
కరీంనగర్, వెలుగు : అప్పులు చూపించి ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వంద రోజుల తర్వాత తెలంగాణ ప్రజలు రోడ్లమీదికి వస్తారని హెచ్చరించారు. కరీంనగర్లోని తన ఆఫీసులో ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో తెలంగాణ ఆస్తులకు సంబంధించి 51 పేజీల నివేదికను రిలీజ్ చేసి, మాట్లాడారు. తెలంగాణ వచ్చినప్పుడు1,400 ఆక్సిజన్ బెడ్స్ ఉంటే, వాటిని 34 వేలకు పెంచామన్నారు. తెలంగాణ వచ్చాక 56 బ్లడ్ బ్యాంక్లు, 82 డయాలసిస్ కేంద్రాలు, 500 బస్తీ దవాఖానాలు,1000 పడకల అల్వాల్ టిమ్స్, ఎర్రగడ్డ టిమ్స్, గడ్డి అన్నారం టిమ్స్, 1,261 బెడ్లతో గచ్చి బౌలి టిమ్స్, రూ.1571 కోట్లతో నిమ్స్ 2 వేల పడకల హాస్పిటల్ విస్తరణ, రూ. 3,779 కోట్లతో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించినట్లు వెల్లడించారు. 33 జిల్లాల్లో రూ.1649.62 కోట్లతో కొత్త కలెక్టరేట్లు కట్టామని, రాష్ట్రంలో 8,578 కిలో మీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మించామని చెప్పారు.