కేసీఆర్ మౌనం వెనక మర్మమేంటి?.. కవిత లేఖ లీక్ దగ్గర్నుంచి.. సస్పెన్షన్ వరకు స్పందించని బీఆర్ఎస్ చీఫ్

కేసీఆర్ మౌనం వెనక మర్మమేంటి?.. కవిత లేఖ లీక్ దగ్గర్నుంచి.. సస్పెన్షన్ వరకు  స్పందించని బీఆర్ఎస్ చీఫ్
  • ఏమీ మాట్లాడకుండానే డైరెక్ట్ సస్పెన్షన్ వేటు 
  • గులాబీ బాస్​ మనసులో ఏముందోనన్న అయోమయంలో పార్టీ క్యాడర్​
  • ముందే రియాక్ట్​ అయి ఉంటే పరిస్థితి ఇంతదూరం వచ్చేది కాదన్న అభిప్రాయాలు
  • బిడ్డ మీద చర్యలు తీసుకునేలా తండ్రిపై సన్నిహితులే ఒత్తిడి తెచ్చారన్న వాదనలు
  • కవిత ప్రెస్‌‌మీట్ ​టైమ్‌‌లో ఫామ్‌‌హౌస్‌‌లో రౌండ్స్‌‌కు వెళ్లిన కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: కవిత ఎపిసోడ్‌‌పై బీఆర్ఎస్​అధినేత కేసీఆర్​ఇప్పటికీ స్పందించడం లేదు. ఆమె హరీశ్​రావు, సంతోష్​రావు పేర్లు చెప్పి మరీ డోస్​ పెంచి తీవ్రమైన ఆరోపణలు చేసినా.. ఆయన మౌనముద్రలోనే ఉండిపోయారు. వాళ్ల పేర్లు బయటపెట్టిన వెంటనే కవితను పార్టీ నుంచి సస్పెండ్​ చేయడమూ పార్టీలోని ఓ వర్గం నేతలను గందరగోళానికి గురిచేస్తున్నదనే చర్చ జరుగుతున్నది. అసలు కేసీఆర్ మనసులో ఏముందో తెలియక వాళ్లంతా అయోమయంలో పడిపోతున్నారన్న వాదన వినిపిస్తున్నది. అసలు కేసీఆర్‌‌‌‌కు కవిత రాసిన లేఖ లీక్​ అయినప్పుడు.. ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆనాడే ఆయన స్పందించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలూ  వ్యక్తమవుతున్నాయి. అప్పుడే  కవితతో కేసీఆర్ మాట్లాడి ఉంటే, పరిస్థితి ఇంతదూరం వచ్చేది కాదన్న చర్చ నడుస్తున్నది. కేసీఆర్ ​కాకపోయినా కనీసం కేటీఆర్​అయినా ముందే స్పందించి ఉండాల్సిందన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. కేటీఆర్​ కూడా తన చెల్లితో రాఖీ కట్టించుకోకుండా పండుగ పూట దూరంగా బెంగళూరుకు వెళ్లడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

  వాస్తవానికి కవిత దెయ్యాలు వ్యాఖ్యలు చేయడంతోనే కేసీఆర్ తనకు సన్నిహితులైన దివికొండ దామోదర్​రావు, గండ్ర మోహన్​రావును రాయబారానికి పంపారు. కానీ కేసీఆర్ తనతో​ మాట్లాకుండా బయటి వ్యక్తులను పంపడంతో వారి మాటలను ఆమె లెక్క చేయలేదు. ఆ తర్వాత వెంటనే కవిత మీడియా చిట్‌‌‌‌చాట్‌‌‌‌లో తన అన్న కేటీఆర్, బావ హరీశ్​రావుపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. అప్పుడైనా కేసీఆర్​ టచ్‌‌‌‌లోకి వస్తారని ఆమె ఆశించినా.. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ తర్వాత కేసీఆర్​ అనేకసార్లు కేటీఆర్, హరీశ్‌‌‌‌తో భేటీ అయ్యారు. కవితపై బహిరంగంగా ఎక్కడా విమ ర్శలు చేయవద్దని సూచన చేశారే తప్ప.. కనీసం వారిద్దరూ వెళ్లి కవితను కలిసి మాట్లాడాలని సలహా ఇవ్వలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్​ నోటీసులు ఇచ్చినప్పుడు.. విచా రణకు వెళ్తున్న సమయంలో కవిత ఫాంహౌస్‌‌‌‌కు వెళ్లినా కేసీఆర్ ఆమెను పట్టించుకోలేదు. కనీసం ఆమెవైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ కేసీఆర్​కాకపోయినా, కనీసం పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్‌‌‌‌గా కేటీఆర్​అయినా తనను పిలిచి మాట్లాడి ఉంటే బాగుండని బహిరంగంగానే కవిత తన ఆవేదనను చెప్పుకున్నారు.

ఒత్తిడి తెస్తున్నారా? 

