కాంగ్రెస్ క్యాంప్​పై బీఆర్ఎస్ దాడి.. కొత్తూరులో ఉద్రిక్తత

కాంగ్రెస్ క్యాంప్​పై బీఆర్ఎస్ దాడి.. కొత్తూరులో ఉద్రిక్తత
  • జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు, కౌన్సిలర్ మల్లయ్య వర్గాల మధ్య వార్

కరీంనగర్, వెలుగు :  కరీంనగర్​ జిల్లా జమ్మికుంట మున్సిపల్ ​చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్​రావుపై పెట్టిన అవిశ్వాసం రోజుకో మలుపు తిరుగుతోంది.‌‌ ఆయనకు వ్యతిరేకంగా హైదరాబాద్ శివారు కొత్తూరు మండలంలోని ఓ రిసార్ట్​లో కౌన్సిలర్ పొన్నగంటి మల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంప్​పై బీఆర్ఎస్ నేతలు బుధవారం దాడి చేశారు. జమ్మికుంట మున్సిపాలిటీలోని 23వ వార్డు కౌన్సిలర్ మల్లయ్య.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్​లో చేరారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చైర్మన్ రాజేశ్వర్ రావుకు వ్యతిరేకంగా ‌‌ఆయన అవిశ్వాసానికి‌‌ సిద్ధమయ్యారు. తనకు మద్దతిస్తున్న 20 మంది కౌన్సిలర్లతో కలిసి డిసెంబర్ 29న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అవిశ్వాస నోటీసు ఇచ్చారు. అయితే, ఆ మరుసటి రోజే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్ రాజేశ్వర్ రావు వెళ్లి.. తమకు 22 మంది మద్దతు ఉందని, అవిశ్వాస నోటీసును రద్దు చేయాలని కోరారు. జమ్మికుంటలో మొత్తం 30 స్థానాలు ఉండగా.. మెజార్టీకి మించి మద్దతు ఉందని పైకి చెప్పినప్పటికీ, ఆ స్థాయిలో బలం లేకపోవడంతో మల్లయ్య క్యాంప్ నుంచి మరికొందరు కౌన్సిలర్లను లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మల్లయ్య క్యాంపు నుంచి ముగ్గురు కౌన్సిలర్లను రాజేశ్వరరావు తన‌‌వైపు తెచ్చుకోగలిగారు. ‌‌దీంతో ఆయన బలం 13కు చేరింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఓటుతో కలిపినా మరో ‌‌ఇద్దరు అవసరం కావడంతో మంగళవారం రాత్రి హైదరాబాద్​లోని కూకట్ పల్లిలో క్యాంపు నిర్వహిస్తున్న మల్లయ్య వర్గం వద్దకు రాజేశ్వరరావు  అనుచరులు వెళ్లి గొడవకు దిగారు. దీంతో మల్లయ్య వర్గం కౌన్సిలర్లు హైదరాబాద్ శివారులోని కొత్తూరు మండలం జేపీ తండాలోని రిసార్ట్​కు మకాం మార్చారు. విషయం తెలుసుకున్న రాజేశ్వరరావు వర్గీయులు బుధవారం అక్కడికి వెళ్లి దాడికి యత్నించారు. కౌన్సిలర్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్​కు మద్దతుగా కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్ అనుచరులతో రాగా.. మల్లయ్యకు మద్దతుగా మాజీ జెడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి రావడంతో ఘర్షణ జరిగింది.‌‌ ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి కూడా రావడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. కాగా, ఇప్పుడు ఏ వర్గంలో ఎంతమంది ఉన్నారనే దానిపై క్లారిటీ లేదు.

చైర్మన్ పై హత్యాయత్నం చేశారు :  కౌశిక్ రెడ్డి  

జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావుపై హత్యాయత్నం జరిగిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ‘‘తమను మల్లయ్య కిడ్నాప్ చేశారని మా కౌన్సిలర్లు ఫోన్ చేశారు. దీంతో రాజేశ్వరరావు అక్కడికి వెళ్లారు. కొత్తూరులో బుధవారం రాజేశ్వరరావు మీద మాజీ జెడ్పీటీసీ ‌‌శ్యామ్​సుందర్ రెడ్డి హత్యాయత్నం చేశారు. వారిపై ఫిర్యాదు చేశాం” అని చెప్పారు.