- కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు
న్యూఢిల్లీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను పారదర్శకంగా నిర్వహించేలా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ కోరింది. ఎలాగైనా గెలవాలనే ఆలోచనతో అధికార కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతున్నదని ఆరోపించింది. ఎన్నికల సంఘం అధికారులను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత సురేశ్ రెడ్డి, ఎంపీలు దామోదర్ రావు, పార్ధసారథి రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. ఉప ఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి 6 రోజులుగా ప్రచారం చేస్తున్నారని, మంత్రివర్గమంతా అక్కడే ఉన్నదని తెలిపారు.
ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండడంతో అసెంబ్లీ, మండలికి ప్రాతినిథ్యం వహించని అజారుద్దీన్‌కు మంత్రిగా అవకాశం కల్పించారని, హోంమంత్రిత్వ శాఖ కూడా సీఎం వద్దే ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ లీడర్లను పోలీసులతో బెదిరింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. అక్రమ కేసులు బనాయించి నోటీసులు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్చే యాలని చూస్తున్నదన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని తెలిపారు. పోలింగ్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలు, లైవ్ వెబ్‌కాస్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కోరారు.
