వైన్స్​కు టెండర్లు.. మూణ్నెళ్ల ముందే

వైన్స్​కు టెండర్లు.. మూణ్నెళ్ల ముందే
  • వైన్స్​కు టెండర్లు.. మూణ్నెళ్ల ముందే 
  • నిధుల కోసం రాష్ట్ర సర్కార్ ప్లాన్.. టార్గెట్ రూ.2 వేల కోట్లు
  • షెడ్యూల్ విడుదల.. రేపట్నుంచి అప్లికేషన్లు 
  • 18 వరకు దరఖాస్తులకు చాన్స్.. 21న డ్రా 
  • 22లోపు ఫస్ట్ ఇన్ స్టాల్ మెంట్ కట్టాల్సిందే 
  • కొత్త దుకాణాలకు స్టాక్ ఇచ్చేది మాత్రం నవంబర్ 30న

హైదరాబాద్‌‌, వెలుగు:  ప్రస్తుత ఎక్సైజ్ పాలసీ (2021–23) ముగియకముందే రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలకు టెండర్లు పిలిచింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదాయం కోసం మూణ్నెళ్ల ముందుగానే కొత్త ఎక్సైజ్ పాలసీ (2023–25) తీసుకొస్తున్నది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఎక్సైజ్ శాఖ బుధవారం విడుదల చేసింది. ఈ నెల 4న జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపింది. అదే రోజు నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని, 18న సాయంత్రం 6 గంటల వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని చెప్పింది. 21న లక్కీ డ్రా తీస్తామని వెల్లడించింది. అదే రోజు నుంచి 22 వరకు లైసెన్స్ ఫీజులో ఫస్ట్ ఇన్ స్టాల్ మెంట్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. నవంబర్​30 నుంచి కొత్త దుకాణాలకు స్టాక్‌‌ రిలీజ్‌‌ చేస్తామని తెలిపింది. 

డిసెంబర్ 1 నుంచి కొత్త షాపులు అందుబాటులోకొస్తాయని,  జిల్లాల వారీగా గౌడ్స్, ఎస్సీ, ఎస్టీలకు అలాట్ చేయాల్సిన దుకాణాలను గురువారం కేటాయిస్తామని ఎక్సైజ్ శాఖ చెప్పింది. ఏ జిల్లాలో ఎక్కడ? ఏ షాప్‌‌? రిజర్వేషన్ ​కిందికి వస్తుందనేది తెలియజేస్తామని పేర్కొం ది. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 వైన్స్ లు ఉండగా.. గౌడ్స్‌‌కు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. గౌడ్స్‌‌కు 393, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 చొప్పున దుకాణాలు కేటాయిస్తారు. 

నిధుల కటకటతో.. 

రాష్ట్రంలో ప్రతి రెండేండ్లకోసారి ఎక్సైజ్‌‌ పాలసీ మారుతుంటుంది. 2021–23 ఎక్సైజ్‌‌ పాలసీ గడువు నవంబర్‌‌ ఆఖరు వరకు ఉన్నది. డిసెంబర్‌‌ ఒకటి నుంచి కొత్త పాలసీ అమల్లోకి రావాల్సి ఉన్నది. కానీ ఆదాయం కోసం ప్రభుత్వం మూడు నెలలు ముందుగానే కొత్త పాలసీ తీసుకొస్తున్నది. రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోవడంతో స్కీమ్ లకు నిధుల కొరత ఏర్పడింది. ఎన్నికలు దగ్గర పడడంతో స్కీమ్ లు అమలు చేయకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తదని ప్రభుత్వం ఆందోళనలో ఉన్నది. దీంతో కొన్ని స్కీములకు అయినా నిధులు ఇవ్వాలంటే మద్యం దుకాణాలకు టెండర్లు పిలవాలని సీఎం ముఖ్య సలహాదారులు సూచించినట్లు తెలిసింది. అందుకే హడావుడిగా అప్లికేషన్​ప్రక్రియను ఎక్సైజ్ శాఖ మొదలుపెట్టింది. 

ఏడాదికి ఎంత ఫీజు? 

5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు ఏడాదికి రూ.50 లక్షలుగా నిర్ణయించారు. 5 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.60 లక్షలు , లక్ష నుంచి 5 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 85 లక్షలు, 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.1 కోట్లుగా నిర్ణయించారు. అయితే ఇందులో ఫస్ట్​ఇన్​స్టాల్​మెంట్​ఈ నెల 22 లోపే చెల్లించాల్సి ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు రూ.2 లక్షలు  

అప్లికేషన్‌‌ ఫీజు రూ.2 లక్షలుగా నిర్ణయించారు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేయొచ్చు. కానీ ఆ మొత్తాన్ని రీఫండ్ చేయరు. 2021లో టెండర్లకు మొత్తం 67,849 అప్లికేషన్లు వచ్చాయి. ఆ అప్లికేషన్ల ద్వారానే రాష్ట్ర సర్కార్ కు రూ.1,356 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే ఈసారి దానికి అదనంగా మరో రూ.500 కోట్లు రాబట్టాలని సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. ఎక్కువ అప్లికేషన్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అప్లికేషన్ల ద్వారా రూ.1,800 కోట్ల ఇన్ కమ్ రాబట్టాలని, దానికి ఫస్ట్ ఇన్ స్టాల్ మెంట్ ఫీజు కలిపి మొత్తంగా రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూర్చాలని నిర్దేశించింది.