తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాత్ర ఎప్పుడూ వివాదాస్పదమే. తాజాగా కీలక సమయంలో ప్రధాన జలాల అంశంపై అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించడం కొత్త చర్చకు దారితీస్తోంది. తెలంగాణ అస్తిత్వం, నదీజలాలపై జరుగుతున్న కీలక చర్చను రాజకీయ కోణంలో చూడడం, చర్చ ఆరంభానికి ముందే.. కావాలని సెషన్స్ బాయ్‌కాట్ చేయడం తెలంగాణవాదులను ఆలోచింపచేస్తోంది.
ప్రభుత్వానికి ఎజెండా సెట్ చేశామని పార్టీలో అంతర్గత చర్చ ఉండవచ్చునేమోగాని బీఆర్ఎస్ నిర్ణయాన్ని అదే పార్టీ క్యాడర్ తప్పుబడుతున్నది. నదీ జలాల అంశం అనగానే కేసీఆర్ పారిపోయారనే అపవాదును బీఆర్ఎస్ మూటగట్టుకున్నది. రాష్ట్రం నీటి వాటాలు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఏపీ అక్రమవాడకంపై బీఆర్ఎస్ మాత్రమే గట్టిగా మాట్లాడగలగదని భావించారు. చాలారోజుల తర్వాత కేసీఆర్ ఫాంహౌస్ నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చి పాలమూరు-రంగారెడ్డి, కృష్ణా నదీజలాల అంశంపై మాట్లాడి ప్రభుత్వాన్ని అలర్ట్ చేయగలిగారు.
ఇప్పటివరకు ఓ లెక్క... రేపట్నుంచి మరో లెక్క అని నదీజలాల అంశాలపై తేడావస్తే తోలు తీస్తానన్న ప్రధాన ప్రతిపక్ష నేత వాలకం చూసి ఇకపై రాజకీయాలు రంజుగా ఉంటాయని పలువురు భావించారు. కానీ, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చకోసం సభకు హాజరుకాకపోగా ఏ కారణం లేకుండా సమావేశాలను బహిష్కరించారు. దీంతో అంతమాత్రానికి కేసీఆర్ గాండ్రింపు దేనికన్న నిట్టూర్పు ఆయన సొంతపార్టీ నుంచే వ్యక్తమైంది.
కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా కేసీఆర్ నైజాన్ని తప్పుపట్టి ఆయన సభకు రాకపోవడం చారిత్రాత్మక తప్పుగా అభివర్ణించడమేకాక, ఇక ఆ పార్టీని దేవుడు కూడా కాపాడలేరని చెప్పారు. అయితే, కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం బాధ్యతా రాహిత్యమా? లేక ఆయన రాజకీయ వ్యూహమా? ఏదేమైనా అంతకంతకూ సీఎం రేవంత్ వ్యూహాలు బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా కేసీఆర్ ఇమేజీని
దెబ్బతీస్తున్నాయి. అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ శాలరీ తీసుకుంటున్నాడనే విమర్శ జనాల్లోకి బలంగా వెళ్లిపోయింది. కేసీఆర్ అసెంబ్లీకిరాని బడి దొంగ అనే రాజకీయ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
నదీజలాలపై చర్చించని ప్రతిపక్షం
అసెంబ్లీకి రాకపోవడం ఇష్టంలేకపోవచ్చు, దాని వెనుక వ్యూహమూ ఉండొచ్చు. రేవంత్ సభలో నేనేం మాట్లాడాలనే ధోరణీ ఉండవచ్చుగాక.. కానీ, ప్రజల సమస్యలు చర్చించాల్సిన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు లేకపోతే, ఎవరు గెలుస్తారు? ప్రజలు మాత్రమే నష్టపోతారనే అంశాన్ని కేసీఆర్ మరిచిపోతున్నారు. తాజాగా సీఎం రేవంత్ పాలమూరు- రంగారెడ్డి, కృష్ణా, గోదావరి నదీ జలాలు, అన్యాయంపై మాట్లాడుతూ కేసీఆర్‌ను ఉరి తీసినా పాపం లేదన్నారు.
