కాంగ్రెస్ వల్లే కరువు .. వందరోజుల్లోనే ఇంత అస్తవ్యస్తమా?: కేసీఆర్​

కాంగ్రెస్ వల్లే కరువు .. వందరోజుల్లోనే ఇంత అస్తవ్యస్తమా?: కేసీఆర్​
  • 24 గంటల కరెంట్, భగీరథ, రైతుబంధు పథకాలు మాయమైనయ్​ 
  • 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నరు
  • విద్యుత్​ రంగం గురించి ఐఏఎస్​లకు ఏం తెలుసు?
  • చిల్లర డ్రామాల కోసమే కాళేశ్వరం ఖాళీ 
  • ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలి​ 
  • లేకుంటే రైతుల కోసం రణరంగం సృష్టిస్తం.. వెంటపడ్తం
  • పంట బోనస్​ కోసం కడుపునిండా తిని దీక్ష చేయాలని పార్టీ నేతలకు సూచన
  • జనగామ, సూర్యాపేట జిల్లాలో ఎండిన పంట పొలాల పరిశీలన

నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులకు అసమర్థ కాంగ్రెస్‌‌ ప్రభుత్వమే కారణమని బీఆర్‌‌ఎస్‌‌ అధినేత కేసీఆర్​ అన్నారు. ఇది వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్​ ప్రభుత్వం తెచ్చిన కరువు అని మండిపడ్డారు.  ఆదివారం  ఆయన  జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండా,  సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని వెలుగు పల్లి, సూర్యాపేట మండలంలోని యార్కరం గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు.. అనంతరం సూర్యాపేట జిల్లా పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘మీకంటే ముందు ఎనిమిదేండ్లు మేం బ్రహ్మాండంగా కరెంటు ఇచ్చినం. కరెంటు ఇప్పుడెట్ల మాయమైంది’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 'మేం పదేండ్లు రైతులను బ్రహ్మాండంగా చూసుకున్నం. ఇప్పుడు వాళ్ల కండ్ల పొంటి నీళ్లు వస్తుంటే ఎట్ల చూడాలె. వాళ్లు బాధలు పడుతుంటే చూసి ఎట్ల ఊకోవాలె. అందుకే వాళ్లపక్షాన మేం నిలబడ్డాం’ అని అన్నారు. 

రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది?

'ఒక అగ్రగామి రాష్ట్రం. ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది ఇయ్యాల. వంద రోజుల్లో ఇంత అస్తవ్యస్తం ఏంది? రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ ప్రభుత్వ అసమర్థత, అవివేకం, తెలివితక్కువతనం, అవగాహనారాహిత్యం, దేన్నీ ఎట్లా వాడాలో తెలియని అర్భకత్వం మనకు స్పష్టంగా కనిపిస్తున్నది’ అని కేసీఆర్​ అన్నారు. ప్రభుత్వానికి ఉన్న కరెంటు, మిషన్‌‌ భగీరథను వాడు కునే తెలివి లేదని దుయ్యబట్టారు.

‘నేను సీఎంగా ఉన్న సమయంలో ఈ టర్మ్‌‌లోగా భగీరథ కంప్లీట్‌‌ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని.. ఓట్లు అడగదని చాలెంజ్‌‌గా చెప్పి పథకాన్ని పూర్తి చేశాం.  కానీ ఇప్పుడు అన్నీ మాయమయ్యాయి. ఐదేండ్లలో మంచినీళ్ల ట్యాంకర్లు  కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ బిందెలు ఎందుకు ప్రత్యక్ష మవుతున్నయ్‌‌ ? హైదరాబాద్‌‌ సిటీలో ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపురించింది ? అని అన్నారు. విద్యుత్​ రంగాన్ని కాంగ్రెస్ సర్కారు ఆగమాగం చేసిందని కేసీఆర్​ అన్నారు. తాము విద్యుత్​ రంగంలో  నిపుణులను నియమించి 24 గంటల విద్యుత్​ సప్లై చేస్తే.. ఈ ప్రభుత్వం నిపుణులను తొలగించి ఆ బాధ్యతలు ఐఏఎస్​ ఆఫీసర్లకు కట్టబెట్టిందని తెలిపారు. విద్యుత్​ రంగం గురించి ఐఏఎస్​ ఆఫీసర్లకేం తెలుసు? అని కేసీఆర్​ ప్రశ్నించారు. 

సీఎం నిద్రపోతున్నడా?

‘అధికారంలోకి రాగానే డిసెంబర్‌‌ 9న రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నరు. డిసెంబర్‌‌ 9 పొయ్యి ఎన్నాళ్లయ్యింది? సీఎం ఎక్కడున్నరు? నిద్రపోతున్నడా? ఢిల్లీ చుట్టూ తిరిగి రాజకీయాలు చేయడం తప్ప రైతుల గురించి పట్టించుకోవడం లేదు’ అని కేసీఆర్​ అన్నారు.  రైతులను పట్టించుకోకపోతే తరిమి తరిమి కొడ్తామని  హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వెంటాడి వేటాడుతామని అన్నారు. 'నేను రైతులకు చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా.  ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీ కోసం బీఆర్‌‌ఎస్‌‌ పార్టీ రణరంగమైనా సృష్టిస్తది’ అని కేసీఆర్​ అన్నారు. లక్షఎకరాల్లో పంటలు ఎండిపోతే.. దాని గురించి మాట్లాడే దిక్కే లేదని, పంటల పరిశీలను ఓ ఎమ్మెల్యే , ఓ మంత్రిగూడా పోడని అన్నారు.

ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాల్సిందే 

‘పంటలను మీరే ఎండబెట్టిన్రు. మీ అసమర్థత వల్లే ఎండిపోయినయి.. కాబట్టి నష్టపరిహారం ఇవ్వాల్సిందే’ అని  ప్రభుత్వాన్ని కేసీఆర్​ డిమాండ్​ చేశారు. ధరలు పెరిగినందున ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని అన్నారు. వచ్చే పంటకు 500 బోనస్‌‌ ఎట్టి పరిస్థితుల్లో కట్టి తీరాల్సిందేనని డిమాండ్‌‌ చేశారు. ఇందుకోసం  ఏప్రిల్​ 2న బీఆర్ఎస్​   ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్లను కలిసి మెమొరాండం ఇవ్వాలని కేసీఆర్​ సూచించారు. 6న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో  ఒక రోజు దీక్ష చేయాలని, కడుపునిండా భోజనం, టిఫిన్​ చేసి దీక్షలో కూర్చోమని రైతులకు చెప్పారు. 

200 మంది రైతులు ఆత్మహ్యత్య చేసుకున్నరు

బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వ హయాంలో రైతులు బ్రహ్మాండంగా పంటలను సాగుచేసుకున్నారని, కానీ అనతికాలంలోనే ఇంతర దుర్భర పరిస్థితి వస్తదని అనుకోలేదని  కేసీఆర్​అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి ఏకంగా 3 కోట్ల టన్నులు దాటిందని తెలిపారు. రైతు సంక్షేమ విధానాలతో ఉత్పత్తి అధికమై పంజాబ్‌‌కే పోటీగా నిలిచి దేశంలోనే అగ్రస్థానానికి దూసుకుపోయిందని అన్నారు.  ఇంత సుభిక్షంగా ఉన్న రాష్ట్రం పరిస్థితి ఇప్పుడు ఇంత అధ్వాన్నంగా మారడానికి కారణం ఎవరు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్​ సర్కార్​ వచ్చిన కేవలం వంద రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఈ దుస్థితి ఎందుకొచ్చిందని మండిపడ్డారు.
 
చిల్లర డ్రామా కోసమే కాళేశ్వరం ఖాళీ 

తాము అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఎకరం పంటకూడా ఎండినయ్యలేదని కేసీఆర్​ తెలిపారు. మొన్నటి వరకు సింగూరులో 17 టీఎంసీలు నీళ్లు ఉండేవని, ఏదోరకంగా తీసుకొచ్చి ఎస్పారెస్పీకి నీళ్లు వదిలిపెడితే పంటలు ఎండిపోయేవి కాదు కదా? అని ప్రశ్నించారు.  చిల్లర డ్రామా కోసం కాళేశ్వరం ప్రాజెక్టును ఖాళీ చేశారని ఆరోపించారు. ‘కాంగ్రెస్అ ధికారంలోకి వచ్చిన డిసెంబర్​లో 25వేల క్యూసెక్కుల నీళ్లు వచ్చేవి. ఏదో సీపేజ్​తో వాటర్​ పోతున్నదని, దాన్ని వీడియో, ఫొటోలు తీసి.. అదేదో మొత్తం ఖతం అయిపోయిందని లంగ ప్రచారం చేశారు’ అని కేసీఆర్​ అన్నారు.  సమ్మక్క బ్యారేజీకి ఏ మైంది? దేవాదుల నీళ్లు ఎందుకు డంప్​ చేస్తలేరు? కరెంట్​ సేవ్​ చేస్తున్నమని చెప్తున్నరు? రైతుల కోసం బిల్లులు కట్టాల్సిందే. అప్పులు చేయాల్సిందే’ అని అన్నారు.  

5న కరీంనగర్‌‌‌‌ జిల్లాలో  పర్యటన 

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఈ నెల 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్ రూరల్, సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో ఎండిన పొలాలను ఆయన పరిశీలించి, పంట నష్టపోయిన రైతులతో మాట్లాడనున్నారు. ఈ మేరకు వివరాలను ఆదివారం బీఆర్‌‌‌‌ఎస్‌‌ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. 

కరెంట్ కట్ అంటూ బీఆర్​ఎస్​ తప్పుడు ప్రచారం 

కేసీఆర్ మీడియా సమావేశం జరుగుతుండగా మధ్యలో కరెంట్​ సప్లైలో అంతరాయం ఏర్పడింది. దీంతో సమావేశం జరిగే టెంట్​ లోపల లైట్లు ఆఫ్​అయ్యాయి. కానీ ఏసీలు నడుస్తున్నాయి. టెంట్​లోపల వైర్లు లూజ్​ కనెక్షన్​ వల్ల సప్లై ఆగిపోయినా వెంటనే మళ్లీ ఆన్​ అయ్యింది. దీన్ని ఉద్దేశించి కేసీఆర్​మాట్లాడుతూ కాంగ్రెస్​ పాలనలో కరెంట్​కూడా ఇట్లనే వస్తది.. పోతది అని ఉదహరించారు. కాగా, కేసీఆర్​ మాట్లాడుతుండగా కరెంట్​పోయిందంటూ దీనిపై బీఆర్ఎస్​ పార్టీ ఆఫీసు నిర్వాహకులు, పీఆర్వో నిరంజన్​రెడ్డి వివిధ వాట్సాప్​ గ్రూప్​లలో వైరల్​ చేశారు. ఈ సంఘటనపై సూర్యాపేట జిల్లా విద్యుత్​శాఖ క్లారిటీ ఇచ్చింది. పార్టీ కార్యాలయం సమీపంలో కేసీఆర్ మాట్లాడుతుండగా కరెంట్​ సప్లైలో అంతరాయం కలుగలేదని, ఆఫీసు లోపల సప్లైలో వచ్చిన లోపంతోనే కరెంట్​ పోయిందని వివరిస్తూ మీడియాకు ప్రకటన రిలీజ్​ చేసింది.