
- నలుగురు మహిళలపైక్రిమినల్ కేసు నమోదు
జూబ్లీహిల్స్, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారం వెంగళరావునగర్(99వ డివిజన్) కార్పొరేటర్ దేదీప్యరావుపై దాడికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే.. కాంగ్రెస్ నాయకులు ఓ కార్యక్రమానికి సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడా చౌరస్తాతోపాటు పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమం అయిపోయాక కూడా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా ఉన్న ఫ్లెక్సీలను చూసిన కార్పొరేటర్ దేదీప్యరావు వాటిని తొలగించాలని బల్దియా అధికారులకు ఫిర్యాదు చేశారు.
మంగళవారం రాత్రి జీహెచ్ఎంసీ సిబ్బంది యూసుఫ్‌గూడ చౌరస్తాలోని ఫ్లెక్సీలను తొలగిస్తుండగా స్థానిక మహిళలు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. బల్దియా సిబ్బంది వెంటనే కార్పొరేటర్‌కు ఫోన్‌చేసి చెప్పగా, ఆమె తన భర్త విజయ్ కుమార్ తో కలిసి కారులో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో కొందరు మహిళలు కార్పొరేటర్‌పై దాడిచేశారు. దేదీప్యరావు, విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు భావన, నాగలక్ష్మి, హెస్సెన్, లక్ష్మి అనే నలుగురు మహిళలపై ఐపీసీ 323, 504,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
సీఎం స్పందించి చర్యలు తీస్కోవాలి: ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్
మహిళా కార్పొరేటర్‌పై దాడి చేయడం దారుణమని, గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి కార్పొరేటర్ దేదీప్యరావుపై దాడి చేసినోళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు బుధవారం మధురానగర్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలే తనపై దాడిచేశారని కార్పొరేటర్దేదీప్యరావు ఆరోపించారు. డీఆర్ఎఫ్ టీం ఫోన్ చేస్తేనే తాను యూసుఫ్‌గూడ చెక్‌పోస్టుకు వెళ్లానని చెప్పారు.