నదీ జలాల పేరిట కేసీఆర్ ఇంట్లో కనకవర్షం కురిసిందని, కాళేశ్వరం తరహాలో పాలమూరు-రంగారెడ్డి అంశంపై విచారణకు ఆదేశిస్తానని కూడా చెప్పుకొచ్చారు. రేవంత్ వ్యాఖ్యలు గులాబి శిబిరంలోనే కాదు ఉద్యమకారుల్లో, పరిశీలకుల్లో కూడా కొత్త చర్చకు దారితీస్తున్నాయి. నదీ జలాల అంశంలో కేసీఆర్ సర్కారుపై అనేక ఆరోపణలు, విమర్శలున్నా వాటిని చర్చించేందుకు కేసీఆర్ ఇష్టపడడం లేదంటే ఏదో తప్పు జరిగిందనే భావన బలపడుతోంది.
నీళ్ల దోపిడీపై మాట్లాడితే తప్పేంటి?
గత పదేండ్లు ఉద్యమ నేత చేతిలో రాష్ట్రం, పాలన ఉంది. పదేండ్ల ప్రగతి, నీటి వాటాలు చర్చించేందుకు అసెంబ్లీకొచ్చి అధికార పార్టీ కడిగి పారేసే అవకాశాన్ని కేసీఆర్ చేజేతులా జారవిడుచుకుంటున్నారు. తెలంగాణ బేసిన్ విస్తీర్ణం 68% ఉండటం వల్ల, తెలంగాణ 70% వాటాను డిమాండ్ చేస్తోంది.
2014లో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్‌ఎంబీ) ఏర్పాటైనా, నీటి వాటాలను తేల్చడంలో ఎవరు.. ఎందుకు విఫలమయ్యారో చెప్పే అవకాశాన్ని కేసీఆర్ కోల్పోతున్నారు. తెలంగాణ నీటిని తన పార్టీ విస్తరణ కోసం ఏపీకి ధారాదత్తం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పాలమూరు-–రంగారెడ్డి ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్‌వాటర్‌కు మార్చడం వల్ల ఖర్చు రూ. 32,000 కోట్ల నుంచి రూ.84,000 కోట్లకు పెరిగింది. ఏపీకి మళ్లించే అవకాశం కల్పించింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్ల కోసం ఏపీతో రాజీలు చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అబ్జెక్షన్లు లేవనెత్తుతూ, తమ ప్రాజెక్టులు మాత్రం కంటిన్యూ చేస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు బీఆర్‌ఎస్‌ను విమర్శిస్తూ కేసీఆర్ తప్పిదాలను నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది.
హోదా భారమా...ప్రజల నేరమా
కేసీఆర్‌ను అసెంబ్లీకి రప్పించాలని ఆయన అనుభవాలు అవసరమని సీఎం, స్పీకర్, డజను మంది మంత్రులు శతవిధాలా ప్రయత్నం చేశారు కూడా. కేసీఆర్ 2023 తర్వాత అసెంబ్లీలో చర్చలో లేరు. దీంతో ‘అసెంబ్లీకిరాని బడి దొంగ’ లాంటి విమర్శలకు దారితీసింది. 2025 మార్చిలో బడ్జెట్ సెషన్‌లో కూడా ఆయన రాలేదు. హరీష్ రావును పంపారు. డిసెంబర్ 29న వచ్చినా, సైన్ చేసి 10 నిమిషాల్లో
వెళ్లిపోయారు. డిబేట్‌లో పాల్గొనలేదు.
వాటర్ ప్రాజెక్టులపై డిబేట్ చేయమని సీఎం రేవంత్ రెడ్డి ఆయనను చాలెంజ్ చేశారు. కానీ, కేసీఆర్ ఈసారి సంతకం పెట్టి కేవలం మూడే నిమిషాలు హౌస్‌లో ఉండి వెళ్లిపోయారు. నదీ జలాలపై కీలకమైన టైంలో చర్చల్లో లేకపోవడంతోపాటు అధికారపక్షానికి అస్త్రమైనప్పుడు అధినేతకు ఆ హోదా అవసరమా? అనే చర్చ జరగడం కామన్. కానీ, కేసీఆర్ రావాల్సిన టైంలోనే వస్తారని బీఆర్ఎస్ శిబిరం ధీమాగా ప్రచారం చేసింది. అందులో వ్యూహం ఉండొచ్చనే చర్చ నిన్నటివరకు నడిచింది. కానీ, కీలక టైంలో కేసీఆర్ గైర్హాజరును తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతున్నది.
