భూభారతి మెడకు ధరణి ఉచ్చు! నాలుగేండ్ల పాటు ధరణిని ఆడిట్ చేయని ఫలితం.. రూ.50 కోట్ల స్కామ్కు ఊతం

భూభారతి మెడకు ధరణి ఉచ్చు!  నాలుగేండ్ల పాటు ధరణిని ఆడిట్ చేయని ఫలితం.. రూ.50 కోట్ల స్కామ్కు ఊతం
  • సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకొని ఇంటర్​నెట్, 
  • మీ సేవా నిర్వాహకులు, డాక్యుమెంట్​ రైటర్ల చేతివాటం
  • ఖజానాకు చేరాల్సిన రిజిస్ట్రేషన్ ​చార్జీలు సొంత ఖాతాలకు
  • దాదాపు 4 వేల లావాదేవీలపై అనుమానాలు.. ఇందులో 
  • 3 వేలకు పైగా ధరణిలోనే.. జనగామ ఘటనతో రంగంలోకి ఎన్​ఐసీ
  • పూర్తి అమౌంట్​ కట్టాకే ప్రాసెస్​ జరిగేలా భూభారతిలో మార్పులు
  • రెవెన్యూ అధికారుల పాత్రపైనా అనుమానాలు
  • సీఎం సీరియస్..  ఎంక్వైరీ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు 

హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన 'ధరణి' పోర్టల్ నిర్వహణలో వైఫల్యాలు  కొత్తగా వచ్చిన 'భూభారతి' కొంపముంచుతున్నాయి. భూముల రిజిస్ట్రేషన్ల కోసం ఏర్పాటు చేసిన ఆన్‌‌లైన్ విధానంలో సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు సాగించిన 'చలానా' మాయాజాలం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత నాలుగేళ్లుగా ధరణి పోర్టల్‌‌లో ఆడిట్ నిర్వహించకపోవడంతో దాదాపు రూ. 50 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్లు తెలుస్తోంది.

భూముల క్రయవిక్రయాల సమయంలో చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల విషయంలో ఇంటర్​నెట్, మీసేవా నిర్వాహకులు, డాక్యుమెంట్ రైటర్లు చేసిన భారీ స్కామ్ ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జనగామలో బయటపడ్డ ఒక చిన్న తీగను లాగితే.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 వేల లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లు తేలింది. ఇందులో 3 వేలకు పైగా లావాదేవీలు పాత ధరణి పోర్టల్ ద్వారానే జరగగా, మిగిలినవి భూభారతిలో జరిగినట్లు సమాచారం. రంగారెడ్డి, యదాద్రి భువనగిరి జిల్లాల్లోనే ఎక్కువగా ఈ తరహా చలానా​ మోసాలు జరిగినట్లు తెలిసింది. ఈ రెండు జిల్లాలు హైదరాబాద్​ను ఆనుకొని ఉండడం, భూముల విలువ కోట్లతో, రిజిస్ట్రేషన్​చార్జీలు లక్షల్లో ఉండడంతో రెవెన్యూ అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ధరణి టు భూభారతి.. అసలేం జరిగింది?

