మహారాష్ట్ర లేదు.. ఏపీ లేదు..ఓన్లీ తెలంగాణ

మహారాష్ట్ర లేదు.. ఏపీ లేదు..ఓన్లీ తెలంగాణ
  • మహారాష్ట్ర లేదు.. ఏపీ లేదు..ఓన్లీ తెలంగాణ
  • అసెంబ్లీ ఎన్నికల దాకా బీఆర్ఎస్​ ఫోకస్​ అంతా ఇక్కడే
  • పొరుగు రాష్ట్రాల్లో యాక్టివిటీ బంద్​
  • ఆగిన మహారాష్ట్ర లీడర్ల చేరికల హడావుడి
  • కేసీఆర్​ వెంట కనిపించని పార్టీ ఏపీ అధ్యక్షుడు
  • తెలంగాణలో గెలిచినంకే జాతీయ రాజకీయాలు!
  • అప్పటివరకు ఎక్కడోళ్లు అక్కడ గప్​చుప్​

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్​ పేరును బీఆర్ఎస్​గా మార్చి దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తానని చెప్పి మహారాష్ట్ర, ఏపీ రాజకీయాలపై ఫోకస్​ పెట్టిన కేసీఆర్​.. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో యాక్టివిటీని బంద్​ పెట్టారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్​గా ఎత్తుగడలు వేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు పొరుగు రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలను ఆపేయాలని కేసీఆర్​నిర్ణయానికి వచ్చినట్టు బీఆర్ఎస్ ​ముఖ్యులు చెప్తున్నారు. రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకున్నాక జాతీయ రాజకీయాలపై ఫోకస్​ పెట్టొచ్చనే భావనలో ఆయన​ ఉన్నారని వారు అంటున్నారు. ఇదే క్రమంలో 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ప్రత్యర్థి పార్టీలను బోల్తా కొట్టించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.  మొన్నటి వరకు కేసీఆర్​ వెంట కనిపించిన ఏపీ బీఆర్​ఎస్​ అధ్యక్షుడు ఇప్పుడు ఆయన వెంట కనిపించడం లేదు. 20 రోజుల కిందటి వరకు మహారాష్ట్ర నుంచి భారీగా చేరికలంటూ హడావుడి చేసిన గులాబీ వర్గాలు.. ఇప్పుడు సైలెంట్​ అయ్యాయి. 

ఒక్కొక్కరుగా దూరమవుతున్నరు!

కేంద్రంలో కాంగ్రెస్సేతర, బీజేపీ యేతర ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు దిశగా 2017, 2018లోనే కేసీఆర్​ ప్రయత్నాలు మొదలు పెట్టారు. 2019 లోక్​సభ ఎన్నికల టైమ్​లోనూ పలు ప్రాంతీయ పార్టీలతో ఈ కూటమి దిశగా చర్చలు సాగించారు. పార్లమెంట్​ఎన్నికల్లో బీజేపీ మళ్లీ విజయం సాధించడంతో కొన్నాళ్లు ఆయన​ సైలెంట్​అయ్యారు. జాతీయ స్థాయిలో తెలంగాణ మోడల్​కు ఆదరణ ఉందని చెప్తూ టీఆర్ఎస్ ​పేరును బీఆర్​ఎస్​గా 2022 అక్టోబర్​లో మార్చి జాతీయ రాజకీయాల్లో అడుగు పెడుతున్నట్టుగా ప్రకటించారు. పార్టీ పేరు మార్పు సమయంలో కేసీఆర్ వెన్నంటే ఉన్న కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి సహా మిగతా నాయకులందరూ ఆ తర్వాత దూరం జరిగారు. కొన్ని రోజుల కిందటి వరకు కేసీఆర్​తో కనిపించిన రైతు సంఘాల నాయకులు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. 

సర్వేల మీద సర్వేలు చేయిస్తూ..!

రాష్ట్ర అసెంబ్లీకి షెడ్యూల్​ ప్రకారం డిసెంబర్​లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నెల 19 నుంచి నిర్వహించే పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాల్లో ఇండియా పేరు భారత్​గా మార్చడం, చట్ట సభల్లో మహిళల కోటా సహా పలు కీలక బిల్లులు ఉంటాయని ప్రచారం జరుగుతున్నది. జమిలిపైనా పార్లమెంట్​లో చర్చ జరగొచ్చు కానీ.. ఈ అసెంబ్లీ ఎన్నికలకే జమిలి ఎన్నికలు అమల్లోకి రాకపోవచ్చని ప్రగతి భవన్​వర్గాలు లెక్కలు కడుతున్నాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్​గా కేసీఆర్​ పావులు కదుపుతున్నారు.