భ్రమలో బీఆర్ఎస్ నేతలు
సొంత సెగ్మెంట్ ప్రజలు నిరసన వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది. అవునన్నా కాదన్నా కేసీఆర్ ఒక ఉద్యమ నేత. తెలంగాణ రావడంలో ఆయనదే కీలకపాత్ర. అలాంటి నేతపై ఇన్ని ఆరోపణలు చేస్తే అధికార పార్టీ పలుచబడుతుందనే భ్రమలో బీఆర్ఎస్ నేతలుండడం వారి అవగాహనా రాహిత్యానికి నిదర్శనం.
ఇయ్యాల రాజకీయాల స్వరూపం మారిన నేపథ్యంలో సీఎం రేవంత్ వ్యూహత్మకంగా కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను వీక్ చేస్తున్నారని తెలుసుకోకపోవడం గమనార్హం. అయితే, సీఎం రేవంత్ తాజా విమర్శలపై కేసీఆర్‌కు ఈ రాజకీయాలవసరమా అనే చర్చ మొదలైంది. సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేయగానే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత స్పందిస్తూ ఇలాంటి మాటలు పడేకన్నా అసెంబ్లీకి రావొచ్చు కదా అన్న వ్యాఖ్యలు తెలంగాణ సమాజంలో చర్చకు దారి తీస్తున్నాయి.
రాజకీయాలకు దూరమా లేదా రీఎంట్రీనా?
కేసీఆర్ అసెంబ్లీకి రావడం పాజిటివ్ స్టెప్, కానీ ఫుల్ సెషన్ అటెండ్ చేయకపోతే అది టోకెనిజమ్ మాత్రమే. రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల బీఆర్‌ఎస్ మరింత వీక్ అవుతుంది. తెలంగాణ పౌరుషంతో రాజకీయాలు చేయాలనే వాంఛతో ఉన్నా అదే పౌరుషంతో మాటలు పడడం అవసరమా? అసెంబ్లీకొచ్చి నిజాలు చెప్పి రాజీనామా చేయాలన్న డిమాండ్ సొంత పార్టీ నుంచే వస్తున్నది. ఇప్పటికే సంస్థాగతంగా నాయకత్వ ఆలోచనల్లో మార్పు లేకపోతే 2028 ఎన్నికల్లో పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. పార్టీకి కేసీఆర్
మాత్రమే హీరో.. ఆయనే విలన్ అనే అంతర్గత చర్చలకు చెక్ పెట్టాలి.
నీళ్లలోనే పుట్టి.. అదే నీళ్లల్లో మునిగి..
కృష్ణా, గోదావరి అంశం ఒకప్పుడు టీఆర్ఎస్కు జీవం పోసింది. ఇదే అంశంపై గళమెత్తి పాలమూరు ఎంపీగా కేసీఆర్ గెలుపొంది కేంద్ర మంత్రి అయ్యారు. కేసీఆర్ సీఎం అయ్యాక కాళేశ్వరంను కేవలం మూడేళ్లలో పూర్తిచేసి లక్షల ఎకరాలకు నీరందించామని క్లెయిమ్ చేసుకుంది. దీంతో ఆ పార్టీకి ‘నీటి యోధులు’గా ఇమేజ్ ఇచ్చింది. కాళేశ్వరం కూలడం, బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్ ఒక్కో నీటిగుట్టును బయటపెడుతున్నది.
అవినీతి ఆరోపణలను, పదేండ్ల నీటి దోపిడీ, ఏపీ అక్రమ వాడకాన్ని సాక్ష్యాలతో సహా బయటపెడుతున్నది. ప్రజాభవన్‌లో, అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్లు ఇచ్చి బీఆర్ఎస్ వైఫల్యాన్ని లెక్కలతో ఎండగడుతోంది. కేసీఆర్ పాలనలో కృష్ణాజలాల్లో 299 టీఎంసీలను ఒప్పుకుని మరణశాసనం రాశారని బలంగా వాదిస్తోంది. ఇంత జరుగుతున్నా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉన్నా బీఆర్ఎస్ ఆ అంశాలపై మాట్లాడేందుకు సిద్ధంగా లేకపోవడం పరోక్షంగా తప్పులు ఒప్పుకున్నట్టవుతోంది.
- - వెంకట్ గుంటిపల్లి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం
