుల్బర్గా జిల్లా చించోలి లో నిర్వహించిన సరిహద్దు పోలీసుల సమావేశంలో ఆమె మాట్లాడారు.  అక్రమ రవాణా, మిస్సింగ్ కేసులు, గుర్తుతెలియని శవాలు, నాన్ బెయిలబుల్ వారెంట్లు లాంటి కేసులలో ఇరు రాష్ట్రాల సరిహద్దు పోలీసులు ఒకరికొకరు సహకరించుకొని నేరాల అదుపునకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో జహీరాబాద్ డీఎస్పీ వి.రఘు, చించోలి డీఎస్పీ బసవరాజు, తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్, జహీరాబాద్ సీఐ తోట భూపతి, తాండూర్, చించోలి, నారాయణ్ పేట్, కొడంగల్, సీఐలు, కర్నాటక, తెలంగాణ బార్డర్ పోలీస్ స్టేషన్ల ఎస్సై లు పాల్గొన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల  కృషి

మెదక్​ (శివ్వంపేట), వెలుగు:  పోలీస్​ అమర వీరుల దినోత్సవం సందర్భంగా గురువారం శివ్వంపేట మండల కేంద్రంలో వాలీబాల్ పోటీలను ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల జ్ఞాపకార్థం వారోత్సవాలు నిర్వహిన్నట్లు తెలిపారు.  అనంతరం క్రీడల్లో  గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి, సీఐ శ్రీధర్, స్థానిక ఎస్సై  రవికాంత్ రావు, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ పద్మా వెంకటశ్ పాల్గొన్నారు.

దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు: పార్టీలకతీతంగా దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రఘునందన్​రావు తెలిపారు. గురువారం తొగుట మండలం తుక్కాపూర్​ గ్రామంలో రూ. 10 లక్షల నిధులతో నిర్మిస్తున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్​పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం వెనుకబడి ఉందని, ఎమ్మెల్యే నిధులతో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి శక్తివంచన లేకుండా పని చేస్తున్నామన్నారు. అనంతరం అనారోగ్యంతో మరణించిన ఉల్లెంగెల మల్లవ్వ అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం అందజేశారు. ఆయా బాధిత కుటుంబాలను పరామర్శించారు. బోధకాలు నివారణకు వైద్య సిబ్బంది ఇస్తున్న ఫైలేరియా మాత్రలు వేసుకుని, ఇతరులకు వేశారు. ఆయన వెంట సర్పంచ్​ చిక్కుడు చంద్రం ముదిరాజ్, ఉప సర్పంచ్​ లింగాల శ్రీలత స్వామి, వార్డు సభ్యులు మురళి, బాల్​రాజు, గుడికందుల ఉప సర్పంచ్​ శ్రీకాంత్​ రెడ్డి, బీజేపీ సీనియర్​ నాయకులు లక్ష్మారెడ్డి, భిక్షపతి, నర్సింహారెడ్డి, నరేంద్ర, నరేశ్​ గౌడ్​ పాల్గొన్నారు. 

‘మన బడి’లో గజ్వేల్ ను అగ్రస్థానంలో నిలపాలి

సిద్దిపేట, వెలుగు : సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గాన్ని మన ఊరు మనబడి పథకంలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేలా పనిచేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులకు సూచించారు. ఈ మేరకు గురువారం  కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు.  ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద పిల్లల కు మెరుగైన విద్య ను అందించాలని చేపట్టిన పథకం పనులను వేగంగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు ‘మన బడి’ పనులను రోజువారీగా పర్యవేక్షించాలన్నారు. మరుగుదొడ్లు, వంటగది, భోజనశాల పూర్తి అయిన తర్వాతనే అదనపు తరగతి గదులు, ప్రహరీ, సంపు లాంటి ఇతరపనులు చేయాలని సూచించారు. కొన్ని పాఠశాలల్లో టెండర్ పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఈడబ్ల్యూఐడీసీ డీఈ పరిశీలించి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఈవో శ్రీనివాస్ రెడ్డి, టీడబ్ల్యూఐడీసీ ఈఈ శ్రీనివాస్ రెడ్డి,  కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. 

