సిరిసిల్ల మెడికల్ కాలేజీ భూములకు పరిహారం ఇయ్యని గత సర్కార్‌‌‌‌‌‌‌‌

సిరిసిల్ల మెడికల్ కాలేజీ భూములకు పరిహారం ఇయ్యని గత సర్కార్‌‌‌‌‌‌‌‌
  •     సిరిసిల్ల మెడికల్ కాలేజీ భూములకు పరిహారం ఇయ్యని గత సర్కార్‌‌‌‌‌‌‌‌ 
  •     కాలేజీ ముందు ఆందోళనకు దిగిన రైతులు 
  •     ఎన్నికల ముందు కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్‌‌‌‌ 
  •     కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌, రైతుల మధ్య వాగ్వాదం 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల పట్టణం పెద్దూర్ శివారులో నిర్మించిన సిరిసిల్ల మెడికల్​కాలేజీకి భూములు తీసుకొని పరిహారం ఇయ్యకుండా గత సర్కార్‌‌‌‌‌‌‌‌ చేతులెత్తేసింది. పరిహారం చెల్లించాలని, అప్పటిదాకా పనులు జరగనీయబోమని రెండు రోజుల కింద నిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. మరోవైపు ఎన్నికల ముందు తమకిచ్చిన హామీని నాటి మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ నెరవేర్చలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో నిర్మాణ పనులు అడ్డుకోగా కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌కు , రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేసుకునేదాకా వెళ్లింది. 

వెయ్యి గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చిన్రు

రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్దూర్ శివారులోని రెండో బైపాస్‌‌‌‌లో గత సర్కార్ 2021లో మెడికల్ కాలేజీ నిర్మాణం ప్రారంభించింది. ఈ కాలేజీ కోసం దళితులు, బీసీ రైతులు 50 మందికి చెందిన 40 ఎకరాలు తీసుకుంది. అప్పుడే రైతులు పనులను అడ్డుకోగా ఒక్కో రైతుకు వేరే చోట వెయ్యి గజాల స్థలం ఇస్తామని నాటి మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఒప్పుకొని భూములిచ్చారు. ఆ తర్వాత కాలేజీ నిర్మాణం కూడా పూర్తయింది. అప్పటి నుంచి రైతులకిచ్చిన హామీని గత సర్కార్ మరిచిపోయింది. ఎన్నికల మందు కూడా మరోసారి నిర్వాసిత రైతులను ఆదుకుంటామని, వారికిచ్చిన హామీని నెరవేరుస్తామని కేటీఆర్‌‌‌‌‌‌‌‌ మాట ఇచ్చారు. ఆ తర్వాత ఆయన కూడా ఆ సంగతి మరిచిపోయారు. 

అదనపు గదుల నిర్మాణ పనుల అడ్డగింత 

కాగా ఇప్పటిదాకా తమకు పరిహారం ఇవ్వలేదని ఆరోపిస్తూ కాలేజీలో అదనపు గదుల నిర్మాణ పనులను గురువారం నిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. దీంతో కాంట్రాక్టర్, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. ఉన్నతాధికారులకు సమస్యను నివేదిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ తమను బెదిరించాడని, అసభ్యంగా మాట్లాడాడని నిర్వాసిత రైతులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు కాంట్రాక్టర్ సైతం కొంత మంది రైతులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రైతులు చెబుతున్నారు. 

కాంట్రాక్టర్ బెదిరిస్తున్నడు 

మెడికల్ కాలేజీ కోసం ఉన్న భూమిని ఇచ్చి పరిహారం అడిగినందుకు కాంట్రాక్టర్ బెదిరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నడు. కాంట్రాక్టర్ బెదిరింపులపై పోలీసులను ఆశ్రయించాం. మూడేండ్ల నుంచి అధికారులకు, నాయకులకు విన్నవించినా మమ్మల్ని పట్టించుకోవడంలేదు. తాజాగా కాలేజీలో అదనపు గదులు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మాకు పరిహారం ఇచ్చేదాకా పనులను అడ్డుకుంటాం. 
- సలెంద్రి బాల్ రాజు, రైతు