- జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పును సమర్థించిన ఎస్సీడీఆర్ సీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: బిస్కెట్ తయారీ సంస్థ బ్రిటానియాకు, డీమార్ట్‌కు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎస్సీడీఆర్సీ) షాక్ ఇచ్చింది. బిస్కెట్‌లో ప్లాస్టిక్ ముక్క ఉన్నట్లు తేలడంతో బాధితురాలికి పరిహారం చెల్లించాల్సిందేనని గతంలో జిల్లా వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సమర్థించింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన అడ్వకేట్ పి.సంధ్య 2019 ఫిబ్రవరి 5న సనత్ నగర్ లోని డీ-మార్ట్ లో బ్రిటానియా హై-ఫైబర్ డైజెస్టివ్ బిస్కెట్ ప్యాకెట్లను కొన్నారు. అదే నెల 23న తన బిడ్డకు బిస్కెట్ తినిపిస్తుండగా అందులో ప్లాస్టిక్ ముక్క ఉన్నట్లు గుర్తించారు.
దీనిపై కంపెనీ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయగా.. వారి స్పందన సంతృప్తికరంగా లేకపోవడంతో జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. బాధితురాలు సమర్పించిన బిస్కెట్ నమూనాను పరీక్షించిన స్టేట్ ఫుడ్ అనలిస్ట్, అందులో ప్లాస్టిక్ ముక్క ఉన్నట్లు ధ్రువీకరించారు. బ్రిటానియా కంపెనీ, డీ-మార్ట్ సంయుక్తంగా బాధితురాలికి రూ.25 వేల పరిహారం చెల్లించాలని 2022 మే 20న జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పునిచ్చింది.
ఈ తీర్పును సవాలు చేస్తూ బ్రిటానియా సంస్థ ఎస్సీడీఆర్సీకి అప్పీల్ చేసింది. అయితే, జస్టిస్ డాక్టర్ జి.రాధారాణి, మీనా రామనాథన్ లతో కూడిన బెంచ్ బ్రిటానియా సంస్థ వాదనలను తోసిపుచ్చింది. నాణ్యతాలోపం స్పష్టంగా ఉందంటూ ఈ నెల 25న అప్పీల్‌ను కొట్టివేసింది. పెద్ద కంపెనీల ఉత్పత్తులు ఎప్పుడూ సురక్షితంగా ఉంటాయని భావించలేమని, వినియోగదారుల పట్ల బాధ్యతగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ కేసులో బాధితురాలిని మానసిక వేదనకు గురిచేసినందుకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
