పత్తి విత్తనాలు బ్లాక్‌‌‌‌: మార్కెట్​లో డిమాండ్​ ఉన్న రకాలకు కృత్రిమ కొరత

పత్తి విత్తనాలు బ్లాక్‌‌‌‌: మార్కెట్​లో డిమాండ్​ ఉన్న రకాలకు కృత్రిమ కొరత
  • ఒక్కో ప్యాకెట్​పై రూ.2వేలకు పైగా ధర పెంచి విక్రయం
  • బిల్లులు, రసీదులు ఇవ్వకుండా వ్యాపారుల మోసం
  • ఇదే అదనుగా ముంచెత్తుతున్న నకిలీ విత్తనాలు

జయశంకర్‌‌ భూపాలపల్లి/ఆదిలాబాద్, వెలుగు : ఖరీఫ్‌‌ సీజన్‌‌ ప్రారంభంలోనే పత్తి విత్తనాలను దళారులు బ్లాక్‌‌ చేశారు.  రైతుల నుంచి డిమాండ్‌‌ ఉన్న తులసి, సంకేత్‌‌, రేవంత్, యూఎస్ అగ్రిసీడ్​‌‌7067 పత్తి విత్తనాలు బహిరంగ మార్కెట్‌‌లో దొరకట్లేదు. పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పించామంటూ రూ.853 ఎమ్మార్పీ కలిగిన ఒక ప్యాకెట్​ను రూ.2వేల నుంచి రూ.2800 పైగా ధర పెంచి బ్లాక్​లో అమ్ముతున్నారు. బిల్స్‌‌, రశీదులు కూడా ఇవ్వడం లేదు. రాష్ట్రంలో పత్తి విత్తనాల పేరిట రూ.వెయ్యి కోట్లకు పైగా బ్లాక్‌‌ మార్కెట్‌‌ జరుగుతోంది. ఇందులో ఫర్టిలైజర్‌ షాపుల ఓనర్లు, సీడ్‌‌ కంపెనీల డీలర్లదే కీ రోల్. ఇదే అదనుగా నకిలీ విత్తనాలు మార్కెట్‌‌లోకి వస్తున్నాయి.

బడా కంపెనీల పేరుతో వీటిని రైతులకు విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. నెలరోజుల కిందట తనిఖీల పేరిట ఎంతో హడావుడి చేసిన అగ్రికల్చర్, పోలీసు ఆఫీసర్లు ఇప్పుడు సప్పుడు చేయట్లేదు. అధికారులు.. వ్యాపారులతో కుమ్మక్కై రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నా బ్లాక్​మార్కెట్​వైపు కన్నెత్తి చూడడం లేదు. 

మార్కెట్‌‌లో దొరకని సంకేత్‌‌, యూఎస్‌‌ ప్యాకెట్లు... 

రాష్ట్రంలో రైతులు ప్రతీయేటా ఖరీఫ్‌‌ సీజన్‌‌లో సుమారు 58 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 7 లక్షలు, నాగర్‌‌ కర్నూల్‌‌, ఆదిలాబాద్‌‌, సంగారెడ్డి జిల్లాల్లో 4 లక్షల ఎకరాల్లో  పత్తి సాగవుతోంది. వీటితో పాటు మరో పది జిల్లాల్లో 2 నుంచి 3 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తున్నారు. తొలకరి కురిసిన వెంటనే పత్తి విత్తనాలు నాటడానికి రైతులు రెడీగా ఉన్నారు. ఇప్పటికే దుక్కి  దున్ని భూమిని సిద్ధం చేసుకున్నారు. మృగశిర కార్తె ప్రవేశించాక నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడంతో రైతులు పత్తి విత్తనాలు కొనడానికి వెళ్తున్నారు. దీంతో రైతుల నుంచి డిమాండ్‌‌ ఉన్న సంకేత్‌‌, యూఎస్‌‌ 7067 సీడ్​ను వ్యాపారులు బ్లాక్‌‌  చేశారు. ప్యాకెట్‌‌ పై రూ.853 చొప్పున ఎమ్మార్పీ ఉంటే రూ.2వేలకు పైగా ధర పెంచి రూ.2800 వరకు అమ్ముతున్నారు.

