
భీమదేవరపల్లి, వెలుగు: అన్నదమ్ములు కలిసి మూడేండ్లుగా 9 మండలాల్లో 53 చోరీలు చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మూలమలుపు వద్ద పోలీసులు వెహికల్స్తనిఖీ చేస్తుండగా, అనుమానస్పదంగా కనిపించడంతో వారిని ఎస్సై సాయిబాబా అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాల చిట్టా బయటపడింది. సోమవారం పోలీస్ స్టేషన్లో కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలానికి చెందిన బండి కుమారస్వామి, సతీశ్ అన్నదమ్ములు.
వీరిద్దరు కలిసి భీమదేవరపల్లి, వేలేరు, ధర్మసాగర్, చిల్పూరు, అక్కన్నపేట, హుజురాబాద్, శంకరపట్నం, ఎల్కతుర్తి మండలాల్లోని పంట పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి కాపర్ వైర్, కరెంట్ మోటార్లను ఎత్తుకెళ్లేవారు. కాపర్ వైర్ ను భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన స్క్రాప్ వ్యాపారి రుద్రాక్ష తిరుపతికి అమ్మారు. వారి నుంచి 250 కిలోల కాపర్ వైర్, కరెంట్ మోటార్, బైక్ స్వాధీనం చేసుకొని అన్నదమ్ములతో పాటు స్ర్కాప్ వ్యాపారిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు.