గొర్రెల పంపిణీ స్కీమ్​లో బ్రోకర్ల దందా!

గొర్రెల పంపిణీ స్కీమ్​లో బ్రోకర్ల దందా!
  • ఇటీవల వెలుగులోకి రూ.2 కోట్ల అక్రమాలు
  • గచ్చిబౌలి పీఎస్‌లో నలుగురిపై  కేసు నమోదు
  • పశుసంవర్ధక శాఖలో తీగలాగితే కదులుతున్న డొంక
  • మాజీ మంత్రి తలసాని ఓఎస్డీపైనా అనుమానాలు!

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : గత ప్రభుత్వ హయాం నాటి గొర్రెల పంపిణీ పథకంలో బ్రోకర్ల దందాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పశుసంవర్థక శాఖలో తీగ లాగితే డొంక కదులుతున్నది. తాజాగా రూ.2 కోట్ల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు గచ్చిబౌలి పోలీస్​ స్టేషన్​లో నలుగురిపై కేసు నమోదైంది. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ ​యాదవ్ ​ఓఎస్డీపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.  గత బీఆర్ఎస్​ సర్కారు గొల్ల, కురుమలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. లబ్ధిదారుల నుంచి కొంత అమౌంట్​కట్టించుకొని మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే భరించి గొర్రెల యూనిట్లను పంపిణీ చేసింది. కాగా ఈ స్కీమ్​లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దళారుల ప్రమేయం ఉండొద్దని గొర్రెల కొనుగోళ్ల కోసం జిల్లాకు ఇద్దరు చొప్పున ఇతర శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. వెటర్నరీ అధికారులకు కేవలం గొర్రెల హెల్త్‌‌‌‌ను చూసే పనే అప్పగించారు. వాస్తవానికి వీరు వేరే ప్రాంతానికి వెళ్లి ఆరోగ్యంగా ఉన్న గొర్రెల యూనిట్లను ఎంపిక చేసి, సంబంధిత రైతుల అకౌంట్​వివరాలు తీసుకొని రావాలి. కానీ కొందరు అధికారులు దళారులతో కలిసి బినామీ అకౌంట్లు క్రియేట్​చేసి ప్రభుత్వ సొమ్మును తమ బినామీల ఖాతాల్లోకి మళ్లించారు.

మోసం బయటపడింది ఇలా..

గత సర్కారు హయాంలో గొర్రెల పంపిణీ పథకం సెకండ్‌‌‌‌ ఫేజ్‌‌‌‌లో  అధికారులు, కాంట్రాక్టర్ తో కుమ్మక్కై గొర్రెల పెంపకందార్లకు రూ.2 కోట్లు మోసం చేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. పశుసంవర్థక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్న రవికుమార్, కేశవ్‌‌‌‌ సాయి గతేడాది ఆగస్టు13  నుంచి -23 వరకు ఏపీలోని పలు జిల్లాల్లో రైతుల వద్ద గొర్రెలు పరిశీలించారు.18 మంది రైతుల నుంచి 133 యూనిట్లు(2793 ) గుర్తించి సేకరించారు. సంబంధిత రైతుల ఆధార్‌‌‌‌ కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబర్లను సేకరించిన ఆఫీసర్లు వారి వివరాలను ఆన్ లైన్ లో అప్​లోడ్ చేసి వారికి నేరుగా బ్యాంకు అకౌంట్‌‌‌‌లలోకి  డబ్బులు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ చేయాల్సి ఉంది. ఆంధ్రా రైతులు గొర్రెలు అమ్మి నెలలు గడుస్తున్నా, పైసలు అందకపోవడంతో డౌట్‌‌‌‌ వచ్చి ఇటీవల హైదరాబాద్​వచ్చారు. పశుసంవర్థక శాఖ జేడీ ఆఫీసులో విచారించగా అప్పటికే డబ్బులు చెల్లింపులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. దీంతో దాదాపు రూ.2 కోట్ల10 లక్షల14 వేలు తప్పుడు ఖాతాల్లోకి దారిమళ్లినట్లు గుర్తించారు. తమకు రావాల్సిన డబ్బులు దారి మళ్లించారని ఆరోపిస్తూ  గత డిసెంబర్ 26న కాంట్రాక్టర్‌‌‌‌ ఆఫీసు పరిధిలోని గచ్చిబౌలి పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేశారు. ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు ఇద్దరు కాంట్రాక్టర్లతో పాటు ఏడీలు రవికుమార్, కేశవ్‌‌‌‌ సాయిపై ఐపీసీ సెక్షన్‌‌‌‌ 406, 409, 420 కింద కేసులు నమోదయ్యాయి.

అందుకే ఫైళ్లు మాయమా ?

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌‌‌‌ యాదవ్‌‌‌‌ వద్ద ఓఎస్‌‌‌‌డీగా పని చేసిన ఓ అధికారి మాసబ్​ట్యాంకులోని పశుసంవర్థక శాఖ ఆఫీసులో ఉన్న ఫైళ్లు చించేసి, పేపర్ ముక్కలను సంచుల్లో మూట కట్టి తన కారులో తీసుకెళ్లడం గత నెలలో సంచలనం సృష్టించింది. తలసాని ఓఎస్డీగా పనిచేసిన కల్యాణ్‌‌‌‌ పదవీ కాలం ముగిసినా ఆఫీసుకు వచ్చి ఫైల్స్ ని తీసుకెళ్లడం పలు అనుమానాలకు దారి తీసింది. సర్కారు మారిన 4 రోజులకు కల్యాణ్‌‌‌‌ నిర్వాకం వివాదాస్పదమైంది. డిపార్ట్ మెంట్ ఫైల్స్ తీసుకెళ్లొద్దని సీఎస్  ఆదేశాలున్నా, కొందరు సిబ్బంది సహకారంతో కల్యాణ్ ​ఓల్డ్ ఫైల్స్ చించేశారని వివాదం చెలరేగింది. శాఖలోని అక్రమ వ్యవహారాలు బయట పడతాయనే ఫైల్స్ మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా గొర్రెల పంపిణీ స్కీమ్​లో రూ.2 కోట్ల అక్రమాలు బయటపడిన నేపథ్యంలో.. పశుసంవర్థక శాఖలో ఫైల్స్​ చినిగిపోవడంపై గొర్లకాపరుల సంఘం ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేస్తే మరిన్ని అక్రమాలు బయటపడతాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.