మహారాష్ట్రలో బీఆర్​ఎస్​కు ఎదురు దెబ్బ... తొలి ఎన్నికలోనే బొక్క బోర్లా పడ్డ గులాబీ దళం 

మహారాష్ట్రలో బీఆర్​ఎస్​కు ఎదురు దెబ్బ... తొలి ఎన్నికలోనే బొక్క బోర్లా పడ్డ గులాబీ దళం 

జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత పొరుగు రాష్ట్రంలో పోటీ పడ్డ తొలి ఎన్నికల్లోనే బీఆర్‌ఎస్‌ చతికిల పడింది. మహారాష్ట్రలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఒకవూరి కరణం మరో గ్రామంలో వెట్టోడితో సమానమని అంటారు.  స్థానిక ఏం మాట్లాడినా.. ఏంచేసినా ఎంతో కొంత చరిష్మా ఉంటుంది.. కొంత కాకపోయినా కొంతైనా నమ్ముతారు.  మరి వేరే ప్రాంతంలో కూడా నా మాటే నెగ్గాలంటే అదెట్టా కుదురుతుందన్నారు మహారాష్ట్ర ప్రజలు.  టీఆర్​ఎస్​ కాస్త బీఆర్​ఎస్​గా మారింది. తెలంగాణ స్థానంలో భారత్​ అని చేర్చి పార్టీ పేరు మార్చారు. ఇంకేముంది.  తెలంగాణ సెంటిమెంట్​ లాగానే భారత్​ అని పేరుపెట్టగానే సెంటిమెంట్​ కూడా పారుతుందనుకున్నారు.. మన కేసీఆర్​ సార్​ .. తెలంగాణ పక్కనే ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలోని భోకర్‌ తాలూకాలో ఉన్న ప్రఖ్యాత భోకర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ 18 డైరెక్టర్‌ పదవులకు జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు పరాజయం పాలయ్యారు. ఒక్కటంటే ఒక్క డైరెక్టర్ పదవిలో కూడా నెగ్గలేకపోయింది. ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్‌ మద్దతుదారులు 13 స్థానాలు గెలుచుకోగా.. ఎన్సీపీకి రెండు వచ్చాయి. బీజేపీ బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు డైరెక్టర్‌ పదవులను కైవసం చేసుకున్నారు.

ఈ మార్కెట్‌పై పట్టున్న నాగ్‌నాథ్‌ సింగ్‌ ఇటీవలే కాంగ్రెస్​ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. భోకర్‌ మార్కెట్‌కు నాందేడ్‌ జిల్లాలోనే అతిపెద్దదనే పేరుంది . ఈ  మార్కెట్‌ కమిటీ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్‌ఎస్‌ వ్యూహరచన చేసింది. చాలా మంది రాజకీయ ప్రముఖులు ఈ మార్కెట్‌ కమిటీ ఎన్నికల నుంచే తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.  ముందు నుంచి ఈ కమిటీలో కాంగ్రెస్​-ఎన్సీపీ కూటమి, శివసేన(ఉద్ధవ్‌ వర్గం), బీజేపీకి మధ్య త్రికోణ పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. ఇందుకు కారణం.. ఈ మార్కెట్‌ మాజీ సీఎం అశోక్‌ చవాన్‌ నియోజకవర్గం(భోకర్‌) పరిధిలో ఉండడంతో, ఆయన ఈ ఎన్నికలను సీరియస్​గా తీసుకున్నారు. అటు స్థానిక బీజేపీ ఎంపీ ప్రతాప్‌ పాటిల్‌ చికిల్కర్‌ కూడా వారం రోజులుగా భోకర్‌లోనే ఉంటూ.. అవిశ్రాంతంగా ప్రచారం చేశారు. కొంతకాలంగా మహారాష్ట్రలో రాజకీయ కార్యకలాపాలను విస్తరిస్తూ.. బీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతోంది.

ఏమిటీ ఈ మార్కెట్‌ ప్రత్యేకత?

భోకర్‌ మార్కెట్‌కు నాందేడ్‌ జిల్లాలోనే అతిపెద్దదనే పేరుంది. చాలా మంది రాజకీయ ప్రముఖులు-- 1964లో నోటిఫై అయిన ఈ మార్కెట్‌ కమిటీ ఎన్నికల నుంచే తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 64 గ్రామాలు ఈ మార్కెట్‌ పరిధిలో ఉన్నాయి. 15 కోల్డ్‌ స్టోరేజీలున్న ఈ మార్కెట్‌-- సజ్జలు, జొన్నలు, శనగలు, పెసలు, సోయా, నువ్వులు, కందులు, గోధుమలు, పొద్దుతిరుగుడు గింజలకు ప్రసిద్ధి

బీఆర్​ఎస్​ పార్టీ సరిహద్దు గ్రామాల్లో భారీగా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తోంది. ఇటీవల బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌.. మహారాష్ట్రలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ తరుణంలో వచ్చిన భోకర్‌ మార్కెట్‌ కమిటీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. కానీ, నాగ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో బరిలోకి దిగిన 18 మంది అభ్యర్థులు ఉచిత హామీలను ప్రకటించినా.. ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. బీఆర్‌ఎస్‌ ఇక్కడ తమ మద్దతుదారులను గెలిపిస్తే.. తెలంగాణలో మాదిరిగా ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా పథకాలను మహారాష్ట్రలో అమలు చేస్తామని హామీలు ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ ఆగమనంతో ఫలితాలు తారుమారవుతాయని భావించినా.. ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవడం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు మహారాష్ట్రలో అధికారాన్ని కోల్పోయిన శివసేన(ఉద్ధవ్‌ఠాక్రే) వర్గం కూడా ఈ ఎన్నికల్లో బొక్కబోర్లా పడిందని విశ్లేషకులు అంటున్నారు.