వరంగల్​ బీఆర్ఎస్ క్యాండేట్లకు కార్పొరేటర్ల గండం

వరంగల్​ బీఆర్ఎస్ క్యాండేట్లకు కార్పొరేటర్ల గండం
  • వరంగల్​ బీఆర్ఎస్ క్యాండేట్లకు ..కార్పొరేటర్ల గండం
  • త్వరలో 8 మంది పార్టీ మారుతారని జోరుగా ప్రచారం
  • మూడ్రోజుల్లో చేరికలపై నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం
  • ఇప్పటికే కారు దిగిన పలువురు మాజీ కార్పొరేటర్లు
  • ఈస్ట్​లో అసమ్మతి కార్పొరేటర్లు వరుస మీటింగులు

వరంగల్‍, వెలుగు : వరంగల్​ఈస్ట్, వెస్ట్​ అసెంబ్లీ నియోజకవర్గాల బీఆర్ఎస్​క్యాండేట్లకు ఇంటిపోరు తప్పేటట్లు లేదు. నామినేషన్ల టైంలో ముఖ్య నేతలు చేజారిపోతారనే భయం పట్టుకుంది. మొన్నటి దాకా చేదోడువాదోడుగా ఉన్న కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు కారు దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేసేందుకు వేచి చూస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ మారడం ఖాయమన్నట్లుగా ఈస్ట్ సెగ్మెంట్​పరిధిలోని పలువురు అసమ్మతి కార్పొరేటర్లు వరుసగా సీక్రెట్​మీటింగులు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈస్ట్, వెస్ట్​పరిధిలోని కొందరు మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్​కు రాజీనామా చేసి కాంగ్రెస్​లో చేరిపోయారు. సిట్టింగ్‍ ఎమ్మెల్యేల తీరుపై ఇంకొందరు అసంతృప్తితో రగిలిపోతున్నారు. నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత రోజే గ్రేటర్​వరంగల్ మున్సిపల్​కార్పొరేషన్​పరిధిలోని ఏడెనిమిది మంది అసమ్మతి కార్పొరేటర్లు, పలువురు ముఖ్య నేతలు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తారని తెలుస్తోంది.  

హాట్​ టాపిక్​గా ఈస్ట్​ కార్పొరేటర్లు

వరంగల్‍ ఈస్ట్​నియోజకవర్గ పరిధిలో 22 మంది బీఆర్‍ఎస్‍ కార్పొరేటర్లు ఉన్నారు. వీరిలో సగం కంటే ఎక్కువ మంది సిట్టింగ్‍ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే నాలుగైదుసార్లు 13 నుంచి15 మంది కార్పొరేటర్లు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సీక్రెట్‍ మీటింగులు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. మీటింగ్​పెట్టిన ప్రతిసారీ నరేందర్‍ వారిని బుజ్జగించే ప్రయత్నం చేసినా, అసమ్మతి తగ్గలేదు. మొన్నా మధ్య నరేందర్‍కు టిక్కెట్‍ ఇవ్వొద్దని తీర్మానం చేసి, హైకమాండ్​ను కలిసేందుకు రెడీ అవగా ఎమ్మెల్యే రంగంలోకి దిగి కూల్​చేశారు. దీంతో ఈస్ట్ క్యాండేట్ గా ఆయనకే మరోసారి అవకాశం వచ్చింది. ఈ క్రమంలో అపొజిషన్‍ పార్టీ లీడర్‍ ఒకరు అసమ్మతి కార్పొరేటర్లతో టచ్‍లోకి ఉన్నారు. తమకు సహకరిస్తే సముచిత గౌరవం కల్పిస్తామనే భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ఈ నెల 9న మొదటి దఫాగా ముగ్గురు నుంచి నలుగురు, ఆ తర్వాత మరికొందరు కార్పొరేటర్లు బీఆర్ఎస్​పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే మాజీ కార్పొరేటర్‍ శామంతుల ఉషశ్రీ, శ్రీనివాస్‍ దంపతులు పార్టీని వీడి కాంగ్రెస్‍లో చేరారు. 

వెస్ట్​లోనూ అసమ్మతి సెగలు

ఈస్ట్​తో పోలిస్తే వెస్ట్​కార్పొరేటర్లలో కొంత అసమ్మతి తక్కువగా ఉన్నప్పటికీ, ముగ్గురు మాజీ కార్పొరేటర్లు, మైనార్జీ నేతలు బీఆర్‍ఎస్‍ను వీడి కాంగ్రెస్‍ పార్టీ కండువా కప్పుకున్నారు. లోకల్‍ ఎమ్మెల్యే దాస్యం వినయ్‍ భాస్కర్‍కు దగ్గరగా ఉండే నేతల్లో ఒకరైన మాజీ కార్పొరేటర్‍, ప్రస్తుత హనుమకొండ గ్రంథాలయ సంస్థ చైర్మన్‍ ఎండీ.అజీజ్‍ఖాన్‍, మాజీ కార్పొరేటర్లు అబూబాకర్‍, సుంచు అశోక్‍, కార్పొరేటర్లుగా పోటీ చేసిన కొందరు నేతలు కారు దిగారు. మరో ఐదారుగురు మాజీ కార్పొరేటర్లు పార్టీ వీడతారని తెలుస్తోంది. ఇందులో మైనార్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన మాజీ కార్పొరేటర్లతోపాటు గతంలో కాంగ్రెస్‍, టీడీపీ కార్పొరేటర్లుగా పనిచేసినోళ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఓ మతపెద్ద మైనార్టీ నేతలను వేరే పార్టీలోకి లాగుతున్నట్లు సమాచారం. 

కార్పొరేటర్ల తీరు ఓట్లపై ప్రభావం​

గ్రేటర్‍ కార్పొరేషన్‍ లో వరంగల్‍ ఈస్ట్, వెస్ట్, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల పరిధిలోని కార్పొరేటర్లు ఉన్నారు. 66 డివిజన్లు ఉండగా గడిచిన రెండు టర్ముల్లో ఎక్కువ మంది బీఆర్‍ఎస్‍ పార్టీ నుంచే కార్పొరేటర్లుగా విజయం సాధించారు. ఇందులో పలువురు భూకబ్జాలు, సెటిల్‍మెంట్లలో ఆరి తేరారనే ఆరోపణలు ఉన్నాయి. విలీన గ్రామాలతో పాటు కొత్త కాలనీల్లో ఇండ్లు, అపార్టుమెంట్లు కట్టే క్రమంలో కార్పొరేటర్లు బలవంతంగా డబ్బులు డిమాండ్‍ చేసిన ఘటనలు ఉన్నాయి. సిటీ శివారులో ఉండే కొందరు కార్పొరేటర్లు భూకబ్జాలు, సెటిల్‍మెంట్లపైనే ఎక్కువ దృష్టి పెట్టడం.. కేడర్‍ను పట్టించుకోకపోవడంపై ఎమ్మెల్యేల వద్దకు ఎన్నోసార్లు సొంత పార్టీ నేతలే ఫిర్యాదులు ఇచ్చారు. ఆ కార్పొరేటర్లపై ఉన్న వ్యతిరేకత బీఆర్​ఎస్​ అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపనుందనే చర్చ నడుస్తోంది.