సీడ్‌‌ కంపెనీలు మన రాష్ట్రానికి కేటాయించిన విత్తన ప్యాకెట్లను సైతం కంపెనీ డీలర్లు, ఫర్టిలైజర్‌‌ షాపుల ఓనర్లు బ్లాక్​లోనే అమ్ముతున్నారు. ఈ విత్తనాలకు ఉన్న డిమాండ్​ను దృష్టిలో పెట్టుకొని కొందరు దళారులు మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్ ​రాష్ట్రాలలో సులువుగా లభ్యమవుతున్న ఈ విత్తనాలను కొని తీసుకొచ్చి రైతులకు బ్లాక్‌‌ రేట్లపై అమ్ముతున్నారు. 

బిల్స్‌‌, రశీదులు ఇవ్వట్లే‌.... 

రైతులు బ్లాక్​లో కొంటున్న పత్తి విత్తన ప్యాకెట్లకు బిల్స్‌‌ గానీ, రశీదులు గానీ ఇవ్వట్లేదు. ఇష్టం ఉంటే కొనండి.. లేకపోతే పొండి అని రైతులను దబాయిస్తున్నారు. దీంతో విత్తనాలు దొరకవేమో అనే ఉద్దేశంతో రైతులు కొంటున్నారు. ఈ విత్తనాలు నాటిన తర్వాత భవిష్యత్​లో పత్తి మొక్కలు పెరగకపోయినా.. పూత ఎక్కువగా రాలినా.. కాయలు రాలిపోవడం వంటి సమస్యలుంటే రశీదులను చూపించి క్షేత్రస్థాయి పరిశీలనలో కంపెనీ ఫాల్ట్ అని‌‌ తేలితే రైతులకు నష్ట పరిహారం అందుతుంది. అది కూడా విత్తనాలు కొన్న బిల్స్‌‌ లేదా రశీదులు ఉంటేనే కంపెనీలు నష్టపరిహారం చెల్లిస్తాయి. బ్లాక్​లో కొనే విత్తన ప్యాకెట్లతో రైతులు నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది. 

నెలరోజుల కింద ఆఫీసర్ల హడావుడి 

నెలరోజుల కింద అగ్రికల్చర్, పోలీస్ ​ఆఫీసర్లు సీడ్స్, ఫర్టిలైజర్స్ ​షాపుల్లో, గోదాముల్లో తనిఖీల పేరిట హడావుడి చేశారు. స్టాక్ట్, సేల్స్​ రికార్డులను పరిశీలించారు. నకిలీ విత్తనాలు విక్రయించకూడదని, ఎమ్మార్పీకి మించి అమ్మవద్దని హెచ్చరించారు. తీరా ఖరీఫ్‌‌ సీజన్​ స్టార్టయిన తర్వాత ఆఫీసర్లు షాపుల ముఖం చూడట్లేదు. ఇదే అదనుగా బ్లాక్‌‌ మార్కెట్‌‌ పురివిప్పింది. నకిలీ విత్తనాలు కూడా మార్కెట్‌‌లోకి వచ్చాయని రైతులు చెబుతున్నారు. బీటీ‒2 విత్తన కంపెనీల పేరుతోటే వీటిని అమ్ముతున్నట్లు చెబుతున్నారు. ఈ దందాలో అగ్రికల్చర్, పోలీస్ అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు అందాయని ఆరోపణలున్నాయి. ఒక్కో షాపు నుంచి రూ.20వేల నుంచి రూ.50వేల దాకా వసూలు చేసినట్టు తెలుస్తోంది. అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​లోని క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు వాటాలు పంచుకున్నట్టు సమాచారం. 

