ఏపీకి నీళ్లు.. కల్వకుర్తికి కష్టాలు

ఏపీకి నీళ్లు.. కల్వకుర్తికి కష్టాలు
  • మూడేండ్లయినా రిపేరు కాని ఎల్లూరు పంపులు
  • పోతిరెడ్డిపాడు ద్వారా 13వేల క్యూసెక్కులు తరలించుకపోతున్న ఏపీ
  • కేఎల్ఐ కింద తెలంగాణ వాడుకుంటున్నది 2,400 క్యూసెక్కులే
  • వానల్లేక ఎండుతున్న పంటలు, ఆందోళనలో ఆయకట్టు రైతులు

నాగర్​కర్నూల్, వెలుగు: కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్​పై సర్కారు నిర్లక్ష్యం ఉమ్మడి పాలమూరు రైతులకు శాపంగా మారింది. మూడేండ్ల కింద నీటమునిగిన ఎల్లూరు పంపులకు రిపేర్లు చేయకపోవడంతో 4.5 లక్షల ఎకరాల్లో పంటల సాగు ప్రశ్నార్థకమవుతున్నది. ముఖ్యంగా చివరి ఆయకట్టుకు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. ఓవైపు ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 13 వేల క్యూసెక్కులు, ముచ్చుమర్రి, హంద్రీనీవా ద్వారా మరో వెయ్యి క్యూసెక్కుల నీటిని కృష్ణానది నుంచి తరలించుకుపోతుంటే.. తెలంగాణ ప్రభుత్వం 2,400 క్యూసెక్కుల నీటిని మాత్రమే తీసుకుంటున్నది. ఎల్లూరు లిఫ్ట్​లో మూడేండ్ల కింద జరిగిన ప్రమాదంలో రెండు పంపులు దెబ్బతినగా ఇంతవరకు రిపేర్ చేయలేకపోయింది. దాదాపు రూ.3 కోట్లు ఖర్చు చేసినా రెండు పంపులు పని చేయడం లేదు. దీంతో ఐదు పంపులతో రోజుకు 4వేల క్యూసెక్కుల నీటిని ఎత్తి పోయాల్సి ఉండగా ప్రస్తుతం మూడు పంపులతో కేవలం 2400 క్యూసెక్కుల నీటిని మాత్రమే లిఫ్ట్ చేస్తున్నారు.

ఆలస్యంగా తెలంగాణ..

గతేడాది భారీ వర్షాలతో కృష్ణానదికి వరద రావడంతో జులై మూడో వారంలోనే శ్రీశైలం ప్రాజెక్ట్ నిండింది. చివరి వారంలో మూడు సార్లు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు.  కల్వకుర్తి ఆయకట్టుకు జులై రెండో వారంలోనే నీటిని వదిలారు. కానీ, ఈ ఏడాది కృష్ణాబేసిన్​లో అంతగా వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతం శ్రీశైలం నీటిమట్టం 860 అడుగులు ఉంది. అయితే శ్రీశైలంలో వాటర్ లెవెల్​850 అడుగులకు చేరగానే ఆగస్టు 1 నుంచే ఏపీ వైపు ఉన్న పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి 13వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్తున్నారు. మన వైపు మాత్రం ఐదు రోజులు ఆలస్యంగా ఆగస్టు 6 నుంచి కల్వకుర్తి లిఫ్ట్​ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. కేవలం 4 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్లలో అప్పటికే నీళ్లు ఉండడం, ప్యాకేజీ 28,29,30 కింద నీరు వదిలినా కాల్వలు సరిగాలేకపోవడంతో చివరి ఆయకట్టుకు నీళ్లు అందట్లేదు. దీంతో నాగర్ కర్నూల్, తెల్కపల్లి, ఉప్పునుంతల, వంగూరు, కల్వకుర్తి, వెల్దండ మండలాల్లో పంట పొలాలు ఆరిపోతున్నాయి. ఈ సీజన్​లో వర్షాలు ఆలస్యం కావడం, వర్షపాతం తక్కువగా ఉండడంవల్ల వరినాట్లు ఆలస్యమయ్యాయి. కల్వకుర్తి నుంచి కూడా నీటివిడుదల ఆలస్యం కావడంతో వరితో పాటు పత్తి, మక్క, జొన్నలాంటి పంటలు కూడా వడలిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు నానాతంటాలు పడుతున్నారు.

