యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ మార్గంలో విరిగిపడ్డ బండరాళ్లు

యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ మార్గంలో విరిగిపడ్డ బండరాళ్లు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట పశ్చిమవైపున ఉన్న గిరి ప్రదక్షిణ మార్గంలో సోమవారం తెల్లవారుజామున బండరాళ్లు విరిగిపడ్డాయి. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా యాదగిరిగుట్ట చుట్టూ రెండున్నర కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ మార్గాన్ని ఏర్పాటు చేశారు. గుట్టకు పశ్చిమం వైపున గిరి ప్రదక్షిణ దారి నిర్మాణం కోసం కొండను తొలిచి మెట్లు కట్టారు. అయితే భక్తుల నుంచి భిన్నాభిప్రాయాలు రావడంతో మెట్ల మార్గాన్ని అలాగే ఉంచి.. దిగువన బీటీ రోడ్డుకు ఆనుకుని మరో మార్గాన్ని ఏర్పాటు చేశారు. 

కాగా, గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి మెట్ల మార్గానికి ఆనుకుని ఉన్న ప్లేస్‌‌‌‌లో మట్టి కొట్టుకుపోయి బండరాళ్లు కిందపడ్డాయి. తెల్లవారుజామున ఘటన జరగడం, భక్తులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. విషయం తెలుసుకున్న ఆలయ ఆఫీసర్లు స్థానిక మున్సిపల్ సిబ్బంది సహకారంతో బండరాళ్లను తొలగించారు.