వీధికుక్కల సమస్యను పరిష్కరించాలి

వీధికుక్కల సమస్యను పరిష్కరించాలి

భారతదేశంలో  వీధి కుక్కల సమస్య ఆందోళన కలిగించే విషయం,  దేశవ్యాప్తంగా సుమారు 62 మిలియన్ల వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా.  అధిక సంఖ్యలో వీధి కుక్కలు ఉన్న కొన్ని రాష్ట్రాలలో.. ఉత్తరప్రదేశ్ 20.6 లక్షలకు పైగా వీధి కుక్కలతో  ముందుంది.  ఇది అత్యంత ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రాలలో ఒకటి.  ఆ తర్వాత ఒడిశాలో 17.3 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.  మహారాష్ట్రలో సుమారు 12.8 లక్షల వీధి కుక్కలు ఉన్నాయి.  రాజస్థాన్​లో  సుమారు 12.8 లక్షల వీధి కుక్కలు ఉన్నాయి.  కర్నాటకలో 11.4 లక్షల వీధి కుక్కలతో  సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతంగా నమోదైంది, -  దేశ రాజధాని ఢిల్లీ  నగరంలో సుమారు 8 లక్షల నుంచి 1 మిలియన్ వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా వేయడమైనది.  కాగా,  2022 నుంచి 2024 మధ్య 13.5 లక్షల కుక్క కాటు కేసులు నమోదయ్యాయి.  2024లో 42 రేబిస్ మరణాలు నమోదయ్యాయి. ఈ ఏడాది  జనవరి– జూన్  మధ్య 35,198 జంతువుల కాటు సంఘటనలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ లో వీధికుక్కల బెడదతో చాలామంది జీహెచ్​ఎంసీ  అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.  భారతదేశంలోనే అతి పెద్ద  నగరంగా  పేరొందిన హైదరాబాద్​లో కూడా వీధి కుక్కల తిప్పలు తప్పట్లేదు.   వీధుల్లో ఒంటరిగా వాకింగ్ చేయాలన్నా,  చిన్నపిల్లల తల్లిదండ్రులు ఒంటరిగా పిల్లలను ఆడుకోవడానికి బయటికి పంపాలన్నా వణికిపోతున్నారు. 

యాంటీ రేబిస్ టీకాలు అందుబాటులో ఉంచాలి

ఇటీవల హయత్​నగర్​లో  మూగ పిల్లాడి మీద 20 వీధి కుక్కల దాడి జరిగితే ముఖ్యమంత్రి సైతం ఆరా తీయడం జరిగింది.   ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు పట్టించుకోవడం ఆ తర్వాత షరా మామూలే.  అసలు హైదరాబాద్ నగరంలో 3లక్షల 80 వేల కుక్కలు ఉన్నట్టు అంచనా.   రోజుకు 300కి పైగా జనాలు కుక్క కాట్లకి గురి అవుతున్నారు.   ఏడాదికి దాదాపు లక్ష మందికిపైగా వీధి కుక్కల బాధితులు ఉన్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అధికారులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.  ఇప్పటికే దేశంలో  వీధి కుక్కల నియంత్రణపై రాష్ట్రాల అలసత్వం పై సుప్రీంకోర్టు  సీరియస్ అయింది. అన్ని రాష్ర్టాలు  వీధి కుక్కల లెక్కలు చెప్పాలని,   కుక్కల ప్రవేశం లేకుండా కాలనీలలో ఫెన్సింగ్​లు ఏర్పాటు చేయాలని,  బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ చేసి షెల్టర్ హోమ్స్ కు తరలించాలని, 3 నెలలకొకసారి  స్టెర్లింగ్ చేయాలనీ, యాంటీ  రేబిస్ టీకాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని మార్గదర్శకాలను విడుదల చేసింది, ఇవన్నీ పాటించనియెడల అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలపై చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది.  ఇప్పటికైనా అధికారులు, జంతు ప్రేమికులు సమస్యను గుర్తించి తగిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.

- బండి జయసాగర్ రెడ్డి