జనగామ జిల్లాలో ఇందిరమ్మ ప్లాట్ల దందా

జనగామ జిల్లాలో ఇందిరమ్మ ప్లాట్ల దందా
  • దర్జాగా అమ్ముకుంటున్న దళారులు 
  • తప్పుడు డాక్యుమెంట్లతో దందా
  • లబో దిబోమంటున్న బాధితులు

జనగామ, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లపై దళారుల కన్ను పడింది. రియల్​ఎస్టేట్ ​బ్రోకర్ల కాసుల కక్కుర్తికి అమాయకులు ఆగమవుతున్నారు. కాంగ్రెస్​ సర్కారు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను మార్చేసి దర్జాగా విక్రయిస్తున్నారు. తప్పుడు పత్రాలతో సాగుతున్న అక్రమ దందాపై ఇప్పటికే కేసులు కూడా నమోదయ్యాయి. అయినా అక్రమార్కుల తీరు మారడంలేదు. పట్టించుకోవాల్సిన ఆఫీసర్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.

బాణాపురంలో ప్లాట్ల దందా

జనగామ శివారు బాణాపురంలో కాంగ్రెస్ ​ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇచ్చిన ప్లాట్లను యథేచ్చగా అమ్మేస్తున్నారు. రెవెన్యూ ఆఫీస్ లోని సిబ్బంది సాయంతో ఖాళీ ఇండ్ల స్థలాలు ఎవరి పేరుమీద ఉన్నాయనే సమాచారం తెలుసుకుని, వాటిని దళారులు లేదా ఇతరులు కొన్నట్లు కొంత మంది నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, విక్రయిస్తున్నారు. 2005 నుంచి 2014 వరకు అప్పటి కాంగ్రెస్ సర్కారు 2,843 ఇండ్లు మంజూరు చేయగా, 2,103 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలినవి ఆగి పోయాయి. దీనికి తోడు అప్పటి రచ్చబండ కార్యక్రమాల్లోనూ పలువురికి ఇండ్ల పట్టాలు అందించారు. ఇలా ఖాళీగా ఉన్న ప్లాట్లపై దళారులు కన్నేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

కేసులంటే కేర్​లేదు..

మూడు నెలల క్రితం కళ్లెం బైపాస్ లో డబుల్ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. అప్పటి ఏసీపీ కొత్త దేవేందర్ రెడ్డి నిందితులపై ఎంక్వైరీ చేశారు. ఆ సమయంలో కొంత వెనక్కి తగ్గిన అక్రమార్కులు ఇప్పుడు మళ్లీ రెచ్చిపోతున్నారు. జిల్లా కేంద్రంలోని కుర్మవాడకు చెందిన కనికరం రాజు అనే వ్యక్తికి కొందరు వ్యక్తులు అక్రమంగా ఇటీవల ప్లాట్ ను విక్రయించారు. గాదరి వజ్రమ్మ అనే పేరుపై లేని ప్లాట్ ను ఉన్నట్లుగా డాక్యుమెంట్లను సృష్టించి పట్టూరి శ్రీనివాస్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి విక్రయించాడు. 

సాక్షులుగా ఆకుల రేణుక, కౌన్సిలర్ దేవరాయి నాగరాజును పేర్కొంటూ రిజిస్ట్రేషన్ చేయించారు. కొనుగోలు చేసిన రాజు ఇటీవల ప్లాటును చదును చేసేందుకు వెళ్లగా, పట్టాదారుడు వచ్చి అడ్డు చెప్పడంతో అసలు విషయం బయట పడింది. బాధితుడు తహసీల్దార్ ఆఫీస్ కు వెళ్లి ఎంక్వైరీ చేసుకోగా, వజ్రమ్మ పేరిట ప్లాట్ లేదని తెలుసుకుని మోసపోయినట్లు గ్రహించి పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. మోసం చేసిన వారిపై కేసు చేశారు. కాగా, పలువురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మాత్రం బాణాపురంలో వందకు పైగా ప్లాట్లు ఇదే తరహాలో విక్రయించారని స్థానికులు చెబుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సదరు ఇందిరమ్మ ఇండ్లు, స్థలాల వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోరుతున్నారు.