
- పామాయిల్ కంపెనీకి ‘ప్రాణహిత’ భూములు
- రూ.10.66 కోట్లు తీసుకోకుండానే అప్పనంగా అప్పగించిన బీఆర్ఎస్ సర్కారు
- మందమర్రి మండలం సారంగపల్లిలో 71.05 ఎకరాలు కేటాయింపు
- ఎకరానికి రూ.15 లక్షల మార్కెట్ వ్యాల్యూ నిర్ణయించిన కలెక్టర్
- ఏడాదయినా డబ్బులు కట్టని మాట్రిక్స్ కంపెనీ
- ఆ భూములు వెనక్కు తీసుకోవాలని డిమాండ్లు
మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించిన భూములను గత బీఆర్ఎస్ సర్కారు మ్యాట్రిక్స్ ప్రైవేట్ కంపెనీకి అడ్డదారిలో అప్పగించింది. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 71.05 ఎకరాలను కట్టబెట్టింది.
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించిన భూములను గత బీఆర్ఎస్ సర్కారు మ్యాట్రిక్స్ ప్రైవేట్కంపెనీకి అడ్డదారిలో అప్పగించింది. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 71.05 ఎకరాలను మ్యాట్యిక్స్ పామాయిల్ ఇండస్ర్టీస్ ప్రైవేట్ లిమిడెట్కు ఉత్తి పుణ్యానికే కట్టబెట్టింది. సదరు కంపెనీ ప్రభుత్వానికి కట్టాల్సిన రూ.10.66 కోట్లు చెల్లించకున్నా... ఈ ఏడాది అక్టోబర్1న అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ఆ పామాయిల్ కంపెనీ నిర్మాణానికి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. తాజాగా కాంగ్రెస్ సర్కారు ప్రాణహిత ప్రాజెక్టుపై ఫోకస్ చేయడంతో ఈ భూముల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాల, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. మందమర్రి మండలం శంకర్పల్లి వద్ద పామాయిల్ ఇండస్ర్టీ నిర్మాణానికి పూనుకుంది. ఆ బాధ్యతను హైదరాబాద్‌కు చెందిన మ్యాట్రిక్స్ పామాయిల్ఇండస్ర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పగించింది.
పామాయిల్ మిల్, రిఫైనరీ, ఫ్రాక్షనేషన్, ప్యాకింగ్ యూనిట్ల కోసం మందమర్రి మండలం సారంగపల్లి శివారులో ఉన్న 95, 97, 112, 113, 119 సర్వే నంబర్లలో 71.05 ఎకరాలు కేటాయించింది. మార్కెట్ వ్యాల్యూ ఎకరానికి రూ.15 లక్షల చొప్పున మొత్తం రూ.10 కోట్ల 66 లక్షల 87 వేలుగా నిర్ణయిస్తూ సీసీఎల్ఏ ఈ ఏడాది జనవరి 2న ప్రొసీడింగ్స్ జారీ చేసింది. ఆ డబ్బులు కట్టాలంటూ ఫిబ్రవరి 27న కలెక్టర్ బదావత్ సంతోష్.. మ్యాట్రిక్స్ సీఈఓకు లేఖ రాశారు. కానీ, ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండడంతో కంపెనీ ప్రతినిధులు కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోలేదు. ఇప్పటికి ఏడాది అవుతున్నా డబ్బులు చెల్లించలేదు.
పనులు చేపట్టకపోవడంపై అనుమానాలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఆయిల్ పామ్ రైతులను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పామాయిల్ ఇండస్ర్టీపై హడావుడి చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 1న మాజీ మంత్రి కేటీఆర్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆర్భాటంగా ఆ కంపెనీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.500 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రత్యక్షంగా 250 మందికి, పరోక్షంగా 500 మందికి ఉపాధి దొరుకుతుందని అప్పుడు మంత్రి ప్రకటించారు. జిల్లాలో 2020లో ప్రయోగాత్మకంగా ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటివరకు 2,800 ఎకరాలకు విస్తరించింది. ఈ ఏడాది నుంచి దిగుబడి రావడం ప్రారంభమైంది. దీంతో సంవత్సరంలోగా మినీ రిఫైనరీ నిర్మాణం పూర్తి చేసి పామాయిల్ ఉత్పత్తి ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది. శంకుస్థాపన చేసి మూడు నెలలైనా పనులు మొదలు పెట్టకపోవడంతో రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రాణహితకు భూములెట్ల?
15 ఏండ్ల కిందట అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ సర్కారు.. ప్రాణహిత ప్రాజెక్టును పక్కనపెట్టి వివాదాస్పద కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. దీంతో ప్రాణహిత కాల్వలు, పైపులైన్లు, టన్నెల్స్, పంపుహౌస్‌ల కోసం సేకరించిన భూములు నిరుపయోగంగా మారాయి. పలుచోట్ల పడావుగా ఉన్న భూములను రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రాణహిత భూములను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూ కన్వర్షన్ చేసి మ్యాట్రిక్స్ కంపెనీకి బీఆర్ఎస్ సర్కారు అప్పగించింది.
ఆ ప్రాంతంలో ఖాళీగా ఉన్న వందల ఎకరాలపై అప్పటి సర్కారు పెద్దలు కన్నేసినట్టు సమాచారం. ఈ భూములను టీఎస్ఐఐసీకి కేటాయించి ఆ తర్వాత ఉత్తి పుణ్యానికే మ్యాట్రిక్స్ కంపెనీ పరంచేసేందుకు ప్లాన్ వేసినట్లు తెలిసింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టుపై ఫోకస్ చేయడంతో పరాధీనమైన భూములను స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ భూములను సర్కారు స్వాధీనం చేసుకోనట్టయితే ప్రాణహిత కోసం మళ్లీ రైతుల భూములు సేకరించడం కష్టమన్న వాదనలు వినిపిస్తున్నాయి