బయటికి రాష్ట్రంలో పార్టీ యాక్టివిటీని స్లో చేసినట్టుగా చెప్తున్నా అండర్​గ్రౌండ్​వర్క్​ కంటిన్యూ చేస్తున్నారు. సిట్టింగ్​ఎమ్మెల్యేలతో పాటు పార్టీ టికెట్లు ఇచ్చిన క్యాండిడేట్ల నియోజకవర్గాల్లో సర్వేలు చేయించడం, ఎక్కడ ఏ పార్టీ ప్రభావం ఏ మేరకు ఉంది.. ఎక్కడ ఎవరికి ఎడ్జ్​ ఉంటుంది.. వ్యక్తిగతంగా ఓట్లు సాధించే లీడర్లెవరు.. చిన్నా చితక పార్టీలు ఎంతమేరకు ఓట్లు సాధిస్తయ్​.. వాటి ప్రభావం ఏ ప్రధాన పార్టీపై పడుతుంది.. కాంగ్రెస్​తో కమ్యూనిస్టులు జట్టుకడితే ఎన్నికల ఫలితాలు ఎట్ల ఉంటాయనే  కోణంలో డజనుకు పైగా సర్వే ఏజెన్సీలను రంగంలోకి దించి జనం నాడి తెలుసుకునే  ప్రయత్నాల్లో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయినా గట్టెక్కి మళ్లీ గద్దెనెక్కడమే టార్గెట్​గా కేసీఆర్​అడుగులు వేస్తున్నారు. ఈక్రమంలోనే ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు బ్రేకులు వేశారు.

వెంట కనిపించని తోట

బీఆర్ఎస్​ పేరు మార్పు తర్వాత ఆంధ్రప్రదేశ్​కు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్​ను కేసీఆర్​ నియమించారు. కొందరు లీడర్లకు గులాబీ కండువాలు కప్పి మొదట్లో హడావుడి చేశారు. మహారాష్ట్రలో పార్టీ ఖర్చుతో ఆఫీసులు ఏర్పాటు చేస్తే ఏపీలో మాత్రం స్థానిక నాయకులే బీఆర్ఎస్​ ఆఫీస్​ ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేక విమానంలో నాగ్​పూర్​కు వెళ్లి పార్టీ ఆఫీస్​ప్రారంభానికి రిబ్బన్​కట్​చేసిన కేసీఆర్​.. విజయవాడలో ఏపీ పార్టీ ఆఫీస్​ ప్రారంభోత్సవాన్ని మాత్రం పట్టించుకోలేదు. వైజాగ్​స్టీల్ ​ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్​ ఉద్యమించబోతున్నట్టు ప్రకటించి.. ఆ తర్వాత చల్లబడ్డారు. వైజాగ్, విజయవాడ, తిరుపతి, కర్నూల్​లో భారీ బహిరంగ సభలు ఉంటాయని బీఆర్​ఎస్​ హైకమాండ్​ నుంచే  స్వయంగా లీకులు ఇచ్చినా.. ఆ తర్వాత చడీచప్పుడు లేదు. మొత్తంగా ఏపీలో గులాబీ పార్టీని కోల్డ్​స్టోరేజీలో పెట్టేశారు.

కొన్నాళ్ల కిందటి వరకు నేతల చేరికలతో ఏపీలో కొద్దిపాటి యాక్టివిటీ కనిపించేది. కేసీఆర్​ పట్టించుకోవడం మానేశాక ఏపీ లీడర్లు కూడా హడావుడి తగ్గించేశారు. గతంలో బీఆర్​ఎస్​ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్​ సీఎం కేసీఆర్​ వెంట అప్పుడప్పుడు కనిపించేవారు. ఆయన ఎక్కువగా హైదరాబాద్​లోనే ఉంటున్నా ఈ మధ్య కేసీఆర్​ వెంట మాత్రం కనిపించడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్​గా పనిచేస్తున్న కేసీఆర్​.. పొరుగు రాష్ట్రాల పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడటం లేదని ప్రగతి భవన్​తో నిత్యం టచ్​లో ఉండే నేత చెప్పారు. 

మహారాష్ట్ర సభ లేనట్టే!
ప్రగతి భవన్​ పక్కన ఉన్న టూరిజం ప్లాజా హోటల్​లో రెండు వారాల కిందటి వరకు మహారాష్ట్ర వాసులే ఎక్కువగా కనిపించేవారు. స్టేట్ ​టూరిజం బస్సుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్​భగీరథ, సిద్దిపేట జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను వారికి బీఆర్​ఎస్​ లీడర్లు చూపించి మహారాష్ట్రకు తిరిగి పంపించేవాళ్లు. ఇప్పుడు ఆ యాక్టివిటీ దాదాపు ఆగిపోయింది. చివరిసారిగా ఆగస్టు 27న మహారాష్ట్రకు చెందిన పలువురు కేసీఆర్ ​సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అదే నెల 30న మంత్రి హరీశ్ మహారాష్ట్రలోని సోలాపూర్​కు వెళ్లివచ్చారు. దీంతో అక్కడ కేసీఆర్​బహిరంగ సభ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పటి వరకు ఆ సభ ఊసే లేదు. మహారాష్ట్రలో పార్టీ కార్యకలాపాలు తగ్గించేశారు. అక్కడ మొత్తం పార్టీ విస్తరణ ఇప్పటికిప్పుడే సాధ్యం కాకపోవచ్చని.. సరిహద్దు నియోజకవర్గాల్లో ఇక్కడి సంక్షేమ పథకాల ప్రభావం ఉంటుందని, ఆయా ప్రాంతాలపైనే దృష్టి సారించాలనే ఆలోచనలో కేసీఆర్​ ఉన్నట్టు తెలుస్తున్నది.