గ్రామకంఠం భూములకు పాస్​ బుక్కులు

తూప్రాన్, వెలుగు : రాష్ట్రంలోని గ్రామకంఠం భూములకు త్వరలోనే పట్టా పాస్ బుక్కు లు ఇచ్చేందుకు కార్యాచరణ జరుగుతోందని స్టేట్ పంచాయతీ రాజ్ కమిషనర్ హనుమంతరావు అన్నారు. మెదక్ జిల్లా యావపూర్ లో గురువారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. గ్రామ కంఠం భూముల విషయమై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్త్రం లోని సిద్దిపేట జిల్లా అంగడి కిష్టపూర్, మెదక్ జిల్లా లోని యావపూర్ ను పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ రెండు గ్రామాల్లో డ్రోన్ ల ద్వారా ఇప్పటికే గ్రామకంఠం భూముల సర్వే కంప్లీట్​ చేశామన్నారు. ఇక్కడ సక్సెస్​ అయితే రాష్ట్రమంతా అమలు చేస్తామని చెప్పారు. గ్రామస్తులకు వారం రోజులపాటు సమయం ఇస్తున్నామని, అభ్యంతరాలు ఉంటే పంచాయతీ సెక్రటరీకి అందించాలని సూచించారు. అనంతరం హనుమంతరావును సర్పంచ్ శేరి నర్సింహారెడ్డి సన్మానించారు. కార్యక్రమం లో కలెక్టర్ హరీశ్, అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్, రాష్ట్ర పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రావు, డీపీవో తరుణ్ కుమార్, ఇన్​చార్జి ఎంపీడీవో రమేశ్​ ఉన్నారు. 

ఆటోలో నుంచి పడి విద్యార్థి మృతి

గజ్వేల్, వెలుగు:  ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి కిందపడి ఓ విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన వర్గల్​ మండలం వేలూరులో గురువారం జరిగింది. గౌరారం ఎస్సై సంపత్​ కుమార్​ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన దాదారం నాగరాజు కుమారుడు జశ్వంత్ (5) మండలంలోని బొర్రగూడెం ప్రైమరీ స్కూల్​లో 5వ తరగతి చదువుతున్నాడు. రోజు లాగే గురువారం ఉదయం ఆటోలో స్కూల్​ కు బయలుదేరాడు. అనంతగిరిపల్లి శివారులో ప్రమాదవశాత్తు జశ్వంత్​ఆటోలో నుంచి కిందపడిపోయాడు. గాయపడిన బాలుడిని స్థానికులు తూప్రాన్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​కు తరలించారు. అప్పటికే జశ్వంత్ చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.  

బాధితులకు భరోసా కల్పిస్తున్నాం

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ భరోసా సెంటర్ ద్వారా లైంగిక దాడులకు గురైన బాధితులకు అండగా నిలబడుతున్నట్టు సీపీ ఎన్.శ్వేత చెప్పారు. గురువారం సిద్దిపేట భరోసా సెంటర్ లో సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పోక్సో, అత్యాచార కేసుల్లో బాధితులకు త్వరగా  పరిహారం ఇప్పించడానికి వివిధ డిపార్ట్​​మెంట్ అధికారులు కృషి చేయాలన్నారు. భరోసా సెంటర్ సేవల కోసం బాధితులు డయల్ 100, సిద్దిపేట జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 8333998699 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. 

ఏర్పాట్ల పరిశీలన..

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీపీ ఆఫీస్ ఎదురుగా ఉన్న  పరేడ్ గ్రౌండ్ లో కొత్తగా నిర్మించిన  పోలీస్ అమరవీరుల స్థూపాన్ని సీపీ పరిశీలించారు. శుక్రవారం జరిగే స్మృతి పరేడ్ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు.