విత్తన సబ్సిడీ  లేనట్లే!.. రైతుల ఆశలపై నీళ్లు

విత్తన సబ్సిడీ  లేనట్లే!.. రైతుల ఆశలపై నీళ్లు
  • విత్తన సబ్సిడీ  లేనట్లే!
  • పచ్చి రొట్ట విత్తనాలకే పరిమితం
  • మిగతా పంటల విత్తనాలపై చేతులు ఎత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • సర్కార్​ నిర్ణయంతో  రైతుల ఆశలపై నీళ్లు

హైదరాబాద్‌‌, వెలుగు :  రాష్ట్ర సర్కారు వచ్చే సీజన్‌‌లోనూ విత్తనాలపై సబ్సిడీ ఇవ్వకుండా చేతులెత్తేసింది. గత మూడేళ్లుగా ప్రభుత్వం విత్తనాలపై సబ్సిడీని ఎత్తేసింది. 2019 వరకు వరి, జొన్న, మక్క, సజ్జ వంటి ఆహార ధాన్యాలు, వేరుసెనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, సోయా వంటి నూనె గింజలు, కంది, పెసర, మినుము వంటి పప్పుధాన్యాల విత్తనాలపై రైతులకు 33 శాతం సబ్సిడీ ఇచ్చేది. 2020 నుంచి విత్తనాలన్నింటిపైనా సర్కారు  సబ్సిడీని ఎత్తివేసింది. రైతులకు మేలు రకం విత్తనాలను రాయితీపై అందివ్వకపోవడంతో నాణ్యమైన విత్తనాలు దొరక్క రైతులు ఇబ్బందిపడుతున్నరు. రైతులకు అవసరమైన విత్తనాలను సర్కారు సమకూర్చకపోవడంతో ఏటా విత్తనాల సమస్య ఏర్పడుతోంది. 

వచ్చే వానాకాలం సీజన్‌‌లో కోటిన్నర ఎకరాల్లో పంటలు సాగు వేయాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది. విత్తన ఏర్పాట్ల బాధ్యతను 57 శాతం వరకు రైతులు సొంతంగా తయారు చేసుకోవాల్సిందే అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మిగతా అవసరాలకు కూడా  ప్రైవేటు విత్తన కంపెనీల వద్ద కొనుగోలు చేయాలని చెబుతుండడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ప్రైవేటు కంపెనీల వద్ద రెట్టింపు ధరలతో విత్తనాలు కొని, అవి సరైన నాణ్యత లేక పంటలపై దుష్ర్పభావం పడి పంట దెబ్బతిని ఆగం అవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు విత్తనాల బాధ్యత నుంచి తప్పుకోవడంతో  కొన్ని విత్తనాలకు భారీగా కొరత ఏర్పడుతోంది. చాలా రకాల విత్తనాలు మార్కెట్‌‌లో తగినంతగా అందుబాటులో ఉండడం లేదు. 

కేంద్రం సబ్సిడీ ఇచ్చే  పచ్చిరొట్ట విత్తనాలకే పరిమితం

పంట పొలాలను సారవంతం చేసేందుకు  రైతులు వేసే పచ్చిరొట్ట ( జనుము, జీలుగ, పిల్లిపెసర ) విత్తనాలపై 65 శాతం సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం గత కొనేళ్లుగా అమలు చేస్తోంది. ఇదే పచ్చిరొట్ట విత్తనాలను వానాకాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. సేంద్రియ సాగు, నేల ఆరోగ్యం కాపాడేందుకు ఏటా మాదిరిగానే వచ్చే వానాకాలంలో రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా చేయడానికి రూ.76.66 కోట్లు వెచ్చించాలని తీసుకున్న నిర్ణయంతో మిగతా విత్తనాలకు రాయితీ ఇవ్వబోమని ప్రభుత్వం పరోక్షంగా సంకేతం ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈసారైనా రాయితీకి విత్తనాలు ఆశతో ఉన్న రైతులకు తాజా నిర్ణయంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.