కాంగ్రెస్ అసంతృప్తులకు బీఆర్ఎస్, బీజేపీ గాలం

కాంగ్రెస్ అసంతృప్తులకు బీఆర్ఎస్, బీజేపీ గాలం
  • టికెట్లు దక్కని నేతలతో సంప్రదింపులు.. రంగంలోకి దిగిన సీనియర్లు
  • టికెట్ ఇస్తామని బీజేపీ.. అవకాశాలిస్తామని బీఆర్ఎస్​ హామీలు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అసంతృప్త నేతలపై బీఆర్ఎస్, బీజేపీ ఫోకస్​పెంచాయి. కాంగ్రెస్‌‌‌‌లో టికెట్లు దక్కని నేతలను చేర్చుకోవడానికి పోటీ పడుతున్నాయి. తమ పార్టీలోకి వస్తే టికెట్ ఇచ్చి ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పిస్తామని బీజేపీ నేతలు చెప్తుంటే.. రాజకీయంగా సరైన అవకాశాలిస్తామని బీఆర్ఎస్​నేతలు గాలం వేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పటికే ఖరారు కావడంతో ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్​చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్లు, ఇతర పదవులు ఇస్తామని హామీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ రాలేదన్న ఆగ్రహంతో ఉన్న కొందరు నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చే ఆఫర్లకు ఆమోదం తెలుపుతున్నారు. కాంగ్రెస్ అసంతృప్త నేతలు ఆదివారం నుంచి బీఆర్ఎస్, బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే డజను మందికిపైగా కాంగ్రెస్​లీడర్లు గులాబీ కండువా కప్పుకున్నారు. కొందరు లీడర్లు బీజేపీలో చేరారు. మిగతా లీడర్లు కూడా వారి బాటలోనే నడిచేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.

బీజేపీ వైపు ఆశావహుల చూపు

కాంగ్రెస్ రెండు విడతల్లో కలిపి మొత్తం వంద సీట్లను ఖరారు చేయడంతో.. టికెట్ రాని చాలా మంది ఆశావహులు బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ నుంచి బరిలో నిలిచేందుకు కమలం పెద్దలతో పలువురు కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే పార్టీకి సరైన అభ్యర్థులు లేనిచోట మాత్రమే టికెట్ హామీతో కాంగ్రెస్ నేతలను చేర్చుకోవాలనే ఆలోచనతో బీజేపీ లీడర్లు ఉన్నారు. బీజేపీ రెండు విడతల్లో కలిపి మొత్తం 53 సీట్లను ప్రకటించింది. ఇంకా 66 సీట్లను ప్రకటించాల్సి ఉంది. ఇందులో చాలా నియోజకవర్గాల్లో బీజేపీ తరపున పోటీకి ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. బీజేపీ బలంగా లేని నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ అసంతృప్తులను చేర్చుకొని టికెట్ ఇచ్చే విషయాన్ని నేతలు పరిశీలిస్తున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పుడు బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారు. మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ద్వారా బీజేపీలోకి వచ్చేందుకు విష్ణు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ టికెట్ కోసం ఇప్పటికే బీజేపీ నుంచి తీవ్రమైన పోటీ ఉంది. ఈ పరిస్థితుల్లో విష్ణుకు ఈ నియోజకవర్గం టికెట్ ను బీజేపీ ఇస్తుందా? అనే చర్చ సాగుతున్నది. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. అక్కడ బీజేపీకి బలమైన నాయకత్వం లేకపోవడంతో దీన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. టికెట్ పై హామీ ఇస్తే బీజేపీలో చేరేందుకు ఆయన రెడీగా ఉన్నారని తెలుస్తున్నది. బీజేపీ త్వరలో మూడో విడత జాబితా ప్రకటించడంపై దృష్టి పెట్టడంతో.. ఈ లిస్టులో కాంగ్రెస్ నుంచి టికెట్ రాని నేతలు ఎందరు ఉండనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

30 మంది నేతలను చేర్చుకునేలా బీఆర్ఎస్ ప్లాన్

బీఆర్ఎస్​లో టికెట్​దక్కని ఎమ్మెల్సీలు, పలువురు జిల్లా పరిషత్​చైర్మన్లు, ఇతర నేతలు కాంగ్రెస్‌‌‌‌లో చేరి టికెట్ దక్కించుకున్నారు. వారు వీడటంతో జరిగిన నష్టాన్ని కాంగ్రెస్ లీడర్లతో పూడ్చుకునే ప్రయత్నాలు గులాబీ పార్టీ చేస్తున్నది. కాంగ్రెస్‌‌‌‌పై అసంతృప్తితో ఉన్న నేతలను చేర్చుకునే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే పీసీసీ మాజీ చీఫ్​పొన్నాల లక్ష్మయ్య.. బీఆర్ఎస్​లో చేరారు. ఉప్పల్​నియోజకవర్గ నేతలు రాగిడి లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్​రెడ్డి, మెదక్, మేడ్చల్, గద్వాల​డీసీసీ అధ్యక్షులు సహా పలువురు గులాబీ కండువా కప్పుకున్నారు. ఇంకో 30 మంది వరకు కీలక నేతలను కారెక్కిచ్చే పనిలో పార్టీ సీనియర్​నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటించిన కొద్ది సేపటికే బీఆర్ఎస్​ముఖ్య నేతలు రంగంలోకి దిగి తమ పార్టీలోకి రావాలని అసంతృప్త నేతలను ఆహ్వానించారు. కొందరితో నేరుగా కేసీఆర్​మాట్లాడారు. మరికొందరితో మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు, ఎమ్మెల్సీ కవిత మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా స్థాయిలో ఆయా లీడర్లతో సన్నిహిత సంబంధాలున్న మంత్రులు, ఇతర ముఖ్య నేతలను రంగంలోకి దించి అసంతృప్త నేతలతో చర్చలు జరుపుతున్నారు. బీజేపీలో టికెట్​దక్కని ఆ పార్టీ నిర్మల్​జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, మానకొండూరు టికెట్​దక్కని బీజేపీ నేతలు దరువు ఎల్లన్న, నాగరాజు సైతం బీఆర్ఎస్​లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్​మూడో జాబితా కోసం ఎదురు చూస్తున్న నాయకులతోనూ బీఆర్ఎస్​ముఖ్య నేతలు టచ్​లో ఉన్నారు. టికెట్​రాకుంటే తమ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నారు.