- పెరుగుతున్న కాంగ్రెస్ బలం
- జడ్పీ పీఠంపై ఎఫెక్ట్
- పాగాల మృతితో చిల్పూరు జడ్పీటీసీ స్థానం ఖాళీ
- ఆసక్తికరంగా జిల్లా పరిషత్ రాజకీయం
జనగామ, వెలుగు : జిల్లా పరిషత్‌లో బీఆర్ఎస్ గ్రాఫ్రోజురోజుకీ పడిపోతోంది. జనగామ జిల్లాలో ప్రతిపక్షమే లేకుండా 12 జడ్పీటీసీ స్థానాలతో ఏర్పడిన పాలకవర్గంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు జడ్పీటీసీలు పార్టీ మారగా, జడ్పీచైర్మన్‌గా ఉన్న చిల్పూరు జడ్పీటీసీ పాగాల సంపత్‌రెడ్డి గత డిసెంబర్లో హఠాన్మరణంతో ఆ స్థానం ఖాళీ అయింది. మిగిలిన జడ్పీటీసీలు కూడా హస్తం వైపు మొగ్గు చూపుతుండడంతో జడ్పీ రాజకీయం ఆసక్తి రేపుతోంది.
అనుకోని ఛాన్స్..
జనగామ జిల్లాలో 12 మండలాలు ఉండగా, 2019లో జరిగిన జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికల్లో అన్ని మండలాలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. దీంతో ప్రతిపక్షమే లేకుండా పోయింది. జడ్పీ చైర్మన్ పీఠానికి బీఆర్ఎస్లోనే అప్పట్లో తీవ్ర పోటీ నెలకొంది. ఉద్యమకారుడి కోటాలో అప్పటి సీఎం కేసీఆర్ చిల్పూరు జడ్పీటీసీ పాగాల సంపత్‌రెడ్డికి అవకాశం కల్పించారు. ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అండదండలతో సంపత్‌రెడ్డి జడ్పీ చైర్మన్ అయ్యారు. వైస్‌చైర్ పర్సన్‌గా బచ్చన్నపేట జడ్పీటీసీ గిరబోయిన భాగ్యలక్ష్మిని ఎంపిక చేశారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత జడ్పీ చైర్మన్ పాగాల గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.
దీంతో జడ్పీ చైర్మన్ పీఠం ఖాళీ కావడంతో వైస్‌చైర్‌పర్సన్‌గా ఉన్న గిరిబోయిన భాగ్యలక్ష్మికి చైర్‌పర్సన్‌గా అవకాశం దక్కింది. ఈమె అభ్యర్థిత్వాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన జడ్పీటీసీలు నిబంధనల కారణంగా ఏమీ చేయలేక పోయారు. అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఆమెనే బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె చైర్‌పర్సన్‌గా ఉన్నప్పటికీ జడ్పీటీసీలు అయిష్టంగానే ఉన్నారు. గత నెలలో జరిగిన జడ్పీ జనరల్‌బాడీ మీటింగ్‌కు ఎక్కువ మొత్తం జడ్పీటీసీలు డుమ్మా కొట్టడమే ఉదాహరణగా చెప్పవచ్చు.
సగానికి సగం..
రేవంత్సర్కారు ఏర్పడ్డాక బీఆర్ఎస్ నుంచి ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరడంతో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. ఇటీవల జనగామ జిల్లాలోని పలువురు జడ్పీటీసీలు కాంగ్రెస్‌లోకి రావడంతో జడ్పీ పీఠంపై ఎఫెక్ట్ పడుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. జిల్లాలో 12 మంది బీఆర్ఎస్ జడ్పీటీసీలు ఉండగా, చిల్పూరు జడ్పీటీసీ మృతితో అది ఖాళీగా ఉంది. ఇప్పట్లో అక్కడ ఎన్నికలు జరిపే పరిస్థితులు లేవు. మిగిలినవి 11 స్థానాలు ఉండగా, అందులో ఐదుగురు జడ్పీటీసీలు కాంగ్రెస్‌లో చేరారు. గత నెలలో జనగామ జడ్పీటీసీ నిమ్మతి దీపిక మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా
కడియం ఎపిసోడ్ నేపథ్యంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని రఘునాథపల్లి జడ్పీటీసీ బొల్లం అజయ్, లింగాల ఘన్పూర్ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, జఫర్ఘడ్జడ్పీటీసీ ఇల్లందుల బేబీ కూడా ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక స్టేషన్‌ఘన్‌పూర్ జడ్పీటీసీ మారపాక రవి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో జడ్పీలో కాంగ్రెస్ బలం 5కు చేరగా, బీఆర్ఎస్ బలం 6 గా ఉంది. కొద్ది రోజుల్లో మరికొందరు చేరుతారని, కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ లెక్కన బీఆర్ఎస్ జడ్పీటీసీల్లో ఒకరిద్దరు కాంగ్రెస్ వైపునకు మొగ్గు చూపితే జడ్పీ పీఠం కాంగ్రెస్ వశమవుతుంది. రాష్ట్రంలోని పలుచోట్ల మున్సిపల్ పీఠాలను చేజార్చుకుంటున్న బీఆర్ఎస్ జనగామ జడ్పీ పీఠాన్ని కూడా వదులు కోవాల్సి వస్తుందనే ఊహాగానాలు నెలకొన్నాయి.