ఎనుగల్​లో విషాదం.. చెల్లి పెళ్లి చేయలేక అన్న ఆత్మహత్య

ఎనుగల్​లో విషాదం.. చెల్లి పెళ్లి చేయలేక అన్న ఆత్మహత్య

చందుర్తి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెల్లెలు పెళ్లి చేసేందుకు డబ్బు లేక అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చందుర్తి మండలం ఎనుగల్ గ్రామానికి చెందిన గసికంటి శంకరయ్య, సత్తవ్వకు కొడుకు ప్రమోద్(25), కూతురు ఉన్నారు. ప్రమోద్​ఉపాధి కోసం మూడేండ్ల కింద గల్ఫ్​వెళ్లాడు. అక్కడి పరిస్థితులను తట్టుకుని పని చేయలేక, చేసిన పనికి జీతం ఇవ్వకపోవడంతో ఏడాది తర్వాత స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి గ్రామంలో కూలి పనులకు వెళ్తున్నాడు.

 ఆదివారం రాత్రి గ్రామంలో పత్తి లోడు ఎత్తి ఇంటికి వచ్చాడు. తల్లి సత్యవతితో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున సత్తవ్వ లేచి చూసేసరికి ప్రమోద్​ఇంట్లో దూలానికి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఆమె ఒక్కసారిగా బోరున విలపించడంతో చుట్టుపక్కల వారు వచ్చి ప్రమోద్ ను కిందకు దించారు. అప్పటికే అతను చనిపోయి ఉన్నాడు. 

‘నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకనే చనిపోతున్నాను. చెల్లిని బాగా చూసుకోవాలి.’ అని సూసైడ్​నోట్ రాసిపెట్టాడు. తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు. ప్రమోద్​చెల్లెలు బీటెక్​పూర్తిచేసి, హైదరాబాద్​లో ప్రైవేట్​జాబ్​చేస్తోంది. ఆమెకు పెళ్లి చేసేందుకు సరిపడా డబ్బు లేదని కొన్నిరోజులుగా ప్రమోద్ బాధపడుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.