ఉరి శిక్షకూ సిద్ధం..రెజ్లింగ్‌ను మాత్రం నిలిపివేయ‌కండి : బ్రిజ్ భూష‌ణ్ సింగ్

ఉరి శిక్షకూ సిద్ధం..రెజ్లింగ్‌ను మాత్రం నిలిపివేయ‌కండి : బ్రిజ్ భూష‌ణ్ సింగ్

లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు (డబ్ల్యూఎఫ్ఐ) బ్రిజ్ భూష‌ణ్ సింగ్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల‌తో నాలుగు నెల‌లుగా క్రీడ‌లు నిలిచిపోయాయ‌ని, త‌న‌ను ఉరి తీసినా అందుకు తాను సిద్ధమేన‌ని, అయితే.. రెజ్లింగ్ కార్యక‌లాపాల‌ను మాత్రం నిలిపివేయ‌వ‌ద్దని కోరారు.

వినేష్ ఫోగాట్‌, సాక్షి మాలిక్‌, బ‌జ‌రంగ్ పునియా స‌హా ప‌లువురు ప్రముఖ రెజ్లరు ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌నలు చేస్తున్న విషయం తెలిసిందే. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూష‌ణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాల‌ని, ఫెడ‌రేష‌న్ నుంచి తొల‌గించాల‌ని రెజ్లర్లు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. మ‌హిళా రెజ్లర్లను డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ లైంగిక వేధింపుల‌కు గురిచేస్తున్నాడ‌ని ఆరోపిస్తూ రెజ్లర్లు చేప‌ట్టిన నిర‌స‌న‌లో ప‌లువురు రెజ్లర్లు పాల్గొంటుండ‌టంతో చాంపియ‌న్‌షిప్‌లు, క్యాంపులు స‌హా రెజ్లింగ్ కార్యక‌లాపాల‌న్నీ నిలిచిపోయాయి.

బ్రిజ్ భూష‌ణ్ సింగ్‌పై లైంగిక ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్‌లు దాఖ‌ల‌య్యాయి. రెజ్లింగ్ కార్యక‌లాపాలు నిలిపివేయ‌డం క్యాడెట్లు, జూనియ‌ర్ రెజ్లర్ల అభివృద్ధికి విఘాత‌మ‌ని, వారి భ‌విష్యత్‌కు ఆటంకం క‌లిగించ‌వ‌ద్దని బ్రిజ్ భూషణ్ సింగ్ కోరారు. తాను 1000 మందిపై లైంగిక వేధింపుల‌కు పాల్పడ్డాన‌ని ఆరోపిస్తున్నార‌ని, అస‌లు ఇంత‌మందిపై వేధింపుల‌కు పాల్పడేందుకు తానేమైనా శిలాజాల‌తో చేసిన రోటీల‌ను తింటున్నానా..? అని ఆయ‌న చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఒక ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడొచ్చా అంటూ మహిళా రెజ్లర్‌ సత్యవార్ట్ కదియాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.