కవిత విషయంలో చర్యలు తీసుకునేలా కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై సొంత కుటుంబ సభ్యులే ఒత్తిడి తెచ్చారన్న వాదనలూ పార్టీలో వినిపిస్తున్నాయి. కవితను బుజ్జగించి దారికి తెచ్చుకోవాల్సినవారే.. ఆ  పనిచేయకుండా తమ అనుచరులతో సోషల్​ మీడియా వేదికగా రెచ్చగొట్టారని, ఈ క్రమంలోనే సోమవారం కవిత ప్రెస్‌‌‌‌మీట్​పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. తాము అనుకున్నట్లుగా కవిత మాట్లాడడంతో దీనిని సాకుగా చూపి  కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు ఆమెపై కోపం పెరిగేలా రెచ్చగొట్టారని, ఈ క్రమంలోనే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్​ చేశారన్న వాదన ఉంది. తన సొంత కూతురు, పార్టీ ఎమ్మెల్సీ కూడా అయిన కవితను సస్పెండ్​ చేస్తే పార్టీ కుదుపునకు లోనవుతుందని, రాజకీయంగా దుమారం రేగుతుందని తెలిసి కూడా కేసీఆర్​ బయటకు రాలేదు. కవితను ఎందుకు సస్పెండ్​ చేస్తున్నామనే విషయాన్ని లీడర్లకు, క్యాడర్‌‌‌‌‌‌‌‌కు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో క్యాడర్‌‌‌‌‌‌‌‌లో అయోమయం నెలకొంది. కేసీఆర్ మౌనం.. ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తున్నది. కవితను సస్పెండ్​ చేయడం ఇష్టం లేనప్పటికీ, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకే ఆయన​ఈ నిర్ణయం తీసుకున్నారా? లేదంటే పార్టీకి నష్టం జరుగుతుందని భావించే సస్పెండ్ ​చేశారా? అనేది అంతుచిక్కడం లేదని పార్టీలోని ఓ వర్గం అంటున్నది. ఇక హరీశ్​ రావుపై కవిత తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత పార్టీలోని పలువురు సీనియర్లు ఆమెకు కౌంటర్‌‌‌‌‌‌‌‌గా మాట్లాడారు. పద్మా దేవేందర్​ రెడ్డి లాంటి వాళ్లు తీవ్ర విమర్శలు చేశారు. ఇదంతా కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు తెలిసే జరుగుతున్నదా? లేదా? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం కవిత నుంచి వివరణనైనా తీసుకుని చర్యలు తీసుకుంటే బాగుండేదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

సోషల్​ మీడియా సైన్యం..

కవితను పార్టీ నుంచి సస్పెండ్​ చేయడంతో బీఆర్ఎస్​సోషల్​ మీడియాలో ఆమెపై విమర్శలు తీవ్రమయ్యాయి. ‘కవిత ఉంటే ఎంత.. పోతే ఎంత’ అనే స్థాయిలో పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె ఇంటి పేరు పైనా కామెంట్లు తీవ్రమయ్యాయి. కల్వకుంట్ల కాదు.. దేవనపల్లి అంటూ పోస్టులు చేయడమూ మొదలుపెట్టారు. లిక్కర్ ​స్కామ్​కూ లింక్​పెట్టి విమర్శలు చేస్తున్నారు. అయితే, వారికి దీటుగా బదులిచ్చేందుకు కవిత కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు సోషల్​ మీడియా టీమ్‌‌‌‌ను పటిష్టం చేసుకునే పనిలో పడినట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఆమె బహిరంగంగానే చెప్పారు. తనపై ఎంత ట్రోల్​చేస్తారో.. అంతకు రెట్టింపు ట్రోల్స్​చేస్తామని హెచ్చరించారు.

కావాలనే కేసీఆర్​.. కవిత ప్రెస్​మీట్​ చూడలేదా?

కవిత సరిగ్గా ప్రెస్‌‌‌‌మీట్​ పెట్టే సమయంలోనే కేసీఆర్.. తన ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో రౌండ్స్‌‌‌‌కు వెళ్లారు. మూడు నాలుగు కార్ల కాన్వాయ్‌‌‌‌తో ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లోని పంటలను పరిశీలించేందుకు వెళ్లారు. దాదాపు గంట రెండు గంటల పాటు ఫాంహౌస్​లో కలియతిరిగి పంటలను పరిశీలించాక గోశాలకు వెళ్లి.. మళ్లీ ఫాంహౌస్​లోని తన ఇంటికి వచ్చారు. కవిత చెప్పే మాటలు వినలేకే ఆమె ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌ను స్కిప్​ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ​ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో పంటల పరిశీలనకు వెళ్లినప్పుడు కేటీఆర్, జగదీశ్​రెడ్డి వంటి నేతలు అక్కడే ఉన్నారు. కవిత  ప్రెస్‌‌‌‌మీట్​ అయిన తర్వాత సింగరేణి నాయకులు బీఆర్ఎస్​లో చేరిన కార్యక్రమంలో కేటీఆర్​ మాట్లాడారు. కవిత అంశంపై మాట్లాడుతారని అనుకున్నా.. ఆయన ఆ వ్యవహారంపై స్పందించలేదు. ఆ తర్వాత కవిత ఎపిసోడ్​పై కేసీఆర్, కేటీఆర్, జగదీశ్​రెడ్డి మధ్య చర్చ జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్​ చేసినా.. కవిత వ్యాఖ్యల వల్ల కలిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలన్న దానిపై చర్చించారని అంటున్నాయి. రాజకీయంగానే కవిత ఎపిసోడ్ ​మొదలైనా.. చివరకు కుటుంబం నుంచి ఆమె దూరమయ్యే పరిస్థితికి వచ్చిందని చెబుతున్నాయి.