మూడేండ్లయినా రిపేర్ కాలే..

మూడేండ్ల కింద జరిగిన ప్రమాదంలో ఎల్లూరు పంప్​హౌజ్​లోకి నీరు చేరి ఐదు పంపులు మునిగాయి. నీటిని తోడేసిన తర్వాత రిపేర్లు మొదలు పెట్టారు. బేస్​ నుంచి విడిపోయిన మూడవ పంపు, ప్రొటెక్షన్​ వాల్​ కూలిన ఐదో పంపు రిపేర్ల కోసం రూ.3 కోట్లు ఖర్చు చేశారు. ఎల్లూరు లిఫ్ట్​ కాంట్రాక్టర్ అయిన పటేల్ కంపెనీని కాదని రిపేర్​పనులను మేఘా కంపెనీకి అప్పగించారు. వారు ఇపీపీఎల్​ సంస్థకు సబ్​లీజ్​కు ఇచ్చారు. సర్జ్​పూల్, పంప్​హౌజ్​ల మధ్య ప్రొటెక్షన్ వాల్ బీటలు వారడంతో ఐదో పంప్​ను వాడుకునే అవకాశం లేదని   మూడేండ్లుగా మూసేశారు. ప్రొటెక్షన్ వాల్ బీటలు పూడ్చటం సాధ్యం కాదని తేల్చేశారు. ఇక మూడో పంప్​ రిపేర్లు కొనసాగుతున్నాయి. ఈ పంపును బాగు చేసేందుకు అవసరమైన పార్ట్స్ కొనడానికి ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​నుంచి పర్మిషన్​ రాకపోవడంతో పనులు ముందుకు సాగడంలేదని ఇంజినీర్లు చెప్తున్నారు. నిర్వహణ మాత్రమే ఏజన్సీలకు ఇచ్చి.. పార్ట్స్ కొనే అధికారాన్ని ఇరిగేషన్ శాఖకే ఇవ్వడంతో పనుల్లో జాప్యం జరుగుతోందని అంటున్నారు. ఎల్లూరు లిఫ్ట్ రిపేర్ చేసి ఎండాకాలంలో నీళ్లిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు చెప్పారే తప్ప హామీ నిలబెట్టుకోలేకపోయారు.

పంట పోతే మేం పోయినట్టే

దుక్కి దున్నినప్పుడు బాగనే మొగులయ్యింది. వానలు పడుతయని విత్తనాలేసినం. అసలు టైంలో వానలు పడ్తలేవు. వేసిన పంటలు ఎండిపోతున్నయి. ఏం చేయాల్నో తోస్తలేదు. పంట చేతికొస్తేనే చేసిన అప్పులు తీరుతయి. పంట పోతే మేం కూడా పోయినట్లే.
బండపల్లి పుల్లయ్య, వంగూరు, నాగర్​కర్నూల్ జిల్లా 

మక్క చేను ఎండుతున్నది

ఆరు ఎకరాల్లో మక్కలు వేసిన. రూ.30 వేలు పెట్టుబడి పెట్టిన. వాన పడలేదు. కేఎల్ఐ నీళ్లొస్తేనన్న పంటకు ఆసరా అయితదనుకున్న. ఇప్పటిదాక కాలువల్లో నీళ్లు రాలేదు.  నీళ్లు లేక పంట చేతికి వస్తదో లేదో తెలుస్తలేదు.

- బొల్లంపల్లి హనుమంతు,  సదగోడు, నాగర్​కర్నూల్​ జిల్లా