వాస్తవానికి ఈ అక్రమాలు నిన్న మొన్నటివి కావు. ధరణి పోర్టల్ అందుబాటులో ఉన్న గత నాలుగేళ్ల కాలంలో ఒక్కసారి కూడా థర్డ్ పార్టీ ఆడిట్ జరగకపోవడమే ఈ భారీ కుంభకోణానికి ప్రధాన కారణంగా గుర్తించారు. భూముల రిజిస్ట్రేషన్ల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 అక్టోబర్ 29న ఎంతో ప్రతిష్టాత్మకంగా 'ధరణి' పోర్టల్‌‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ, ఈ పోర్టల్ నిర్వహణ బాధ్యతలను విదేశీ సంస్థలకు కట్టబెట్టడం, గత నాలుగేళ్లలో ఒక్కసారి కూడా థర్డ్ పార్టీ ఆడిట్ చేయించకపోవడంతో అక్రమాలు బయటపడలేదు. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ధరణి స్థానంలో ప్రక్షాళన చేస్తూ 'భూభారతి' (కొత్త పోర్టల్ విధానం)ని తెరపైకి తెచ్చింది.  పోర్టల్ పేరు మారినా, బ్యాక్ ఎండ్‌‌లో ఉన్న సాఫ్ట్‌‌వేర్ లొసుగులను సరిదిద్దడంలో జాప్యం జరిగింది. పాత ధరణిలో ఉన్న టెక్నికల్ లోపాలనే ఆసరాగా చేసుకున్న కేటుగాళ్లు, కొత్తగా వచ్చిన భూభారతిలోనూ తమ చేతివాటం ప్రదర్శించి యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. రిజిస్ట్రేషన్లు చేసే బాధ్యత కలిగిన తహసీల్దార్లు (జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు) కూడా చలాన్లను క్షుణ్ణంగా పరిశీలించడంలో విఫలమయ్యారు. సిస్టమ్‌‌లో జనరేట్ అయిన చలాన్ నంబర్, అందులో ఉన్న మొత్తం, ప్రభుత్వ ఖాతాలో జమ అయిన మొత్తం సరిపోలుతుందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. కానీ, పని ఒత్తిడి సాకుతోనో, లేదా నిర్లక్ష్యంతోనో తహసీల్దార్లు కళ్లు మూసుకొని రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. ఇదే అదనుగా డాక్యుమెంట్ రైటర్లు, ఇంటర్​నెట్ సెంటర్ల నిర్వాహకులు ప్రభుత్వ ఆదాయానికి 50 కోట్ల రూపాయల మేర కన్నం వేశారు. జనగామ జిల్లాలో జరిగిన ఓ రిజిస్ట్రేషన్ ఇష్యూపై ఫిర్యాదు రావడంతో అప్రమత్తమైన అధికారులు తీగ లాగితే, రాష్ట్రవ్యాప్తంగా డొంక కదిలింది.

సాంకేతిక లోపమే పెట్టుబడి.. నయా దందా

భూముల రిజిస్ట్రేషన్ కోసం రైతులు, సామాన్య ప్రజలు మీసేవా కేంద్రాలను లేదా ఇంటర్నెట్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. సిటిజన్ లాగిన్‌‌లో స్లాట్ బుక్ చేసే సమయంలోనే రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది.  ఇక్కడే టెక్నికల్ లొసుగులను పసిగట్టిన కొందరు అక్రమార్కులు తమ చేతివాటం ప్రదర్శించారు. రైతుల నుంచి  రిజిస్ట్రేషన్‌‌కు కావాల్సిన పూర్తి డబ్బులను వసూలు చేస్తున్నారు. కానీ, పోర్టల్‌‌లో పేమెంట్ చేసే ఆప్షన్ వద్ద 'ఎడిట్' ఆప్షన్‌‌ను దుర్వినియోగం చేసి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని భారీగా తగ్గించి చూపిస్తున్నారు. ఉదాహరణకు లక్ష రూపాయలు కట్టాల్సి ఉంటే, కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఆన్‌‌లైన్‌‌లో కట్టి, మిగిలిన సొమ్మును జేబులో వేసుకుంటున్నారు. రైతులకు మాత్రం ఫుల్ పేమెంట్ చేసినట్లుగా రశీదులు సృష్టిస్తూ నమ్మించి మోసం చేస్తున్నారు. ఉదాహరణకు ఒక రైతు 2 లక్షల రూపాయాల చలాన్​ కట్టాల్సి ఉంటే అందులో 2 వేలు మాత్రమే ఖజానాకు వెళ్తున్నాయి. 

ఎన్‌‌ఐసీ ఎంట్రీ.. అక్రమాలకు చెక్

జనగామ ఘటన తర్వాత ప్రభుత్వం వెంటనే ఎన్‌‌ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్) అధికారులను రంగంలోకి దింపింది. ఎన్‌‌ఐసీ బృందం నిర్వహించిన ఆడిట్‌‌లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. చలానా జనరేషన్, పేమెంట్ గేట్‌‌వేల మధ్య ఉన్న సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు ఎన్‌‌ఐసీ చర్యలు చేపట్టింది. ఇకపై 'భూభారతి' పోర్టల్‌‌లో పూర్తి స్థాయి చలానా మొత్తం ప్రభుత్వ ఖాతాలో జమ అయితే తప్ప, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ముందుకు వెళ్లకుండా సాఫ్ట్‌‌వేర్‌‌లో కీలక మార్పులు చేసింది. గతంలో మాదిరి అక్రమాలకు తావులేకుండా పటిష్ట చర్యలు చేపట్టింది. 

దందా వెలుగుచూసింది ఇలా.. 

