
ఇండోర్: విమెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో తమ తొలి మ్యాచ్‌లో 69 రన్స్‌కే ఆలౌటై ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా వెంటనే పుంజుకుంది. ఓపెనర్ తంజిమ్ బ్రిట్స్ (89 బాల్స్‌లో 15 ఫోర్లు, 1 సిక్స్‌తో 101) సెంచరీతో విజృంభించడంతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సఫారీ టీమ్ ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి ఖాతా తెరిచింది. ఏకపక్ష పోరులో తొలుత కివీస్ అమ్మాయిలు 47.5 ఓవర్లలో 231 రన్స్‌కే ఆలౌటయ్యారు.
కెప్టెన్ సోఫీ డివైన్ (85), బ్రూక్ హలీడే (45), ప్లిమ్మర్ (31) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. సఫారీ బౌలర్లలో నంకులులెకో మలాబ నాలుగు వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్రిట్స్ సెంచరీకి తోడు సూనె లూస్ (81 నాటౌట్) మెరుపులతో సౌతాఫ్రికా 40.5 ఓవర్లలోనే 232/4 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. బ్రిట్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.