సుయెల్లాకు పదవి కట్టబెట్టడంతో రిషిపై విమర్శలు

సుయెల్లాకు పదవి కట్టబెట్టడంతో రిషిపై విమర్శలు

లండన్: బ్రిటన్ కొత్త ప్రధాని, మన దేశ మూలాలున్న రిషి సునక్  బుధవారం తన కేబినెట్ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రతీ బుధవారం మధ్యాహ్నం ‘హౌస్​ ఆఫ్​ కామన్స్’లో జరిగే ప్రైం మినిస్టర్స్ క్వశ్చన్(పీఎంక్యూ) లో సునక్​ పాల్గొన్నారు. అరగంట పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఎంపీలు అడిగే ప్రశ్నలకు ప్రధాని జవాబిస్తారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక మంత్రి నదిమ్ జహావీ.. మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రిషి నాయకత్వంలో పార్టీ కలిసికట్టుగా ఉందని తెలిపారు. ప్రధాని సునక్​ తన కేబినెట్ లో జెరెమీ హంట్ తో పాటు సుయెల్లా బ్రావర్మన్​కు చోటిచ్చారు. జేమ్స్ క్లెవర్లీని విదేశాంగ సెక్రటరీగా నియమించారు. జెరెమీని ఆర్థిక మంత్రిగా నియమించగా.. సుయెల్లాకు మళ్లీ హోంశాఖ బాధ్యతలు ఇచ్చారు. సయెల్లా కూడా బ్రెగ్జిట్​కు మద్దతు పలికారు. 

సుయెల్లా నియామకంపై విమర్శలు

భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రావర్మన్ ను మళ్లీ హోంమంత్రిగాగా నియమించాలన్న నిర్ణయంపై పార్టీలకు అతీతంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. ‘తమ ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తుందని, ప్రతి స్థాయిలోనూ జవాబుదారీగా ఉంటుందని ప్రధాని రిషి సునక్ తన ప్రచారంలో హామీ ఇచ్చారు. కానీ మినిస్టీరియల్స్ నియమాలను ఉల్లంఘిస్తూ సుయెల్లా బ్రావర్మన్ ను ఆయన హోంమంత్రిగా నియమించారు” అని ఎంపీ క్యారోలిన్ లూకాస్ ట్వీట్ చేశారు. ప్రజా జీవితంలో అత్యంత అవినీతి, క్రూరమైన వ్యక్తుల్లో ఒకరిని హోం సెక్రటరీగా నియమించారని యూనివర్సిటీ ఆఫ్ ఎస్సెక్స్​లో ప్రొఫెసర్ స్టీవ్ పీర్స్ ట్వీట్ చేశారు. ప్రభుత్వంలో భాగంగా ఉంటూ కీలక సమాచారాన్ని లీక్ చేసి, పదవిని వదులుకున్న వ్యక్తిని మళ్లీ అదే పదవిలో నియమించారని 
ప్రొఫెసర్​ స్టీవ్ విమర్శించారు.