
- రానున్న వారంలో 9 మెయిన్ బోర్డ్, 17 ఎస్‌ఎంఈ ఐపీఓలు ఓపెన్
- మార్కెట్ పెరుగుతుండడంతో ముందుకొస్తున్న కంపెనీలు
న్యూఢిల్లీ: మార్కెట్ పెరుగుతుండడంతో కంపెనీలు తమ ఐపీఓలను ఓపెన్ చేయడానికి ముందుకొస్తున్నాయి. వచ్చే వారం (సెప్టెంబర్ 22–28) ప్రైమరీ మార్కెట్ అత్యంత బిజీగా ఉండనుంది. మెయిన్‌బోర్డ్‌లో మొత్తం తొమ్మిది కంపెనీలు తమ పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులు సమీకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎస్‌ఎంఈ విభాగంలో మరో 17 కంపెనీలు ఐపీఓల కోసం బిడ్డింగ్ ప్రారంభించనున్నాయి.
మెయిన్ బోర్డ్ ఐపీఓలు..జైన్ రిసోర్సెస్ రీసైక్లింగ్
ఈ కంపెనీ ఐపీఓ సెప్టెంబర్ 24న ప్రారంభమై 26న ముగుస్తుంది. మొత్తం రూ.1,250 కోట్ల విలువైన ఈ ఇష్యూలో 2.16 కోట్ల షేర్ల ఫ్రెష్ ఇష్యూ, 3.23 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ఉన్నాయి. ప్రైస్ బ్యాండ్‌ను షేరుకి రూ.220–రూ.232 గా కంపెనీ నిర్ణయించింది. కనీసం 64 షేర్లకు బిడ్ వేయాలి. అంటే ఇన్వెస్టర్ కనీసం రూ.14,848 పెట్టుబడి పెట్టాలి. ఈ కంపెనీ షేర్ల లిస్టింగ్ అక్టోబర్ 1 ఉంటుంది.
గణేష్ కన్జూమర్ ప్రొడక్ట్స్
గణేష్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ఐపీఓ కూడా సెప్టెంబర్ 22–24 మధ్య అందుబాటులో ఉంటుంది. ప్రైస్ బ్యాండ్‌ను రూ.306–రూ.322 గా కంపెనీ నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.408.8 కోట్లను సేకరించాలని చూస్తోంది. ఈ ఐపీఓ కోసం కనీసం 46 షేర్లకు రూ.14,812 పెట్టుబడి పెట్టాలి. లిస్టింగ్ సెప్టెంబర్ 29న ఉంటుంది.
శేషసాయి టెక్నాలజీస్
ఈ ఐపీఓ సెప్టెంబర్ 23న ఓపెనై, 25న ముగుస్తుంది. ఈ ఇష్యూ సైజ్ రూ.813.07 కోట్లు. ప్రైస్ బ్యాండ్‌ను రూ.402–రూ.423 గా నిర్ణయించారు. కనీసం 35 షేర్లకు రూ.14,805 పెట్టుబడి పెట్టాలి. సెప్టెంబర్ 30న లిస్టింగ్ ఉంటుంది.
సోలార్ వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్
సోలార్ వరల్డ్ తన ఐపీఓను సెప్టెంబర్ 23న ఓపెన్ చేయనుంది. 25 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ పబ్లిక్ ఇష్యూ సైజ్ రూ.490 కోట్లు. ఐపీఓలో షేరు ధర రూ.333–రూ.351. కనీసం 42 షేర్లకు రూ.14,742 పెట్టుబడి అవసరం. లిస్టింగ్ సెప్టెంబర్ 30న ఉండే అవకాశం ఉంది.
జారో ఇన్‌స్టిట్యూట్
జారో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఐపీఓ సెప్టెంబర్ 23–25 మధ్య అందుబాటులో ఉంటుంది. రూ.450 కోట్ల ఇష్యూ ఇది. షేరు ధరను రూ.846–రూ.890గా నిర్ణయించారు. కనీసం 16 షేర్లకు బిడ్ వేయాలి. లిస్టింగ్ సెప్టెంబర్ 30న ఉంటుంది.
ఈప్యాక్ ప్రిఫ్యాబ్ టెక్నాలజీస్
ఈ కంపెనీ ఐపీఓ సెప్టెంబర్ 24–26 మధ్య అందుబాటులో ఉంటుంది. ఐపీఓ షేరు ధరను రూ.194–రూ.204 గా నిర్ణయించారు. ఈ రూ.504 కోట్ల ఇష్యూ కోసం బిడ్ వేయాలంటే కనీసం రూ.14,892 పెట్టుబడి పెట్టాలి. లిస్టింగ్ అక్టోబర్ 1 న ఉంటుంది.
జింకుషల్ ఇండస్ట్రీస్
ఈ కంపెనీ ఐపీఓ సెప్టెంబర్ 25న ఓపెనై, 29న ముగుస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.116.15 కోట్లు సేకరించాలని కంపెనీ చూస్తోంది. 10 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అమ్ముతారు. ప్రైస్ బ్యాండ్ ధర రూ.115–రూ.121. కనీసం 120 షేర్లకు రూ.14,520 పెట్టుబడి అవసరం.
ఎస్‌ఎంఈ ఐపీఓలు
ఎస్‌ఎంఈ విభాగంలో సెప్టెంబర్ 22న ప్రైమ్ కేబుల్ ఇండస్ట్రీస్, సాల్వెక్స్ ఇడిబుల్స్ ఐపీఓలు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 23న భారత్ రోహన్ ఎయిర్‌బోర్న్ ఇన్నోవేషన్స్, ఆప్టస్ ఫార్మా, ట్రూ కలర్స్, మ్యాట్రిక్స్ జియో సొల్యూషన్స్, ఎన్‌ఎస్‌బీ బీపీఓ సొల్యూషన్స్, ఈకోలైన్ ఎక్సిమ్ ఐపీఓలు ప్రారంభమవుతాయి.
సెప్టెంబర్ 24న సిస్టమాటిక్ ఇండస్ట్రీస్, జస్టో రియల్‌ఫిన్‌టెక్, రిధ్ది డిస్‌ప్లే ఎక్విప్‌మెంట్స్, గురునానక్ అగ్రికల్చర్ ఇండియా, ప్రరుహ్ టెక్నాలజీస్ ఐపీఓలు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్ 25న టెల్జ్ ప్రాజెక్ట్స్, చాటర్‌బాక్స్ టెక్నాలజీస్, భావిక్ ఎంటర్‌ప్రైజెస్ ఐపీఓలు ప్రారంభమవుతాయి. డీఎస్‌ఎం ఫ్రెష్ ఫుడ్స్ ఐపీఓ సెప్టెంబర్ 26న ఓపెన్ అవుతుంది.
ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్
ఆనంద్ రాఠీ ఐపీఓ సెప్టెంబర్ 23–25 మధ్య అందుబాటులో ఉంటుంది. రూ.745 కోట్లను ఈ ఇష్యూ ద్వారా సేకరించాలని కంపెనీ చూస్తోంది. ఇది పూర్తిగా ఫ్రెష్ షేర్ల ఇష్యూ. షేరు ధరను రూ.393–రూ.414 గా నిర్ణయించారు. కనీసం 36 షేర్లకు రూ.14,904 పెట్టుబడి పెట్టాలి. లిస్టింగ్ సెప్టెంబర్ 30 న ఉంటుంది.
అట్లాంటా ఎలక్ట్రికల్స్
ఈ నెల 22–24 మధ్య ఈ కంపెనీ ఐపీఓ అందుబాటులో ఉంటుంది. ఇందులో రూ.400 కోట్ల ఫ్రెష్ షేర్ల ఇష్యూ, రూ.287.34 కోట్ల ఓఎఫ్‌ఎస్ ఉంటాయి. ప్రైస్ బ్యాండ్ రూ.718–రూ.754. కనీసంగా 19 షేర్లకు రూ.14,326 పెట్టుబడి అవసరం. లిస్టింగ్ సెప్టెంబర్ 29 న ఉంటుంది.