యాదాద్రి, వెలుగు: ధరణి నుంచి మొదలైన చలానా దందా భూభారతిలోనూ కొనసాగుతూ వచ్చింది. ల్యాండ్​ రిజిస్ట్రేషన్​ కోసం స్లాట్​బుకింగ్​ చేసుకుని రిజిస్ట్రేషన్​ చార్జీలు చెల్లించాకే తహసీల్దార్​ ఆఫీసులో రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ స్లాట్​ బుకింగ్​ కోసం రైతులు మీ సేవాతో పాటు ఇంటర్​ నెట్​ సెంటర్​ నిర్వాహకులు, డ్యాక్యుమెంట్​ రైటర్లను  ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో పోర్టల్​లోని లోపాన్ని కనిపెట్టిన నిర్వాహకులు పేమెంట్​ఆప్షన్​ను ఎడిట్​ చేస్తున్నట్లు తెలిసింది. ఉదాహరణకు రూ. 1,26,133 చెల్లించాల్సి ఉంటే చివరి రెండు అంకెలు తీసేసి కేవలం రూ. 1261 మాత్రమే ఉండేలా చూస్తున్నారు. డాక్యుమెంట్​పై క్రయ, విక్రేతల వివరాలు, వారి ఫొటోలు, ఆధార్​ కార్డు కాపీలు ఉంటాయి. డాక్యుమెంట్​వెనుకవైపున ఎండార్స్​మెంట్​లో ఈ చాలనాలో చెల్లించిన స్టాంప్​ డ్యూటీ వివరాలు ఉంటాయి. ఈ వివరాలను తహసీల్దార్లు పరిశీలిస్తే సదరు రిజిస్ట్రేషన్​కు ఎంత మొత్తం చెల్లించారో తెలుస్తుంది. 

కానీ డాక్యుమెంట్​లో క్రయ, విక్రేతల వివరాలు చూసి రిజిస్ట్రేషన్​ చేయడంతో ఈ విషయం ఇన్నాళ్లూ వెలుగులోకి రాలేదు. డిసెంబర్​ 24న జరిగిన ఓ రిజిస్ట్రేషన్​ డ్యాక్యుమెంట్​ను  జనగామ తహసీల్దార్​ ఇంద్రవెళ్లి హుస్సేన్​పరిశీలించగా, ఈ మోసం వెలుగుచూసింది. మొత్తం 10 డాక్యుమెంట్లు ఇలాగే ఉండడం, సర్కారు ఖజానాకు చేరాల్సిన రూ. 8,68,884 కుగాను కేవలం రూ. 13,307 మాత్రమే జమకావడంతో ఖంగుతిన్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లగా, వారి సూచనల మేరకు ఈ నెల 7న జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు స్లాట్​ బుకింగ్​ చేసిన సెంటర్లనిర్వాహకులను గుర్తించి విచారించారు. విచారణలో  యాదగిరిగుట్టలోని ఇంటర్​ నెట్​ నిర్వాహకుడు బస్వరాజును ప్రధాన నిందితుడిగా తేల్చి, అదుపులోకి తీసుకున్నారు. అదేరోజు రాత్రి  యాదగిరిగుట్టకు చేరుకున్న వరంగల్​ సీసీఎస్​ పోలీసులు బస్వరాజును అదుపులోకి తీసుకొని వరంగల్​కు తరలించారు.  వరంగల్ సీపీ సమక్షంలో అతడిని విచారించగా రాజాపేటలోని మరో నిర్వాహకుడు పాండు పేరు బయటకు వచ్చింది. దీంతో అతనిని కూడా శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

సీఎం సీరియస్..రికవరీకి ఆదేశాలు

ఈ వ్యవహారంపై సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  సీరియస్​ అయినట్లు తెలిసింది. రైతులను మోసం చేసి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన వారిని ఉపేక్షించేది లేదని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. తక్షణం దీనిపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు గుర్తించిన 4 వేల అనుమానిత లావాదేవీలపై జిల్లాలు, మండలాల వారీగా ఎంక్వైరీ రిపోర్ట్ పంపించాలని స్పష్టం చేశారు. తక్కువ చలానా కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి నుంచి, లేదా మోసానికి పాల్పడిన కేంద్రాల నిర్వాహకుల నుంచి డబ్బు రికవరీ చేయాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి హెచ్చరించారు.  మొత్తానికి ధరణిలో మొదలైన పాపం, ఇప్పుడు భూభారతికి శాపంగా మారి రెవెన్యూ శాఖను ఇబ్బంది పెడుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి .