మైనంపల్లి మెదక్​కు చేసిందేమీ లేదు : పద్మా దేవేందర్ రెడ్డి

మైనంపల్లి మెదక్​కు చేసిందేమీ లేదు : పద్మా దేవేందర్ రెడ్డి

నిజాంపేట, వెలుగు: గతంలో ఐదేళ్లు మెదక్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హన్మంతరావు మెదక్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని బీఆర్‌‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు. గురువారం  మండల పరిధిలోని రాంపూర్  శ్రీ వేణుగోపాస్వామి, ఆంజనేయ స్వామి, శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారాన్ని మొదలు పెట్టారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను  జై తెలంగాణ అంటే మైనంపల్లి హన్మంతరావు​ నై తెలంగాణ అన్నారని గుర్తు చేశారు. 2009లో మెదక్ ఎమ్మెల్యే గా గెలిచి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న  టైంలో ఇంటింటికి నల్లా కనెక్షన్ లేక ప్రజలు తాగునీటి కష్టాలు పడ్డప్పుడు బోర్లు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.

అవసరం ఉన్నప్పుడు బోర్లు వేయలేదు కానీ, అనవసరమైనప్పుడు బోర్లు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. మెదక్ నియోజకవర్గం తనకు సెట్ కాదని మూడేళ్లు ముందుగానే మల్కాజిగిరి వెళ్లారని ఇప్పుడు కొడుకు కోసం మళ్లీ మెదక్​కు వస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్లను అమ్ముకుంటోందని అందుకే కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు బీఆర్‌‌ఎస్‌లో చేరుతున్నారని స్పష్టం చేశారు.   కార్యక్రమంలో మెదక్ ఇన్​చార్జి తిరుపతి రెడ్డి, ఇఫ్కో  డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, ఎంపీపీ రాములు, మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి , సర్పంచ్ లు అమార్సెన రెడ్డి, బాల్ నర్సవ్వ, కవిత, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యుడు గౌస్, మాజీ కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు.

పాపన్నపేట: కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో  కరెంట్ ఖతం అవుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవెందర్ రెడ్డి అన్నారు. పాపన్నపేటలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం  డాక్య తండా, రాజ్యతండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తుందన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామన్నారు. కాంగ్రెస్ రైతుబంధు ఆపమని ఎలక్షన్ కమిషన్ కు  ఫిర్యాదు చేశారని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.