విత్తనాల కోసం గంటల తరబడి లైన్లలోనే 

విత్తనాల కోసం ఎక్కడ చూసినా రైతులు లైన్లు కట్టే కనిపిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి విత్తనాల షాపుల ముందు క్యూ కడితే గాని  దొరకని పరిస్థితి నెలకొంది. అంతసేపు క్యూలో నిలుచున్నా రెండు లేదా మూడు బ్యాగులు మాత్రమే దొరుకతున్నాయి.  

మహారాష్ట్ర రైతులకు మన విత్తనాలు..

మహారాష్ట్ర రైతులకు ఇక్కడి వ్యాపారులు డిమాండ్ ఉన్న విత్తనాలను అధిక ధరలకు అమ్ముకుంటున్నారని తెలుస్తోంది. పాండ్రకవడ, బోరి, కిన్వాట్ తో పాటు ఆదిలాబాద్ సరిహద్దున ఉన్న మహారాష్ట్ర గ్రామాల రైతులు ఆదిలాబాద్ కు వచ్చి ఈ విత్తనాలు కొనుక్కుపోతున్నారు. రూ.853 కు దొరికే డిమాండ్ ఉన్న రకం పత్తి విత్తనాలు మహారాష్ట్ర రైతులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు తెలుస్తోంది. జిల్లాకు కేటాయించిన విత్తన ప్యాకెట్లు ఇక్కడి రైతులకే అమ్మాలని నిబంధనలు ఉన్నా అలా జరగడం లేదు. దీంతో మన రైతులకు తక్కువ ప్యాకెట్లు దొరుకుతున్నాయి.  

 దోచుకుంటున్నరు  

రైతుల అవసరాన్ని డీలర్లు, వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నరు. సంకేత్, యూఎస్ కంపెనీలతో పాటు మరికొన్ని రకాల పత్తి విత్తనాలను బ్లాక్ చేసి ఎక్కువ ధరలకు అమ్ముతున్నరు. ఒక్కో ప్యాకెట్ కు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ధరలు పెంచి దోచుకుంటున్నరు. వ్యవసాయ శాఖ ఆఫీసర్లు స్పందించాలి. బ్లాక్‌‌ మార్కెట్‌‌ను నియంత్రించి, నకిలీ విత్తనాలను అరికట్టాలి. 
‒ చెన్నమల్ల స్వామి, జూకల్ రైతు, చిట్యాల మండలం, భూపాలపల్లి జిల్లా 

ఎక్కువ రేటుకు అమ్ముతున్నరు 

వ్యాపారులు కుమ్మక్కై పత్తి విత్తనాలను బ్లాక్ లో అమ్ముతున్నరు. నిరుడు దిగుబడి అధికంగా ఉన్న పత్తి విత్తనాలు కొందామని షాపుకు పోతే లేవంటున్నరు. బ్లాక్ లో రూ.2వేల నుంచి రూ.2500 రేటు చెప్తున్నరు. పైసలు ఎక్కువైనా కొందామంటే మాలాంటి రైతులకు అమ్ముతలేరు. ఏజెంట్ల ద్వారా తమ అనుకున్నవారికే అమ్ముతున్నరు. దొరికిన గింజలనే పెట్టేందుకు రెడీగా ఉన్నాం.  
‒ గూటం మాధవరెడ్డి, రేగొండ రైతు, భూపాలపల్లి జిల్లా

ఐదు గంటలు నిల్చున్న..

పత్తి విత్తనాల కోసం ఉదయం 10 గంటలకు నేను నా కొడుకు లైన్​లో నిలుచుంటే నాలుగు ప్యాకెట్లు ఇచ్చిండ్రు. నేను పది ఎకరాల్లో పత్తి పంట వేస్తా. పది ప్యాకెట్లు డిమాండ్ ఉన్న రకం విత్తనాలు ఇస్తేనే ఆశించిన దిగుబడి వస్తుంది. కానీ ఇక్కడ మాకు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు అమ్ముతున్నారు. అందుకే మాకు దొరకడం లేదు.  
- గంగన్న, రుయ్యాడి, ఆదిలాబాద్​